Monday, April 29, 2024

కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పేరుతో దగా..

తప్పక చదవండి
  • రాజ్యాంగ విరుద్ధంగా అనర్హులను క్రమబద్దీకరించిన దౌర్భాగ్యం..
  • ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆక్రందన..
  • విద్యార్థుల ఆశలను, ఆశయాలను సమాధిచేసిన కేసీఆర్..
  • వారి లబ్ధికోసమే అనర్హులకు అందలం..
  • కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరేనాటికి ఒక సర్టిఫికెట్.. క్రమబద్దీకరణ సమయంలో మరో సర్టిఫికెట్..
  • ఈ వ్యవహారం అప్పటి కమిషనర్ నవీన్ మిట్టల్ కనుసన్నులలో జరగడం కొసమెరుపు…
  • సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టి సారించాలని కోరుతున్న తెలంగాణ నిరుద్యోగ జేఎసి
  • ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం

కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన రోజే ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలు అన్న మాట లేకుండా చేస్తానని.. ఇంగ్లిష్ నిఘంటువులో తనకు నచ్చని పదం కాంట్రాక్టు వుద్యోగం అని డాంబికంగా చెప్పిన విషయం ఇప్పటికీ ఏ విద్యార్థి, నిరుద్యోగి మరిచిపోలేదు.. కానీ ఆయనగారు పరిపాలించిన కాలంలో వారి ఊసే ఎత్తలేదు.. పైగా రాజకీయ లబ్దికోసం కొంతమంది కాంట్రాక్టు లెక్చరర్లను రాజ్యాంగ విరుద్ధంగా క్రమబద్దీకరించారు.. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆయన రెగ్యులర్ చేసిన లెక్చరర్లు తాము కాంట్రాక్ బేసిస్ లో చేరినప్పుడు సమర్పించిన అర్హత సర్టిఫికెట్స్ ఒకటైతే.. తమని రెగ్యులర్ చేస్తున్నప్పుడు సమర్పించిన విద్యార్హత సర్టిఫికెట్స్ మరొకటి.. మరి ఇందులో ఏ సర్టిఫికెట్స్ ఫెకో ఇతిమిద్దంగా తెలియరావడం లేదు కానీ.. ఫేక్ సర్టిఫికెట్స్ అయితే ప్రధాన భూమిక పోషించినట్లు ‘ఆదాబ్’ పరిశోధనలో తేలింది..

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగ యువత నీళ్ళు, నిధులు, నియామకాల కోసం జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు.. అనేక మంది యూనివర్సీటి విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వము ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికి వారికి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. యూనివర్సీటిలో పిజి, పిహెచ్ డి పూర్తి చేసి నెట్, సెట్ క్వాలిఫై అయిన వేలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పటికి.. కేసిఆర్ ప్రభుత్వం వారి మీద కక్ష కట్టి కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రాజ్యాంగ విరుద్ధంగా క్రమబద్ధీకరించారు. వీరి నియామకాలు పూర్తిగా చట్ట విరుద్ధమని “ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక” కేసులో సుప్రీమ్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన తర్వాత కేసిఆర్ నల్గొండ జిల్లాలో జరిగిన సభలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తాము అని ప్రకటించటం వలన వారి ఆశలు, ఆశయాలు సమాధి చేయడం జరిగింది. తర్వాత జరగాల్సిన బహిరంగ సభ ఉస్మానియా యూనివర్సీటికి దగ్గరగా ఉండటంతో యూనివర్సీటి ఆవరణలో ఉన్న హెలీప్యాడ్ వద్ద యూనివర్సీటి విద్యార్థులు దానిని చుట్టు ముట్టి నిరసన వ్యక్తం చేస్తూ చెప్పులు విసరడం జరిగింది. వెంటనే సభను రద్దు చేసుకోని కేసిఆర్ హెలికాఫ్టర్ నుండి దిగకుండానే వెళ్లిపోయాడు. దీనిని మనస్సులో పెట్టుకొని కక్షగట్టి యూనివర్సీటి విద్యార్థుల డిమాండ్లను, ఆవేధనను ఏ రోజు కూడా పట్టించుకోలేదు. దానితో వారి బాధలు ప్రభుత్వానికి చెప్పుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది.. దీనిని అవకాశంగా తీసుకొని కాంట్రాక్ట్ లెక్చరర్స్ పెద్ద ఎత్తున హరీష్ రావుకు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముడుపులు ముట్టచెప్పారని పలు విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా టీచర్ ఎంఎల్ సి, 2019 సాధారణ ఎలక్షన్లలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎన్నికల ప్రచార కర్తలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేసారు. దీని ఫలితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకుండా, రాత పరీక్ష నిర్వహించకుండా రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయ లబ్ధి కోసం వారిని క్రమబద్ధీకరించారు. వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి యూజిసి గుర్తింపు లేని యూనివర్సిటీల నుండి నకిలీ పీజీ సర్టిఫికేట్స్ కొనుగోలు చేసి, దొడ్డి దారిన ఉద్యోగాలలో చేరారు. నిరుద్యోగ జెఏసి తరుపున ఆర్టీఐ ద్వారా బాధితులైన వారు సేకరించిన నకిలీ సర్టిఫికేట్ల భాగోతం ఎలక్ట్రానిక్, ఫ్రింట్ మీడియా ద్వారా వెలుగులోనికి వచ్చింది. దీనిపై రీజనల్ జాయింట్ డైరెక్టర్ సర్టిఫికెట్స్ ని పూర్తి స్థాయిలో పరిశీలించకుండా నియామక పత్రాలు జారీ చేయటం చట్ట విరుద్ధమని, తాను చేసిన తప్పును తెలుసుకుని నకిలీ సర్టిఫికేట్ కలిగిన కాంట్రాక్ట్ లెక్చరర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధిత ప్రిన్సిపాల్లను ఆదేశించారు. అసలు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చెయ్యకుండా క్రమబద్ధీకరించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది పెద్ద ప్రశ్న.

- Advertisement -

గత ప్రభుత్వం వారి బాధలను వినకపోవడం వలన కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను డబ్ల్యు పీ ( టీ ఆర్ ) 5972/2017, డబ్ల్యు పీ 14890/2016, డబ్ల్యు పీ 21838/ 2016, ద్వారా పలు కేసులు నమోదు చేయడం జరిగింది. తదనంతరం వాదోపవాదాలు విన్న హైకోర్టు క్రమబద్ధీకరణను నిలుపుదల చేయాలని తేది: 04.05.2023న స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికి గత ప్రభుత్వ ఒత్తిడితో ఇంటర్ మీడియట్ అధికారులు రూల్స్ కి విరుద్ధంగా మద్యంతర ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒక రోజు ముందు తేదీ వేసి నియామక
ఉత్తర్వులను జారీ చేసారు. కనుక 04.05.2023న అర్థరాత్రి తర్వాత నియామక పత్రాలను కాంట్రాక్ట్ లెక్చరర్లకు అందజేయకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులకు నియామక పత్రాలను అందజేసారు. ఇదే విధానాన్ని డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామకాలలో అనుసరించారు.

ఈ పరిణామాలతో న్యాయ పోరాటం ఒక్కటే పరిష్కారం కాదని నిరుద్యోగుల హక్కులను హరించి వేసిన కేసిఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయాలని నిర్ణయించుకున్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగులందరూ సంఘటితమై సైనికుల్లా పనిచేసి, కేసిఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినారు.. వారి యొక్క అకాంక్షలకు అనుకూలంగా ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వం వారి విన్నపాన్ని మన్నించి.. జిఓ 16ను తక్షణమే రద్దు చేసి.. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను అన్నింటిని టిఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయాలని వేడుకుంటున్నారు.. వయోపరిమితి దాటిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు సడలింపు ఇచ్చి వారికి కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు.. తద్వారా తెలంగాణలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఎసి, ఉస్మానియా యూనివర్సీటి వారు మరీ మరీ కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు