Tuesday, April 30, 2024

‘కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం..

తప్పక చదవండి
  • కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ
  • మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
  • కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాసిన లేఖలో
    డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
  • డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు తీసుకున్న నిర్ణయాలపై వాస్తవాలు తేల్చాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బ్యారేజీ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు.

దీనికి స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ బృందం ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై.. రేపు కాళేశ్వరం డ్యామ్ ను సందర్శించనుంది.

- Advertisement -

కిషన్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించిన కొన్ని కీలకమైన అంశాలు :
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరం. 6వ బ్లాక్‌లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయి. ఈ సందర్భంగా పెద్దగా శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. దీంతో బ్యారేజ్ లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేశారు. సాగునీటికోసం జమచేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదలాల్సి వచ్చింది. దీని కారణంగా దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంగా భయంభయంగా గడిపారు.
ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై ఎదరువతున్న ప్రశ్నలకు సమాధానంగా.. దయచేసి కేంద్రబృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించగలరు.

  1. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులను గమనించారా?
  2. పిల్లర్ల కింద వేసిన ఫౌండేషన్ (పియర్స్) నాణ్యతతో నిర్మించలేదని స్పష్టమైంది. దీన్ని బట్టి.. పియర్స్ నిర్మించే సమయంలో అక్కడ సాయిల్ ట్రీట్మెంట్ జరగలేదనేది అర్థమవుతోంది. అంటే.. ఫౌండేషన్ ఇన్స్‌పెక్షన్ వైఫల్యం కారణంగానే.. ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టమైంది.
  3. ప్రాజెక్టు డిజైనింగ్ బాధ్యతను.. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) మెథడ్‌లో.. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కంపెనీ చేసిందా? లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన సీడీఓ (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) ద్వారా చేయించారా?.

ఈ తాజా పరిస్థితికి ఎవరు బాధ్యులనే విషయాన్ని తేల్చగలరు. గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు’లో భాగంగా.. ‘కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ’.. నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు