Thursday, May 2, 2024

సూర్యాపేట జిల్లా సి.ఎం.ఆర్ బకాయి రూ. 960 కోట్లు!

తప్పక చదవండి
  • డిసెంబర్ 31న ముగియనున్న తుది గడువు
  • సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఖరీఫ్ 2022-23లో రూ. 241 కోట్లు కాగా, రబీ సీజన్ రూ. 719 కోట్లు..
  • రెండు సీజన్లలో రూ.960 కోట్ల బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్
  • పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల భారీ నిర్లక్ష్యం..
  • పెండింగ్ మిల్లుల్లో అసలు ధాన్యం ఉందా..? అధికారుల నిఘాలోపమే ఇందుకు కారణం కాదా.!
  • కలెక్టర్ గారు.. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టండి! మంత్రి జిల్లాకు ప్రాధాన్యత పెంచండి!!

పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే సుమారు రూ. 960 కోట్ల విలువైన సి.ఎం.ఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడచిన డిసెంబర్ 1తేదీ వరకు “ఆదాబ్” సేకరించిన వివరాల ప్రకారం పరిశీలిస్తే, 2022-23 ఖరీఫ్ సీజన్ కు చెందిన సి.ఎం.ఆర్ బియ్యం బకాయిలు 241 కోట్ల 11 లక్షలు కాగా, రబీ 2022-23 సీజన్ కు చెందిన బకాయి రూ. 719 కోట్ల 73 లక్షల విలువైన ప్రభుత్వ బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గడిచిన 2021-22 ఖరీఫ్ సీజన్లో రూ. 45 కోట్ల 54 లక్షల విలువైన బియ్యాన్ని మాయం చేసిన ఐదు మిల్లులపై కేసులు నమోదు చేసి, జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు.

- Advertisement -

పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల భారీ నిర్లక్ష్యం..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీలైనంత మేరకు ప్రజలకు పారదర్శక పాలన అందించే దిశగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖపై నిర్వహించిన మొదటి రివ్యూలోనే గడిచిన ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే తమ శాఖ 56 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మంత్రి కుండ బద్దలు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం వడ్డీలకే రూ.3 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 18 వేల కోట్ల విలువైన 88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎలాంటి పూచికత్తు, గ్యారెంటీలు లేకుండానే మిల్లర్ల వద్ద ఉండిపోయిందని మంత్రి తన తొలి సమావేశంలోనే ఆందోళన వెలిబుచ్చారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన సొంత జిల్లా అధికారులకు మాత్రం కనీసం చీమకుట్టిన స్పందన లేకుండా పోయింది. మంత్రి సొంత జిల్లా సూర్యపేటలోనే సుమారు 960 కోట్ల విలువైన సి.ఎం.ఆర్ బియ్యం బకాయిలు పేర్కుపోయినా, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ కు సోయి, స్పందన కూడా లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు.

పెండింగ్ మిల్లుల్లో అసలు ధాన్యం ఉందా..?

సూర్యాపేట జిల్లాలో మొత్తం 50 నుండి 70 వరకు రైస్ మిల్లర్లు ప్రతి సీజన్లో సి.ఎం.ఆర్ ధాన్యం కేటాయింపుల్లో భాగస్వాములుగా ఉంటున్నారు. 2O22-23 ఖరీఫ్ మరియు రబీ ఈ రెండు సీజన్ల సి.ఎం.ఆర్ బియ్యం అప్పగించే తుది గడువు డిసెంబర్ 31 వరకు ముగియనుంది. ఒకవేళ గడువు పొడిగిస్తే, 2022-23 రబీ సీజన్ కు మాత్రమే మరో 30 రోజులు పెంచే అవకాశం ఉండొచ్చు. కాని ఖరీఫ్ సీజన్ కు మాత్రం మరో అవకాశం ఇవ్వకపోవచ్చునని భావిస్తున్నారు. మిల్లర్ల నుండి ఎలాంటి గ్యారెంటీలు లేని పాలసీ కాబట్టి పెండింగ్ బియ్యాన్ని ఎలాగైనా ప్రస్తుత ప్రభుత్వం సేకరించే ప్రయత్నం చేయక మానదు. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్నా, అసలు పెండింగ్ మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన దాన్యం స్టాక్ ఉందా..? లేకుంటే బియ్యం రూపంలో కాకినాడ పోర్టు మీదుగా చెన్నైకి చేరిందా..? జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ వద్ద సంబంధిత తనిఖీ నివేదికలు, స్టాక్ రికార్డులు అసలు ఉన్నాయా అనేదే ఇక్కడ ప్రధాన చర్చ. మంత్రిగారు.. వెంటనే మీ సొంత జిల్లాపై దృష్టి సారించండి..! ఈ అధికారులు మీ శాఖకు మరకలు అంటించకముందే మేలుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుకుంటుంది.

మండలాల వారీగా మిల్లర్ల పెండింగ్ వివరాలు.. కోట్లలో బకాయిలు…

ఖరీఫ్ 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ బకాయి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నేరేడుచర్ల మండలంలో ఉన్న 3 మిల్లర్ల వద్ద 51 కోట్ల 66 లక్షల విలువైన సి.ఎం.ఆర్ బియ్యం పెండింగ్ ఉండగా, కోదాడకు చెందిన 31 మంది మిల్లర్ల వద్ద 85 కోట్ల 68 లక్షలు, సూర్యాపేటకు చెందిన 11 మంది మిల్లర్ల వద్ద 48 కోట్ల 15 లక్షలు ఉంటే, ఇక తిరుమలగిరి ప్రాంతానికి చెందిన 10 మిల్లర్ల వద్ద 55 కోట్ల 71 లక్షల విలువైన సి.ఎం.ఆర్ బియ్యం బకాయిలు పేరుకుపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

రబీ 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ బియ్యం పెండింగ్ వివరాలను పరిశీలిస్తే.. హుజూర్ నగర్ మండలంలోని 12 మిల్లర్ల వద్ద 45 కోట్ల 90 లక్షలు, నేరేడుచర్ల మండలానికి చెందిన 8 మిల్లర్ల వద్ద 128 కోట్ల 34 లక్షలు, కోదాడకు చెందిన 29 మిల్లర్ల వద్ద 163 కోట్ల 44 లక్షల బకాయిలు ఉండగా, సూర్యాపేటకు చెందిన 12 మంది మిల్లర్ల వద్ద 193 కోట్ల 77 లక్షలు, తిరుమలగిరి ప్రాంతానికి చెందిన 9 మంది మిల్లర్ల వద్ద 188 కోట్ల 37 లక్షల సి.ఎం.ఆర్ బియ్యం బకాయిలు పేరుకుపోయినట్లు “ఆదాబ్” సేకరించిన పకడ్బందీ సమాచారం ప్రజల ముందు ఉంచుతోంది.

ఖరీఫ్ 2021-22 లో మిల్లర్లు దిగమింగిన బియ్యం విలువ 45 కోట్ల 54 లక్షలు..

గడిచిన ఖరీఫ్ 2021-22 సీజన్ లో 45 కోట్ల 54 లక్షల విలువైన సి.ఎం.ఆర్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న 5 మిల్లర్ల నుండి ఇంతవరకు సంబంధిత సొమ్మును రికవరీ చేసిన దాఖలాలు లేవు. కోదాడకు చెందిన శ్రీ ఉషశ్విని (కాపుగల్లు) మిల్లర్ వద్ద 19 కోట్ల 89 లక్షలు, ముకుందాపురానికి చెందిన లక్ష్మీ సహస్ర రైస్ ఇండస్ట్రీ 18 కోట్ల 27 లక్షలు, గరిడేపల్లికి చెందిన ఎం.కె.ఆర్ బిన్నీ రైస్ మిల్లు 3 కోట్ల 78 లక్షలు, హుజూర్ నగర్ కు చెందిన శ్రీ వెంకట సాయి రైస్ ఇండస్ట్రీ (అమరవరం) మిల్లర్ వద్ద 3 కోట్ల 33 లక్షలు, నేరేడుచర్లకు చెందిన శ్రీ రాఘవేంద్ర రైస్ ఇండస్ట్రీ వద్ద 63 లక్షలు, దిర్శించర్లకు చెందిన తిరుమల రైస్ మిల్లర్ వద్ద నుండి 18 లక్షలు. వీరందరూ 45 కోట్ల 54 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయం చేసినందున జిల్లా సివిల్ సప్లయ్ శాఖ వీరిపై పోలీస్ కేసులు నమోదు చేసి, చేతులు దులిపేసుకుంది.

అప్పనంగా 50 కోట్ల ప్రజాధనాన్ని దిగమింగిన ఈ మిల్లర్లు కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకొని, ఎంజాయ్ చేస్తున్నారు. సదరు స్టే ఆర్డర్ ను ఎత్తివేసే విధంగా న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసి, ప్రజాధనాన్ని కాపాడాల్సిన జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, మంత్రి తగిన చొరవ చూపి ప్రజాధనాన్ని కాపాడాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే అన్ని బకాయిలను కలిపితే 1000 కోట్లు దాటుతోంది. అధికారులరా.. కాస్తంత కళ్ళు తెరవండి! మిల్లుల్లో మీరిచ్చిన ధాన్యం అసలు ఉందో లేదో పరిశీలించండి..? కలెక్టర్ గారు మీరైనా ఇక తనిఖీలు మొదలు పెట్టండి సార్..! నిజామాబాద్ జిల్లా బి.ఆర్.ఎస్ మాజీ ఎమ్మెల్యే మిల్లుల్లో జరిగిన 70 కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇలాంటివి సూర్యాపేట జిల్లాలో బయటపడక ముందే తగిన జాగ్రత్తలు వహించండి మహాప్రభో…!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు