Friday, July 19, 2024

ఎవరా భూచోళ్ళు…శివబాలకృష్ణ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు..?

తప్పక చదవండి
  • అజ్ఞాతంలోకి వెళ్లిన కొందరు ఎవరు..?
  • ప్రధాన అనుచరులపై ఏసీబీ అధికారుల నజర్‌
  • పలువురు హెచ్‌ఎండిఏ ఉద్యోగులకు నోటీసులు
  • ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులపై దృష్టి
  • ఎప్పుడేమవుతుందోనని హెచ్‌ఎండిఏలో ఆందోళన
  • బాలకృష్ణ బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నీ సీజ్‌
  • సర్వీస్‌ నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బాలకృష్ణ లీలలు

హైదరాబాద్‌ : భారీగా అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని సర్వీస్‌ నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. అలాగే ఆయన అవినీతి వెనక ఎవరెవరు ఉన్నారన్న దానిపైనా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద తలకాయలు ఆదేశాలు లేనిదే ఇంతటి అవినీతికి పాల్పడరన్న బలమైన అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈకేసు ఒక్క శివబాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పని చేసే అధికారుల మెడకి కూడా చుట్టుకుంటోంది. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయనతో కలిసి పని చేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారిని విచారించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఇప్పటికే శివ బాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామి ఆస్తులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పని చేసే ఉద్యోగులను విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్‌ చేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్‌ విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో కాసేపట్లో తేలిపోనుంది. ఆయన్ని పది రోజుల కస్టడీకి ఇచ్చిన్టటైతే.. ఆయన చేపట్టే లావాదేవీలు, బీనామీల వివరాలపై ప్రశ్నలు అడిగే ఛాన్స్‌ ఉంది. ఈ దందాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ సాగనుంది. ఆయన చెప్పే సమాధానాల బట్టి మరి కొందర్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించే ఛాన్స్‌ ఉందంటున్నారు అధికారులు. మరోవైపు శివబాలకృష్ణ కారణంగా ఇబ్బంది పడ్డ వారంతా అధికారుల చుట్టూ తిరుగు తున్నారు. లే అవుట్‌లు వేసుకునేందుకు అనుమతుల కోసం డబ్బులు తీసుకొని పని చేయాలని వారంతా ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మధ్యే శివ బాలకృష్ణ నివాసాలు, ఆఫీస్‌లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఐదు వందల కోట్లకుపైగా అక్రమాస్తులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. తర్వాత ఆయన్ని కోర్టుకు రిమాండ్‌ విధించింది.
చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశాడని.. భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకున్నాడని.. రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా వ్యవహరించడం వంటి పలు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.. పైగా చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చూపించి.. భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కాగా, హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన భూవివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. అయినా ఆ వివాదాస్పద భూమిని ఓ నిర్మాణ సంస్థకు చెందినదిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారని సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఆ సెక్షన్‌ అధికారితో స్థలాలు కోల్పోయిన బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. నగర శివారు ప్రాంతాల్లో సెక్షన్‌ అధికారి బినామీగా 20 ఎకరాలకు పైగా ఖరీదైన భూమి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆయన మూడు రోజులుగా విధులకు గైర్హాజరయ్యారు. సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకొని సోమవారం విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. ఆ విధంగా శివబాలకృష్ణ వద్ద నమ్మకంగా పని చేసే వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది సొంతూళ్లకు వెళ్లినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. వారిని గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు