Thursday, May 16, 2024

కాంగ్రెస్‌ పార్టీకి అభివృద్ది గిట్టదు

తప్పక చదవండి
  • సింగరేణిని ఆగం పట్టించిన కాంగ్రెస్‌
  • గిరిజనేతరులకూ పోడు పట్టాలు
  • మేడారం జాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నాం
  • వెయ్యికోట్లను పంచిన ఘనత బీఆర్‌ఎస్‌దే
  • ములుగు నియోజకవర్గాన్ని పట్టించుకోని సీతక్క
  • ప్రజల కోరిక మేరకు ములుగు జిల్లా..
  • ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

రామగుండం : దద్దమ్మ కాంగ్రెస్‌కు చేతగాక సింగరేణిని సమైక్య నేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’సింగరేణి 134 ఏళ్ల కింద పుట్టిన మన సొంత కంపెనీ. నిజాం రాజు కాలంలో పుట్టిన కంపెనీ. మన సొంత ఆస్తి. ఈ కాంగ్రెస్‌ దద్దమ్మ నాయకులకు చేతగాక సమైక్య నాయకుల చేతిలో పెడితే కేంద్రం దగ్గర అప్పులు తెచ్చారు. రూ.600కోట్ల మారటోరియం సింగరేణి మీద ఉండేది. ఆ అప్పులు కట్టుడు చేతగాక మా వళ్లకాదని చేతులెత్తేసి కేంద్రానికి 49శాతం వాటా పుట్టించారు. మన సింగరేణి వందశాతం మనకే ఉంటుండే. అలా లేకుండా చేసిందే కాంగ్రెస్‌’ అంటూ విమర్శించారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్‌. గోదావరి ఒరుసుకుంటు పారే మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో మంచినీళ్ల గోస, కరెంటు గోస. చేనేత కార్మికుల చనిపోవుడు. రైతులు ఆత్మహత్యలు చేసుకునుడు. కరెంటు ఇస్తే తెల్లందాక ఇంత. పొద్దందాక ఇంత. ఆడ పాములు కరిచి చనిపోవుడు. విపరీతమైన బాధలు పడ్డాం. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఉండే. వాటిని ఊడగొట్టింది కాంగ్రెస్సే కదా? గవర్నమెంట్‌ కాంగ్రెస్సే. ఒప్పందాలపై సంతకాలు పెట్టి ఉన్న హక్కులను పోగొట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకున్నాం. అంతేకాకుండా 15వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. మీ కండ్ల ముందు జరిగిన చరిత్ర. అనేక కారణాలు ఉన్నయ్‌. కాంగ్రెస్‌ వాళ్లు ఉన్నప్పుడు ఇవ్వలేదు. మేం ఇస్తుంటే ఓరుస్త లేరు’ అంటూ విమర్శించారు. ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అన్ని వర్గాలను, కులం మతం అనే తేడా లేకుండా కలుపుకొని ముందుకు తీసుకుని పోతుంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అందుకే మీరు మంచి పద్ధతుల్లో ఆలోచన చేసి ఓటేస్తే మంచి జరుగుతది. చందర్‌ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమకారుడు. ఉద్యమ కాలంలో 74 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా సింగరేణి కార్మికుడి కుమారుడు. కాబట్టి సింగరేణి గురించి బాగా అవగాహనం ఉంది. ఇక బొగ్గు, నీళ్లు ఉన్నాయి. రవాణా వసతి ఉంది. ట్రైన్‌ కూడా ఉంది. మాకు పరిశ్రమలు లేవు అని చందర్‌ చెప్పారు. రామగుండం నిర్లక్ష్యానికి గురైంది సమైక్య రాష్ట్రంలో. మనం ఇప్పుడు కుదుటపడ్డాం. ఈ ప్రాంతానికి రావాల్సిన పరిశ్రమల గురించి ఆలోచించి తీసుకువస్తాం. దాని కోసం నేను కృషి చేస్తాను’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు రూ. 1000 కోట్లు పంచారా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ కార్మికులకు బోనస్‌, లాభాల వాటా కింద 32 శాతం ఇచ్చిందని కేసీఆర్‌ గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని, గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. సింగరేణి మనది మనకే ఉండే. ఉన్న తెలంగాణను ఊడగొట్టినట్టు, సింగరేణిని ముంచిది కూడా కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీకి చేత కాక కేంద్రం వద్ద అప్పులు తెచ్చి, అవి తిరిగి కట్టలేక 49 శాతం వాటా వాళ్లకు కట్టబెట్టారు. కాంగ్రెస్‌ చేతకాని తనం వల్ల వంద శాతం మనకున్న సింగరేణి, అప్పుల కింద కేంద్రానికి సగం వాటా పోయింది. ఇదే కాంగ్రెస్‌ ఇంటక్‌, ఐటక్‌ నాయకులు డిపెండెంట్‌ ఉద్యోగాలు వద్దని సంతకాలు పెట్టిన భక్తులు కూడా వాళ్లే. ఇవాళ 15 వేల మంది ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో 1000 కోట్లు పంచారా..? బోనస్‌ కానీ, లాభాలా వాటా కానీ ఇవాళ 32 శాతం ఇచ్చుకుని ముందుకు పోతున్నాం. సింగరేణి అన్ని రకాలుగా కాపాడే బాధ్యత తీసుకుని ముందుకు పోతున్నాం అని కేసీఆర్‌ తెలిపారు. భూపాలపల్లికి వంద శాతం ఇంజినీరింగ్‌ కాలేజీ తీసుకువస్తాం. ఆ బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. భూమపాల్లిని జిల్లా చేసిందే కేసీఆర్‌. గతంలో మధుసూదనాచారి ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు వచ్చాను. భూపాలపల్లి చాలా అభివృద్ధి చేసుకున్నాం. వెంకటరమణారెడ్డి నా వద్దకు ఎప్పుడొచ్చినా నియోజకవర్గం పని అడుగుతడు. పర్సనల్‌ పని అడగలేదు. సీనియర్‌ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. తప్పకుండా భూపాలపల్లికి మేలు జరగాలంటే వెంకటరమణా రెడ్డి గెలవాలి. గెలిస్తేనే లాభం జరుగుతది. లేకపోతే కింద మీద అయితది, ఆగమయ్యే ఆస్కారం ఉంటది. మీరంతా పట్టుబట్టి వర్షంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో సభకు ఎలా హాజరయ్యారో, ఇదే పద్ధతిలో నవంబర్‌ 30న ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతున్నా అని చెబుతూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

ములుగు సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఏనాడు అభివృద్ది గురించి పట్టించుకోలేదని పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం. ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా ఉంటయ్‌. రోడ్లు, ఇరిగేషన్‌ అన్నీ చేసిపెడుతానని వాగ్ధానం చేస్తున్నా. బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్‌ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్‌కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడైండు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాకు వచ్చింది’ అన్నారు. నేను మీ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను. నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా.

- Advertisement -

ములుగు ప్రజాశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌
’సమ్మక్క సారక్క తల్లులు ఉండే ఈ నేలకు వందనం చేస్తున్నాను. అమ్మా సమ్మక్క తల్లి, సారక్క తల్లి మా తెలంగాణ మాకు వచ్చేటట్టు చూడాలంటూ ఆ తల్లులకు అనేకసార్లు బంగారం ఇచ్చాను. అంతకు ముందు మన జాతరకు ఆదరణ లేకుండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం రూ.80కోట్ల నుంచిరూ.100కోట్లు ఖర్చుపెట్టుకుంటూ రాష్ట్రస్థాయిలో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం. ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. జాతరకు వచ్చే రోడ్లు సైతం సరిగా లేకుండే. ఒకసారి జాతరకు నేనే వస్తే ట్రాఫిక్‌ జామ్‌లో రాత్రంతా ఇరుక్కుపోయిన. ఆ తర్వాత మూడు నాలుగు రోడ్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మేలుగా పరిస్థితులు కనిపిస్తున్నయ్‌. ఇంకా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం’ అన్నారు. ములుగు నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉండేది. 48,161 ఎకరాల పోడు భూములు పంపిణీ చేశాం. భూములు పంపిణీ చేయడంతో పాటు కేసులను ఎత్తివేశారు. రైతుబంధు పెట్టడంతో పాటు బీమా చేయించాం. గిరిజన ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ కరెంటు కనెక్షన్‌ లేకుండనో.. ఆ కనెక్షన్లు ముమ్మరంగా ఇస్తున్నరు. ఇలా పోడు భూముల సమస్య ఇంచుమించు చేసుకున్నాం. కొందరు గిరిజనులు కానివారికి కూడా పోడు భూములు ఉన్నయ్‌. వాళ్ల సమస్య పరిష్కరిం చాలని కోరుతున్నారు. అది కేంద్రం చేతుల్లో ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా. తప్పకుండా ఎన్నికల తర్వాత గిరిజనేతర పోడుభూముల రైతులకు సైతం పట్టాలు ఇప్పిస్తాం’ అన్నారు. పోయిన ఎలక్షన్లలో ములుగు వచ్చి మాట్లాడాను. ప్రజల కోరిక నెరవేరాలని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం.. తప్పకుండా వందశాతం ములుగు జిల్లాను చేశాం. మీ దగ్గరికి ఇవాళ ఆఫీసులు వచ్చాయ్‌. జీవితంలో ఎన్నడైనా అనుకున్నామా ములుగుకు మెడికల్‌ కాలేజీ వస్తుంది. ములుగు మెడికల్‌ అంటే 400 పడకల ఆసుపత్రి వస్తుంది. దాంతో నర్సింగ్‌ కాలేజీ వస్తది. పారామెడికల్‌ కాలేజీ కోర్సులు వస్తయ్‌. బ్రహ్మాండంగా వైద్య సదుపాయాలు వస్తయ్‌. పోయినసారి వరదలు వచ్చినయ్‌. ఆ సమయంలో రామన్నపేట ప్రాంతం అంతా వచ్చి నేను తిరిగారు. ఇక్కడ డయాలసిస్‌ సెంటర్‌ లేదని నాకు అప్పుడు చెప్పారు. వెంటనే హెల్త్‌ మినిస్టర్‌కు చెప్పి ఏటూరునాగారం ఓ డయాలసిస్‌ కేంద్రం పెట్టించాం. ఇప్పుడు ఆ సదుపాయం వచ్చిందని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు