Tuesday, April 30, 2024

గవర్నర్‌ కోటాకు బ్రేక్‌

తప్పక చదవండి
  • గవర్నర్‌ కోటా స్థానాలపై పీటముడి
  • ఇప్పుడప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు
  • హైకోర్టులో కేసు తేలాకనే నిర్ణయం
  • ఈ నెల 24న పిటిషన్ల విచారణ
  • ఇప్పుడే భర్తీ చేయరాదని గవర్నర్‌ నిర్ణయం

హైదరాబాద్‌ : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పిటిషన్లపై తీర్పు వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌కుమార్‌, సత్యనారాయణ పేర్లను కేబినెట్‌ నామినేట్‌ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. అయితే, ఇద్దరి పేర్లను గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే, తమ పేర్లను ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్‌ 171 ప్రకారం.. తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్‌ చేసిందని.. గవర్నర్‌కు తిరస్కరించే హక్కు లేదని వాదించారు. ఆయా పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ అడ్డుకోలేంటూ శ్రవణ్‌, సత్యనారాయణ తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 361 ప్రకారం ఈ పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్‌ తరఫు కౌన్సిల్‌ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్‌ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని పేర్కొంటూ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
మొత్తంగా గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి గవర్నర్‌ ఇలా షాకిచ్చారు. ఆ ఎమ్మెల్సీల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి సిఫారసులు చేసినా అంగీకరించేది లేదని తెలిపింది. వాటిపై ఇప్పటికే కోర్టులో కేసు ఉందని ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాజ్‌ భవన్‌ ప్రకటనతో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలినట్లయింది. గతంలోనే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు. అటువంటివారి పేర్లను పంపితే ఆమోదిస్తానని తమిళి సై తెలిపారు. అయితే ఆ తర్వాత మరో ఇద్దరి పేర్లను కేసీఆర్‌ రాజ్‌ భవన్‌కు పంపలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రెండు గవర్నర్‌ స్థానాలు ఖాళీగా ఉన్నందున కోదండరాం, అమీర్‌ అలీ ఖాన్‌ పేర్లను సిఫారసు చేయాలని అనుకున్నారు. కానీ కోర్టులో కేసు తేలే వరకూ ఏ సిఫార్సులు అంగీకరించేది లేదని గవర్నర్‌ ముందుగానే చెప్పడంతో … ఆ రెండు స్థానాల భర్తీ ఇప్పుడప్పుడే ఉండదని తేలిపోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు