Monday, April 29, 2024

దేశానికి ‘షిప్‌ బిల్డింగ్‌ హబ్‌’గా కొచ్చి

తప్పక చదవండి
  • కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
  • కోస్టల్‌ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి
  • గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ
  • సురేశ్‌ గోపి కూతురు పెళ్లికి హాజరు

కొచ్చి : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ప్రాజెక్టులలో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ’న్యూ డ్రై డాక్‌, ఇంటర్నేషనల్‌ షిప్‌ రిపేర్‌ ఫెసిలిటీ (ఐఎస్‌ఆర్‌ఎఫ్‌), కొచ్చిలోని పుదువ్యాపీన్‌ వద్ద ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎల్పీజీ ఇంపోర్ట్‌ టెర్మినల్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, తనకు కేరళలో లభించిన సాదర స్వాగతానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో ప్రారంభించిన కొత్త ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ప్రాజెక్టులపై మాట్లాడుతూ, కొచ్చి వంటి కోస్టల్‌ సిటీల సామర్థాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశానికి ’షిప్‌ బిల్డింగ్‌ హబ్‌’గా కొచ్చి రూపుదిద్దుకోనుందన్నారు. పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మరింత పటిష్టం చేయడం, పోర్టుల అనుసంధానాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారుతున్న తరుణంలో మన సముద్ర శక్తిని కూడా పెంచుకుంటు న్నామని, ఇందుకు ఉదాహరణగా కొచ్చి అభివృద్ధిని త్వరలోనే చూస్తామని అన్నారు. నూతన మౌలిక వసతుల కల్పన ద్వారా కొచ్చి నౌకాశ్రయం సామర్ధ్యం మరింత పెరగనుందని చెప్పారు. నౌకా నిర్మాణం, మరమ్మతులు, ఎల్‌పీజీ టెర్మినల్‌తో దేశంలోని అతిపెద్ద డ్రై డాక్‌గా కొచ్చి నిలుస్తుందన్నారు. త్రిసూర్‌లోని గురువాయూరు ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. కొద్దిరోజుల క్రితం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు రామాయణానికి సంబంధించిన నాలుగు స్థలాలు కేరళలో ఉన్న విషయాన్ని ప్రస్తావించాను. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు కేరళ వచ్చి త్రిప్రయర్‌ శ్రీ రామస్వామి ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా నని అన్నారు. ప్రధాని తన రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం త్రిసూరులోని గురువాయూర్‌ శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవస్థానం ఆఫీస్‌ బ్యారర్లు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నటుడు, బీజేపీ నేత సురేష్‌ గోపి కుమార్తె వివాహ కార్యక్రమంలోనూ మోడీ పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోడీ కేరళలో పర్యటించడం గత రెండు వారాల్లో ఇది రెండవది. ఈ సందర్భంగా మలయాళ నటుడు సురేష్‌ గోపీ పెద్ద కూతురు భాగ్య సురేశ్‌, ప్రముఖ వ్యాపారవేత్త శ్రేయాస్‌ మోహన్‌ల వివాహం బుధవారం ఉదయం 8.45 గంటలకు త్రిసూర్‌లోని గురువాయూర్‌ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. కేరళ పర్యాటనలో ఉన్న ఆయన త్రిసూర్‌కి వచ్చారు. సురేష్‌ గోపీ కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి, వరమాలలు అందించారు. మోడీరాకతో ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సురేశ్‌ గోపి కుటుంబం, కొత్త జంటతో మోడీ మాట్లాడారు. అనంతరం వారితో ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత మరో 30 జంటలను ఆశీర్వదించిన మోడీ, వేదిక నుంచి వెళ్లిపోయారు. ఓవైపు అయోధ్యలో రామ మందిరం పూజ కార్యక్రమాలు జరుగుతుండగా.. ప్రధాని సమయాన్ని వెచ్చించి ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని తొలుత కొచ్చి నుంచి హెలికాప్టర్‌లో గురువాయూర్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గురువాయూర్‌ ఆలయానికి చేరుకున్నారు. వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం వేదిక వద్దకు చేరుకున్నారు. మోడీ సాంప్రదాయ దుస్తుల్లో ధోతీ, షర్ట్‌లో కనిపించారు. ఈ వివాహ వేడుకకు నటుడు మోహన్‌లాల్‌, మమ్ముట్టి, దిలీప్‌, ఖుష్బు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరితోపాటు దుల్కర్‌ సల్మాన్‌, టోవినో థామస్‌, కుంజకో బోబన్‌ సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు భాగ్య సురేష్‌ ఎరుపు రంగు కాంచీపురం చీరను ధరించగా, వరుడు శ్రేయాస్‌ మోహన్‌ కేరళ ధోతీ, శాలువాలో కనిపించారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు