Sunday, April 28, 2024

బోస్‌ ఏమయ్యారు..?

తప్పక చదవండి
  • సుభాష్‌ చంద్రబోస్‌ మృతి మిస్టరీ తేల్చంచండి.
  • ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాడో తెలియదు
  • నేతాజీ మరణం తెలియకపోవడం దేశానికి సిగ్గుచేటు
  • దర్యాప్తు చేస్తామన్న బీజేపీ నోరు మెదపడం లేదు
  • నేతాజీ జయంతి సభలో సీఎం మమతా బెనర్జీ విమర్శలు

కోల్‌కతా : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ ప్రజలకు ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చిన భాజపా ప్రభుత్వం.. దాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదని విమర్శించారు. ’ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. నేతాజీ చనిపోయిన తేదీ తెలియకపోవడం దేశ దురదృష్టం. ఆయనకు ఏమైందో మనకు తెలియదు. నిజంగా దేశానికి ఇది సిగ్గుచేటని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఆమె.. భాజపా ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు భాజపా హామీ ఇచ్చింది. 20 ఏళ్లుగా నేతాజీ జన్మదినం నాడు జాతీయ సెలవు ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమయ్యాయి. నన్ను క్షమించండి’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. ఈ రోజుల్లో రాజకీయ ప్రచారానికీ సెలవు ప్రకటిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు.భారత స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యమైన ఘటన ఏడు దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945, ఆగస్టు 18న తైపిలో విమాన ప్రమాదంలో బోస్‌ మరణించారనే వాదన ఉంది. నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరు నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు దర్యాప్తు కమిషన్లు వేసింది. కాంగ్రెస్‌ హయాంలో రెండు, భాజపా ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన ఓ కమిటీ ఇచ్చిన నివేదికలు భిన్నంగా ఉన్నాయి. దీంతో అస్థికలను భారత్‌కు తెప్పించి, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని బోస్‌ కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు