Friday, May 3, 2024

రాంపతి.. సివిల్ సప్లయ్ శాఖకే అధిపతి..!

తప్పక చదవండి
  • సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి లీలలు..
  • ఏడేళ్లుగా సూర్యాపేటలోనే తిష్ట వేసి కూర్చున్న వైనం
  • నల్లగొండలో అయ్యవారికి మూడంతస్థుల మేడ.. అంతుచిక్కని ఆస్తుల జాడ..!
  • ఇంటి చుట్టూ ఏసీలు.. ఇంటి ముందట లగ్జరీ కార్లు..
  • అబాసుపాలు అవుతున్న జిల్లా సివిల్ సప్లయ్ శాఖ

ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ శాఖ సి.ఎం.ఆర్ బియ్యం రికవరీలో నిత్యం వెనుకంజులోనే ఉంటోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోని సిఎంఆర్ బియ్యం రికవరీలో అధికారుల వైఫల్యం కళ్ళకు కట్టినట్లుగా కనబడుతోంది. పక్కనే ఉన్న నల్లగొండ, యాదాద్రి జిల్లాలను పోల్చి చూస్తే, సూర్యాపేట జిల్లా సీఎంఆర్ విషయంలో ఎప్పుడూ వెనుకడుగే. ఈ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మొదలు సిఎంఆర్ బియ్యం రికవరీ వరకు అన్ని అవకతవకలే. అవినీతి సొమ్ముపైనే అధికారుల మోజు.. జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో పనిచేస్తున్న ముఖ్య అధికారులు కొంతమంది డిఫాల్ట్ మిల్లర్లతో మీలాఖాత్ అయి, కోట్లాది రూపాయల సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లకే ప్రతి సీజన్లో అధికంగా ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు.

పౌరసరఫరాల శాఖ జీవో నెంబర్ 13, 23, 26లో పేర్కొన్న సీఎంఆర్ పాలసీ ప్రకారం డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయించకూడదని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ సూర్యాపేట జిల్లాలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు ఇవేమీ పట్టించుకోరు. గతమంతా ఇక్కడ గులాబీ నేతలు చెప్పిందే పాలసీగా నడిచింది. డిఫాల్ట్ మిల్లర్లకు ఎంత ధాన్యం కేటాయింపులు ఎక్కువగా కేటాయిస్తే, అధికారులకు అంత పైకం ముట్టే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ లీలలు.. జిల్లా పౌరసరఫరాల శాఖలో డి.ఎస్.ఓ, మరియు డి.ఎం ఈ ఇరువురు కీలకమైన భూమికను పోషిస్తారు. ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల సెంటర్ నుండి ధాన్యం కొనేటప్పుడు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా సెంటర్లలో ఎలాంటి అవినీతి లేకుండా పరిశీలించే బాధ్యత జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ పర్యవేక్షిస్తారు.

- Advertisement -

రైతుల నుండి ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని డి.ఎస్.ఓ ఆయా మిల్లర్లకు కేటాయిస్తారు. సదరు ధాన్యానికి సీఎం అర్ బియ్యం రికవరీ వరకు డి.ఎస్.ఓతో పాటు డి.ఎం కూడా వందల కోట్ల విలువ చేసే సంబంధిత ప్రభుత్వ ధనానికి ఈ ఇరువురు కస్టోడియన్ అధికారులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు పనిచేస్తున్నారా? అంటే లేదనే సమాధానమే ఇరువైపులా వినిపిస్తోంది. 2016 సంవత్సరం నుండి అంటే సూర్యాపేట జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ గా రాంపతి అనే అధికారి ఒక్కడే ఇక్కడ దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. 2016 నుండి 2024 వరకు సుమారు 8 ఏళ్లుగా ఈయనే ఇక్కడ డి.ఎం గా పనిచేస్తున్నారు. మధ్యలో ఒక సంవత్సరం పాటు మాత్రం జనగామ జిల్లాకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి శాఖపరంగా పరిశీలిస్తే, ఇదే జిల్లాలో ఈయన కంటే పై అధికారిగా రెగ్యులర్ డి.ఎం స్థాయిలో పనిచేయాల్సిన వ్యక్తి ఈయన క్రింద ఎ.ఎం (అసిస్టెంట్ మేనేజర్)గా పనిచేస్తున్నారు. లోతుగా పరిశీలిస్తే ఈ కార్యాలయంలో అంతా గందరగోళంగానే కనిపిస్తోంది. సాధారణంగా జిల్లా స్థాయిలో ఒక అధికారిగా పని చేసే హోదా, అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ జరిగే గోల్ మాల్ వ్యవహారాలకు భయపడి డి.ఎం కుర్చీలో కాకుండా, తనను తాను తగ్గించుకొని ఓ అధికారి అసిస్టెంట్ మేనేజర్ గానే కొనసాగుతూ, నిజాయితీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ గా పని చేయాల్సిన వ్యక్తి జిల్లా అధికారిగా పెత్తనం కొనసాగిస్తున్న వైనం ఇక్కడ నెలకొంది. రాంపతి.. సివిల్ సప్లయ్ శాఖకే అధిపతి..! సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో జిల్లా ఇన్చార్జి మేనేజర్ గా గడిచిన 7 ఏళ్లు వరుసగా ఈయనే ఇక్కడ ఎలా కంటిన్యూ అవుతున్నాడనే అనుమానం ప్రస్తుత కలెక్టర్ కు కూడా వచ్చిందట. రాంపతి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కొన్ని సంవత్సరాలుగా పనిచేశారు. కానీ నేటికీ బదిలీ లేకుండా దీర్ఘకాలికంగా ఎలా ఒక్కడే ఈ శాఖకు అధిపతిగా ఉన్నాడనేది అందరి సందేహం! గత ప్రభుత్వంలో ఉన్న గులాబీ నేతల ఆశీర్వాదం ఈయన లాంటి అధికారులకు ఇక్కడ పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం అని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. సారు ఇంటి చుట్టూ ఏసీలు.. ఇంటి ముందు లగ్జరీ కార్లు… సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి అని అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. బహిరంగంగా పరిశీలిస్తే కూడా ఈయన అయితే లగ్జరీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారని తెలుస్తోంది. నల్లగొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్న బాలాజీ హోమ్స్ అనే కాలనీలో ఈయన మూడంతస్తుల మేడ, ఈ మేడ చుట్టూ పలు ఏసీలు, ఇంటి ముందట లగ్జరీ కార్లు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. సంబంధిత సొంత నెంబర్ ప్లేట్ కార్లపై “ఆన్ గౌట్ డ్యూటీ” అనే రెడ్ లైన్ స్టిక్కర్లు చూస్తేనే సారు అధికార దర్పణం కనిపిస్తోంది. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లో ఒక సాధారణ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి ఇంత గొప్ప లగ్జరీగా జీవనం కొనసాగించడం సాధ్యమయ్యే పని కాదు. ఈయన లాంటి అసిస్టెంట్ మేనేజర్లు ఉమ్మడి జిల్లాలో పలువురు విధులు నిర్వహిస్తున్నా, వారంతా చాలా సాదాసీదాగానే వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో అత్యధికులు ఈయన సామాజిక వర్గం ఉద్యోగులే.. సూర్యాపేట పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విభాగంలో పనిచేస్తున్న అత్యధిక ఉద్యోగులంతా డి.ఎం రాంపతి సామాజిక వర్గానికి చెందిన తన బంధు వర్గాన్ని ఈ కార్యాలయంలో నింపుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇది ఫండమెంటల్ రూల్స్ కు విరుద్ధం. అసలు ఈ కార్యాలయంలో ఏం జరుగుతుందో! మున్ముందు మరిన్ని వివరాలు.. ఇంకా అంతుచిక్కని ఆస్తుల జాడలు బయటకు తెచ్చే ప్రయత్నం చేద్దాం!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు