Monday, April 29, 2024

కేసీఆర్‌ ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

తప్పక చదవండి

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావును రాష్ట్ర మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్న నరసింహన్‌ దంపతులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ను పరామర్శించిన నరసింహన్‌ దంపతులు.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కుటుంబంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, కేసీఆర్‌ గత నెలలో బాత్రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దాంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి ఆయన నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. గురువారం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు కేసీఆర్‌ను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, బీబీ పాటిల్‌ తదితరులు కూడా అక్కడికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, గవర్నర్‌ హోదాలో నరసింహన్‌ అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తమ నివాసానికి వచ్చిన అతిథులను కేసీఆర్‌ దంపతులు నిండు మనసుతో సత్కరించారు. వారికి పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. కేసీఆర్‌ దంపతులు చూపించిన ఆదరాభిమానాలకు నరసింహన్‌ దంపతులు అభినందనలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు