Sunday, April 28, 2024

తలసాని ఇలాఖాలో రూ. 200 కోట్ల భూ కుంభకోణం..

తప్పక చదవండి

(మంత్రి అండదండలతో ఎస్టేట్ భూమికి ఎసరు పెట్టిన నామిశ్రీ ఇన్ఫాస్ట్రక్చర్)

  • 1770 గజాల ఎస్టేట్ భూమి..10,200 గజాలుగా మార్చిన వైనం..
  • సిసిఎల్ఏ లో స్పెషల్ ఆఫీసర్ సత్య శారదా చక్రం తిప్పినట్టు ఆరోపణలు..?
  • చీఫ్ సెక్రెటరీకి తెలియకుండా ఇదంతా జరిగిందా..? తెలిసే జరిగిందా..!
  • నామిశ్రీ నిర్మించిన టి 19 టవర్స్ కూడా ప్రభుత్వ భూమిలో నిర్మించిందే..?
  • రాణిగంజ్ లోని టి19 టవర్స్ లోనే తలసాని కుమారుడి కార్యాలయం..
  • భారీ అక్రమ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించాలంటున్న స్థానికులు..
  • ఎస్టేట్ భూముల అన్యాక్రాంతం పై గవర్నర్ దృష్టి పెట్టాలంటూ డిమాండ్స్..

భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ కార్యాలయం అంటే.. రెవెన్యూ శాఖకి తలమానికం లాంటిది.. ఈ కార్యాలయంలో నిక్షిప్తమై ఉన్న రికార్డులు రాష్ట్రవ్యాప్త భూముల లెక్కలను చూపిస్తుంది.. అయితే ఇంత ప్రధాన విశిష్టతను కలిగిన ఈ కార్యాలయంలో అసలైన రికార్డులు మాయమవడం అంటే.. మామూలు విషయం కాదు.. లెక్కలు లేని రికార్డుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది..? రికార్డులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను తాకట్టు పెడితే.. ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడుతుంది.. ఇదే విధంగా.. సికింద్రాబాద్ ఎస్టేట్ లో కూడా నెలకొనడం విచారకరం.. అక్రమ వ్యవహారాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంస్థ.. సికింద్రాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఎస్టేట్ భూముల అక్రమ వ్యవహారాలపై దృష్టి సారిస్తే.. పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న నాయకుల బండారం బయటపడుతుందని పలువురు సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.. మంత్రిగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నలలోనే అక్రమ వ్యవహారం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.. అధికార బలంతో ఆయన చేస్తున్న అరాచకాలకు అంతనేది లేకుండా పోతోందన్నది విశ్లేషకుల వాదన.. ఇలాంటి అవినీతి నాయకులను ఇలాగే వదిలేస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అనేది కనుమరుగై పోతుందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్ నడి బొడ్డున ఈశ్వరి బాయ్ విగ్రహం పక్కన గల మెయిన్ రోడ్డులో ఉన్న పది వేల రెండు వందల గజాల విలువైన ఎస్టేట్ స్థలంపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది.. అదే అదునుగా పదిహేడు వందల డెబ్భై గజాలు ఉన్న ఎస్టేట్ భూమికి కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు వక్ర మార్గంలో రెగ్యూలరైజ్ చేశారు.. కాగా, ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు ఒక మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఎం.కే రావు ఫౌండేషన్ ట్రస్ట్ పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, ఓరిజినల్ ఫైల్ మాయం చేశారు.. సాక్షాత్తు భూ పరి పాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయంలో రెండు చోట్ల ఒకేసారి ఓరిజినల్ ఫైల్ మాయమైంది అంటూ అధికారులు ఇచ్చిన రిపోర్టు వింతగా గోచరిస్తోంది.. కాగా, లీజ్ కాల వ్యవధి అయిపోయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు కబ్జాదారులతో భారీ ఎత్తున ముడుపులు తీసుకోని ఎస్టేట్, సిసిఎల్ఏ అధికారులు అక్రమాలకు తెగబడినారనే వాదనలు వినిపిస్తున్నాయి.. వందల కోట్ల విలువైన భూమిని స్వాహా చేయడం వెనుక ఓ మంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి.. భూ పరిపాలన ప్రధాన కార్యాలయం (సిసీఎల్ఏ)లో, సికింద్రాబాద్ ఎస్టేట్ కార్యాలయంలో ఫైల్ మాయమైతే అధికారులు నేటికీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఎందుకు చేయలేదు..? చేయకపోవడంలో ఉన్న మతలబేంటి..? అన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది.. బడా బాబుల కనుసన్నుల్లోనే వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఎస్టేట్ భూములు అన్యాక్రాంతానికి గురైనట్లు తెలుస్తోంది.. ఒక వైపు ప్రభుత్వం పలుమార్లు లీజు కాలవ్యవధి అయిపోయిన ఎస్టేట్ భూములను స్వాధీనం చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసినా.. లీజ్ కాల వ్యవధి అయిపోయిన ఎస్టేట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అనే విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరపాలనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. అందులో భాగంగానే సికింద్రాబాద్ నడి బొడ్డున ఉన్న మెయిన్ రోడ్డు బిట్ పది వేల రెండు వందల గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి యథేచ్ఛగా వక్ర మార్గంలో రిజిస్ట్రేషన్ చేశారు అనడంలో ఏటువంటి సందేహం లేదు.. ఉన్నతాధికారులు సైతం కాసులకు కక్కుర్తి పడి, అందిన కాడికి దోచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఇదే అదునుగా భావించిన రియాల్ మాఫియా ఎం. కిషన్ రావు పేరుతో పక్కా ప్రణాళికతో కాజేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. కిషన్ రావు ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో 2730 గజాల భూమి ఉన్నదని, అందులో నుండి సుమారు 950 గజాల భూమి రోడ్ వైండింగ్ లో పోయినట్లు అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు.. ఎస్టేట్ అధికారుల చూపించిన రికార్డుల ప్రకారం 1770 గజాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది.. ఈ భూమి కూడా ఎస్టేట్ నిబంధనలను ఉల్లంఘించి 1955 లోనే వేరే వ్యక్తికి అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు అధికారులు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు ..ఇక్కడ లీజ్ నిబంధనలు ఉల్లంఘించారు కనుక కొనుగోలు చేసిన వ్యక్తులకు రెగ్యులరైజ్ చేయటానికి వీలులేదని లీజ్ నిబంధనలలో చాలా స్పష్టంగా ఉంది.. ఇదే కాకుండా లీజ్ కాలం అయిపోవడంతో ఈ భూమిని ఎస్టేట్ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని నాటి అధికారులు ఇచ్చిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.. సదరు భూమికి బోగస్ పత్రాలు సృష్టించి త్రిష్లా ఇన్ఫ్రా టెక్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ తో పాటు జనరల్ పవర్ ఆఫ్ అటానమీ రిజిస్ట్రేషన్ చేశారు.. మున్సిపల్ కార్యాలయంలో సిటీ ప్లానర్ గా పని చేసిన కే. ఉమాదేవితో ములాఖత్ అయి లోపాయికారి ఒప్పందం చేసుకొని, వక్ర మార్గంలో అనుమతులు పొందారనే ఆరోపణలు సైతం లేకపోలేదు.. భూ కబ్జా దారులతో మూలకత్ అయి లీజ్ నిబంధనలను తుంగలో తొక్కి ఎం. కిషన్ రావు ఫౌండేషన్ కు ట్రస్టీగా వ్యవహరిస్తున్న కిషన్ రావుకు కేవలం 1770 గజాలను ఫ్రీ హోల్డ్ గా చేసినట్లు ఎస్టేట్ కార్యాలయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు..

ఈ భూ కుంభకోణంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ హస్తం ఉంది అనే అనుమానాలు బలపడుతున్నాయి.. అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం స్వాధీన పరుచుకొని, నకిలీ పత్రాలపై విచారణ జరిపించి, అన్యాక్రాంతం అవుతున్న ఎస్టేట్ భూమిని రక్షించాలని స్థానికులు, సామాజికవేత్తలు కోరుతున్నారు.. ఈ ఎస్టేట్ భూమికి సంబంధించి కిషన్ రావు ఫౌండేషన్ పేరుపై వుందన్నది నిజామా…? కాదా..? ఒకవేళ భూమి ఉన్నది నిజమే అయితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఒరిజినల్ ఫైల్ ఎలా మాయమయింది.. ? ఎస్టేట్ కార్యాలయంలో సైతం ఇదే ఫైల్ మాయమవ్వడంలో మర్మం ఏంటి..?100 ల కోట్ల విలువైన రెవిన్యూ రికార్డుల మాయం వెనుక భూ పరిపాలన కమిషనర్ కార్యాలయ అధికారి సత్య శారదా కీలక పాత్ర పోషించినట్లు తేటతెల్లమవుతోంది..

ఎలాంటి ఫైల్ లేకుండా ఫ్రీ హోల్డ్ చేయుట ఎలా సాధ్యమైంది..? 1770 గజాలు 10 వేల గజాలకు పైగా రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది..? అదనపు భూమి ఎక్కడ నుండి వచ్చింది..? ఈ వ్యవహారంలో సత్య శారదా వెనుక ఉన్న ఉన్నతాధికారి ఎవ్వరు అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రభుత్వ ఎస్టేట్ భూములు పరిరక్షించబడాలి అంటే ఎన్ఫోర్స్ మెంట్ వారు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాలని.. అసలు వాస్తవాలను వెలికి తీసి, కోట్ల రూపాయల విలువజేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.. రాణిగంజ్ లోని టి19 టవర్స్ లో ఉన్న నామిశ్రీ నిర్మాణ సంస్థ, టి19 టవర్స్ బహుళ అంతస్థుల భవన నిర్మాణం కూడా ప్రభుత్వ భూమిలోనే నామిశ్రీ నిర్మాణ సంస్థ నిర్మించినట్లు తెలుస్తోంది..ఇదే టి19 టవర్స్ లో మంత్రి తలసాని కుమారుడి కార్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికైనా ఈ అక్రమ వ్యవహారాల పై రాష్ట్ర గవర్నర్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దృష్టి సారించి సమగ్ర దర్యాప్తు చేస్తే మరెన్నో కండ్లు చెదిరి పోయే అక్రమ వ్యవహారాలు బహిర్గతమయ్యే అవకాశముంది..ఇలా ఎస్టేట్ భూములను ప్రభుత్వ చెరకు చేరకుండా, బినామీల ద్వారా అక్రమ నిర్మాణాలు నిర్మించి కోట్లు కొల్లగొడుతున్న నాయకుల వ్యవహారాల పై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” మా అక్షరం అవినీతి పై “అస్రం”..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు