న్యూఢిల్లీ : దైనందిన అవసరాలతో పాటు లొకేషన్స్ గుర్తించడం నుంచి కాంటాక్ట్ వివరాలను పొందడం వరకూ మనం సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌నే ఆశ్రయిస్తాం. గూగుల్‌పై జనం ఆధారపడిన రోజుల్లో ఇదే వేదికగా అక్రమార్కులు చెలరేగుతూ సైబర్ నేరాలతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. లేటెస్ట్‌గా ఢిల్లీకి చెందిన ఓ డాక్టర్ క్యాబ్ యాప్ నుంచి రిఫండ్ పొందేందుకు ప్రయత్నిస్తూ ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు. సఫ్ధర్‌జంగ్ ఎన్‌క్లేవ్ అర్జున్ నగర్ నివాసి ప్రదీప్ చౌధురి క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి రూ. 113 రిఫండ్ కోరే క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బిగుసుకుని భారీ మొత్తం కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ చౌధురి గురుగ్రాంకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. తొలుత రైడ్‌కు రూ. 205 చూపగా చివరిలో రూ. 318 చూపింది. రూ. 113 అదనంగా చార్జ్ చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను డాక్టర్ చౌధురి ప్రశ్నించారు. రిఫండ్ కోసం క్యాబ్ కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని డ్రైవర్ సూచించాడు. దీంతో గూగుల్‌లో కస్టమర్ సర్వీస్ నెంబర్ కోసం డాక్టర్ సెర్చ్ చేశారు. క్యాబ్ కంపెనీకి చెందిన నెంబర్‌గా గుర్తించి ఆ నెంబర్‌కు కాల్ చేశారు. కాలర్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా నమ్మబలికిన వ్యక్తితో రిఫండ్ గురించి డాక్టర్ చౌధురి వివరించారు. ఆపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే రాకేష్ మిశ్రాకు కాల్‌ను రీడైరెక్ట్ చేశారు. రిమోట్ సెన్సింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని తన ఈ-వ్యాలెట్‌కు యాక్సెస్ చేసుకోవాలని బాధితుడికి మిశ్రా సూచించాడు. ఆపై రిఫండ్ అమౌంట్‌ను వేసి, ఫోన్ నెంబర్ తొలి ఆరు అంకెలను వెరిఫికేషన్ కోసం ఇవ్వాలని మిశ్రా కోరాడు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం చౌధురి మిశ్రా చెప్పినట్టు అనుసరిస్తూ ఆయన కోరిన సమాచారం అందించారు. తన ఓటీపీని కూడా ఆయన షేర్ చేశారు. దీంతో అనధికార లావాదేవీలతో డాక్టర్ చౌధురి ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు. మోసపోయానని గ్రహించిన చౌధురి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.