Monday, April 29, 2024

మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూల్ సిద్ధం..

తప్పక చదవండి
  • దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం..
  • వివరాలు ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం..
  • 5 రాష్ట్రాల్లో 34 పైగా ర్యాలీల నిర్వహణ..
  • మూడవసారి విజయం సాధించే దిశగా మోడీ కసరత్తు..

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ రాజకీయ ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించి పోస్టర్‌ బాయ్‌గా ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ నిలబెట్టింది. ప్రధాని మోదీ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 34 నుండి 35 ర్యాలీలు నిర్వహించనున్నారు. వీటిలో మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 ర్యాలీలు, రాజస్థాన్‌లో 10 ర్యాలీలు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ల్లో 6 ర్యాలీల చొప్పున, మిజోరంలో ఒక ర్యాలీలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అక్టోబర్ 21న మధ్యప్రదేశ్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వరుసగా అయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అయితే పీఎంవో కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా సింధియా స్కూల్ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకునే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం, పాఠశాలలో బహుళ ప్రయోజన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. విశిష్ట పూర్వ విద్యార్థులు, అత్యుత్తమ సాధకులకు వార్షిక అవార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

సింధియా స్కూల్ 1897లో అప్పటి గ్వాలియర్ రాచరిక రాష్ట్రంచే స్థాపించబడింది. ఇది చారిత్రాత్మక గ్వాలియర్ కోటపై ఉంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సింధియా రాజకుటుంబానికి చెందిన వారసుడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నాయకుడు. ఇదిలావుంటే నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే, మధ్యప్రదేశ్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నేరుగా మద్దతు ఇస్తారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో, మధ్యప్రదేశ్‌తో తనకు ఎప్పుడూ ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అపూర్వమైన విజయాలకు దారితీస్తున్న సమయంలో ప్రజలు తనపై అపరిమితమైన ప్రేమను కురిపించారని మోదీ అన్నారు .

- Advertisement -

అభ్యర్థుల ఎన్నికలో మోడీ కసరత్తు :
ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ పార్టీ సీఈసీ సభ్యులు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల పేర్లపై మేధోమథనం జరగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు