Monday, April 29, 2024

అద్దంకి ఔట్‌

తప్పక చదవండి
  • చివరి నిమిషంలో తెరపైకి మహేష్‌ కుమార్‌ గౌడ్‌
  • ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడే చివరి రోజు
  • రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌
  • పిన్న వయసులో బల్మూరి వెంకట్‌కు అవకాశం
  • అధికారిక ప్రకటన విడుదల చేసిన కెసి వేణుగోపాల్‌
  • కాంగ్రెస్‌ నిర్ణయమే శిరోధార్యమన్న దయాకర్‌
  • పేరు లేకపోవడంపై స్పందించిన అద్దంకి దయాకర్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గురువారంతో గడువు ముగియనుంది. రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల కావడంతో రెండు పదవులకు విడివిడిగా ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌కు మాత్రమే ఎమ్మెల్సీ పదవులను గెల్చుకునే అవకాశం ఉంది. రెండు పోస్టులకు కాంగ్రెస్‌ అధిష్టానం తమ అభ్యర్థులను అదికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ మార్క్‌ ట్విస్టులు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారులో కనిపించాయి. ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు అద్దంకి దయాకర్‌, బలమూరి వెంకట్‌ పేర్లను ఖరారు చేసినట్లుగా మంగళవారం వారికి ఏఐసీసీ నుంచి సమాచారం వచ్చింది. అయితే బుధవారం విడుదలయిన జాబితాలో మాత్రం బలమూరి వెంకట్‌ తో పాటు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేరు ఉంది. దీంతో అద్దంకి దయాకర్‌కు షాక్‌ తగిలినట్లయింది. అద్దంకి దయాకర్‌ కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ లేదా వరంగల్‌ ఎంపీ టిక్కెట్‌ ఇస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. గురువారంతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుండగా.. బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. అయితే, చివరి వరకు కూడా అద్దంకి దయాకర్‌కే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు అని ప్రచారం జరుగగా.. తాజాగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. అంతేకాదు.. మంగళవారం నాడు పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్‌ చేసి నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారని ప్రచారం సాగింది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. దయాకర్‌ కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఈ సంబరాలు, అనందం గంటల్లో ఆవిరయ్యాయి. కాంగ్రెస్‌ ప్రకటించిన జాబితాలో దయాకర్‌ పేరు మిస్‌ అయ్యి.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుండగా.. 29న రెండు స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు మాత్రమే నామినేషన్‌ వేస్తే.. ఏకగ్రీవం అయ్యే ఛాన్స్‌ ఉంది.

కాంగ్రెస్‌ నిర్ణయమే శిరోధార్యం : అద్దంకి దయాకర్‌
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పేరు లేకపోవడంపై ఎలాంటి అపోహలు లేదా అనుమానాలు లేవని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం శరోధార్యమని అన్నారు. తన అనుచరులు, అనుయాయులు కూడా ఇది గమనించాలన్నారు. కాంగ్రెస్‌లో తనకు ఇంతకన్నా మంచి పదవి దక్కుతుందని ఆశిస్తున్నానని అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని భావించిన ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌కు షాక్‌నిస్తూ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన విషయం పై దయాకర్‌ స్పందించారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకున్నా కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. అధిష్ఠానం తనపై పాజిటీవ్‌గా ఉందని.. మరింత మంచి స్థానాన్ని కట్టబెడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు