- నగరాల్లో పేరుకుపోయిన చెత్తను 75 శాతం మేరకు శుద్ధి చేస్తున్నాం
- 11 కోట్ల టాయిలెట్ల నిర్మాణంతో బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్ ను మార్చాం
- గాంధీ, అంబేద్కర్ ఆశయాల సాధనలో ‘స్వచ్ఛభారత్’ కీలకం
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
- జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో చీపురుపట్టి చెత్తను ఊడ్చిన బండి

హైదరాబాద్ : మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనలో స్వచ్ఛ భారత్ మిషన్ కీలకంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. గ్రామాలను, పట్టణాలను చెత్తరహితంగా మార్చడం ద్వారా చెత్తరహిత దేశంగా భారత్ ను మార్చడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాల స్పూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ కుమార్ సోమవారం రోజు ఉదయం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనికేతన్ కాలనీలో చీపురు చేతబట్టి స్వయంగా చెత్తను ఊడ్చారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, స్థానిక బీజేపీ నేతలతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్ లో కీలకంగా మారిన పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

2014లో మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా దేశంలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశాలుగా మార్చగలిగాం. 2019లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ 2.O ద్వారా మొదటి దశలో సాధించిన లక్ష్యాలను నిలబెట్టుకోవడంతోపాటు రెండవ దశలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2014లో స్వచ్ఛభారత్ మొదలు పెట్టిన సమయంలో కేవలం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధి చేసేవారని, స్వచ్ఛ భారత్ అమలు నేపథ్యంలో ప్రస్తుతం 70 శాతం చెత్తను శుద్ధి చేయగలుగుతున్నాం. మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్, అమృత్ మిషన్ దేశానికీ గర్వకారణంగా నిలిచాయి. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలి. ప్రభుత్వాధికారుల మొదలుకొని జవానులు, బాలీవుడ్ నటీనటుల నుంచి క్రీడాకారులు, పారిశ్రామికవేత్తల నుంచి ఆధ్యాత్మిక గురువుల దాకా.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన పనిలో పాల్గొనాలని కోరుతున్నా అన్నారు..