Monday, May 13, 2024

మాట తప్పడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది

తప్పక చదవండి
  • హామీల అమలులో కాంగ్రెస్‌ వెనుకంజ
  • ఎమ్మెల్సీ కవిత విమర్శలు

హైదరాబాద్‌ : మాట తప్పడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అయోమయంలో ఉందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. హిజాబ్‌ వివాదానికి సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్‌ హామీలన్నింటినీ మరిచిపోయిందని, కర్ణాటకలో 6 హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ’కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్‌ నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని గురించి గందరగోళంతో ఉన్నారు. వారు వాగ్దానం అమలు చేయరు. అది వారి డీఎన్‌ఏలోనే ఉంది. దేశ ప్రజలు కాంగ్రెస్‌ తో ఉండాలా.? వద్దా.? అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది’ అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపైనా కవిత విమర్శలు గుప్పించారు. ఈ రోజుల్లో కొంత మంది నేతలు తమ 2 నిమిషాల కీర్తి కోసం ప్రజల మతపరమైన మనోభావాలపై దాడిని ఎంచుకుంటున్నారని మండి పడ్డారు. ’సనాతన ధర్మం విషయంలో రాహుల్‌ గాంధీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మిస్టర్‌ ఎలక్షన్‌ గాంధీని సనాతన ధర్మం విషయంలో తన స్టాండ్‌ అడగాలనుకుంటున్నా. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.’ అంటూ కవిత వ్యాఖ్యానించారు. అంతకు ముందు బీజేపీ విధించిన హిజాబ్‌ బ్యాన్‌ ఆదేశాలను తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. దుస్తులు, ఆహారం, ప్రజల ప్రాధాన్యతలకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు చేయకూడదని ఉద్ఘాటించారు. అయితే, శనివారం తన ప్రకటనను పునరుద్ఘాటిస్తూ హిజాబ్‌ పై ప్రభుత్వ నిర్ణయం పరిశీలనలో ఉందని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు