Monday, April 29, 2024

స్వల్ప స్కోరుకే పరిమితమైన టీమిండియా

తప్పక చదవండి
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసిన టీమిండియా
  • రాణించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్
  • 3 వికెట్లతో సత్తా చాటిన డేవిడ్ విల్లీ

లక్నోలో ఇంగ్లండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంచనాల మేర రాణించలేకపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు మాత్రమే చేసింది. ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (101 బంతుల్లో 87, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా మిడిల్‌ ఓవర్స్‌లో కెఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 39, 3ఫోర్లు), ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 49, 4 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో భారత్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వోక్స్‌ వేసిన రెండో ఓవర్లో మూడో బంతికి ఫోర్‌ కొట్టి ఖాతా తెరిచిన శుభ్‌మన్‌ గిల్‌ (9) అతడే వేసిన నాలుగో ఓవర్లో ఆఖరి బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. తొమ్మిది బంతులు ఆడిన కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. విల్లే వేసిన మూడో ఓవర్లో 4, 6, 6తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌.. రెండు వికెట్లు పడటంతో నెమ్మదించాడు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ (4) కూడా మరోసారి తన బలహీనతను చాటుతూ షార్ట్‌ లెంగ్త్‌ బాల్‌కే మార్క్‌ వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు.

రోహిత్‌ – రాహుల్‌ల కీలక ఇన్నింగ్స్‌..

- Advertisement -

40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్‌తో జతకలిసిన రోహిత్‌.. నిదానంగా ఆడాడు. 14.2 ఓవర్లలో భారత్‌ 50 పరుగుల మార్కును దాటింది. ఇంగ్లండ్‌ బౌలర్లు ఒత్తిడి తెచ్చినా అనవసరపు షాట్లకు పోకుండా నిదానమే ప్రధానం అన్నట్టుగా సాగింది ఈ ఇద్దరి బ్యాటింగ్‌. అదిల్‌ రషీద్‌ వేసిన 20వ ఓవర్లో మూడో బంతిని స్వీప్‌ చేసి బౌండరీకి తరలించిన రోహిత్‌.. 57 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. ఇదే క్రమంలో రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగుల మైలురాయిని దాటాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌కు ఇది మూడో అర్థ సెంచరీ (వన్డేలలో 54వది) మొత్తంగా 12వది. లివింగ్‌స్టోన్‌ వేసిన 25వ ఓవర్లో రాహుల్‌ రెండు బౌండరీలు బాదడంతో భారత్‌ స్కోరు మూడంకెలకు చేరింది. రోహిత్‌ – రాహుల్‌లు నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించి ఇక కుదురుకుంటున్నారనుకుంటున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన డేవిడ్‌ విల్లే భారత్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. అతడు వేసిన 31వ ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌ ఆడబోయిన రాహుల్‌.. మిడాన్‌ వద్ద జానీ బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్‌ ఔటైనా సూర్యకుమార్‌ యాదవ్‌ జతగా భారత్‌ను నడిపించిన రోహిత్‌.. సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో అదిల్‌ రషీద్‌ వేసిన 37వ ఓవర్లో ఐదో బంతికి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రోహిత్‌ – సూర్యలు ఐదో వికెట్‌కు 33 పరుగులు జోడించారు.

రోహిత్‌ నిష్క్రమించినా సూర్యకుమార్‌ క్రీజులో ఉండటంతో భారత్‌ మెరుగైన స్కోరు అయినా సాధిస్తుందని అభిమానులు భావించారు. కానీ రోహిత్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (8) కూడా విఫలమయ్యాడు. రషీద్‌.. జడేజాను ఎల్బీగా వెనక్కిపంపాడు. మహ్మద్‌ షమీ (1)ని మార్క్‌ వుడ్‌ ఔట్‌ చేశాడు. చివరిదాకా ఉంటాడనుకున్న సూర్య కూడా అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో విల్లే వేసిన 47వ ఓవర్లో రెండో బంతికి క్రిస్‌ వోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో జస్ప్రిత్‌ బుమ్రా (16), కుల్దీప్‌ యాదవ్‌ (9 నాటౌట్‌) లు భారత స్కోరును 225 పరుగుల మార్కును దాటించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే మూడు వికెట్లు తీశాడు. క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మరి ఈ మెగా టోర్నీలో భారత జైత్రయాత్ర కొనసాగాలంటే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న లక్నో పిచ్‌పై ఇండియా బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాటర్లకు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు