Wednesday, May 15, 2024

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?

తప్పక చదవండి
  • మమత బెనర్జీ, కేజ్రీవాల్ మద్దతు
  • సున్నితంగా తిరస్కరించిన ఖర్గే
  • ఎన్నికల తరువాతే చర్చిద్దామన్న చీఫ్
  • 141 ఎంపీల సస్పెన్షన్ పై మండిపాటు
  • ముగిసిన ఇండియా కూటమి భేటీ..
  • 22న దేశ వ్యాప్తంగా ఆందోళన పిలుపు
  • జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే పేరును బెంగాల్‌ సీఎం మమత ప్రతిపాదించారు. మమత ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సమర్ధించారు. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కానీ, దీనిని ఖర్గే సున్నితంగా తిరస్కరించినట్టు పేర్కొన్నాయి. మొదట ఎన్నికల్లో గెలుద్దామని , తరువాత ప్రధాని అభ్యర్ధిపై చర్చిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తాజాగా జరిగిన విపక్షాల కూటమి ‘ఇండియా’ భేటీ ముగిసిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు.

సమావేశం అనంతరం మల్లిఖార్జున్ ఖర్డే మాట్లాడుతూ.. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయని.. సీట్ల సర్దుబాటుపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు గెలవడం ముఖ్యమని స్పష్టం చేశారు. మా లక్ష్యం ముందు గెలవడం.. గెలిచిన తరువాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారని ఖర్గే అన్నారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

- Advertisement -

వాస్తవానికి ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని బెంగాల్ సీఎం సోమవారం వ్యాఖ్యానించడం గమనార్హం. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడంతో దీదీ ప్రతిపాదనకు విశేష స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పట్ల విధానాలను వ్యతిరేకించే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా 12 పార్టీలకు చెందిన నాయకులు దీంతో ఏకభవించారని సమాచారం. అయితే, ఖర్గే వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాను అణగారిన వర్గాల కోసం మాత్రమే పని చేయాలనుకుంటున్నానని చెప్పినట్టు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములపై అభ్యర్థిని నిలబెట్టినందుకు అధికార బీజేపీ నుంచి ప్రతిపక్షం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కాంగ్రెస్, ఇతర పార్టీలు దళితులు, గిరిజనులకు వ్యతిరేకమని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు దీదీ ఖర్గే పేరును వ్యూహాత్మకంగా ప్రతిపాదించినట్టు భోగట్టా. సంఖ్యా బలం లేకుండా ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం సరికాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. ముందు గెలిచిన తర్వాత ప్రధాని ఎవరన్నది నిర్ణయిద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలవాలని, ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.

22న దేశవ్యాప్త నిరసనలు
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని తాము కోరుతుంటే. పార్లమెంటులో వారు ఎందుకు మాట్లాడటం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్పై డిసెంబర్ 22న దేశ వ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిల్లోనే జరుగుతాయని.. అక్కడ ఏదైనా సమస్య ఉంటే కేంద్ర స్థాయిలో చర్చిస్తామన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బిహార్, యూపీ, దిల్లీ లేదా పంజాబ్ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.

జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకం ఖరారు!
జనవరి రెండో వారం లోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే చెప్పారు. ‘ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి మీరేనా? అని మీడియా అడిగిన ప్రశ్నకు. ఖర్గే స్పందిస్తూ.. తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్, కేజీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు