Thursday, May 9, 2024

కౌన్సిల్‌కు కొత్త భవనాలు

తప్పక చదవండి
  • పాత భవనం ఆవరణలోనే ఏర్పాటు
  • ఎక్కడ తప్పులున్న చర్యలు తీసుకుంటాం
  • మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కోమటిరెడ్డి
  • తొమ్మిది ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి
  • 2 రోజులకే హరీశ్‌ విమర్శలంటూ మండిపాటు
  • పదేళ్లలో మీరేం చేశారంటూ కౌంటర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి మూడు రోజులవుతున్న వేళ.. రేవంత్‌ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా సచివాలయంలోని తన ఛాంబర్‌ లో బాధ్యతలను చేపట్టారు. సచివాలయంలోని 5వ అంతస్తులోని 11వ ఛాంబర్‌ లో బాధ్యతలను స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా తన ఛైర్‌ లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులు, సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, అధికారులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే కొన్ని ఫైళ్లపై సంతకం చేశారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ అప్పగించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.. అసెంబ్లీ పరిసరాలు సుందరీకరణ చేస్తామని ప్రకటించారు. కాగా.. సీఎల్పీ కార్యాలయానికి కూల్చేస్తామని ప్రకటించారు. వాటి స్థానంలోనే కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు. కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారని స్పష్టం చేశారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతామని.. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సంతకాలు చేసిన తొమ్మిది ఫైళ్లలో.. నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్‌ రోడ్డుగా మార్చటం.. కొడంగల్‌, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. రానున్న రెండు మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి పూర్తి చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెల్లడిరచారు. పదేళ్లుగా కేసీఆర్‌ సర్కార్‌ రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతానన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. వీటితో పాటు.. విజయవాడ- హైదరాబాద్‌ రహదారిని 6 లైన్లకు, హైదరాబాద్‌- కల్వకుర్తి 4 లైన్‌లకు పెంచటంతో పాటు సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌)ని పెంచాలని అడుగుతానని కోమటిరెడ్డి తెలిపారు. ఈ మేరకు రేపే నితిన్‌ గడ్కరీని కలవనున్నట్టు తెలిపారు. భువనగిరి ఎంపీ పదవికి కూడా రేపే రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే… ఏం చేశారంటూ మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిందేముందని ప్రశ్నించారు. రహదారులపై శ్రద్ధ పెట్టలేదని దుయ్యబట్టారు. తాము ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడమని… తప్పులు ఉంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు