Sunday, September 15, 2024
spot_img

బిలాదాఖలా భూమిలో విచిత్ర లీలలు

తప్పక చదవండి
  • అవసరమైనప్పుడే రిజిస్ట్రేషన్స్‌.. సాగుదార్లను పట్టించుకోని వైనం..
  • ఆ తర్వాత ధరణి నుంచి కొనుగోలుదార్ల పేర్లు మాయం
  • వారికి పదో పరకో ఇచ్చి చేతులు దులుపుకునే తంతుకు శ్రీకారం
  • వారి వద్ద పట్టా పాస్‌ బుక్స్‌ ఉన్నా.. రికార్డులకు ఎక్కించని వైనం
  • కొత్త సర్కార్‌ చొరవ తీసుకుంటే బడాబాబుల యవ్వారం బయటపడే ఛాన్స్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం కొండకల్‌ బిలా దాఖలా భూ పంచాదీలో తవ్వేకొద్ది విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈవ్యవహారంలో బడానేతలు,అవినీతి తిమింగలాలు అధికారులను అడ్డంపెట్టుకొని సాగుదారులను నయానో.. భయానో దారికి తెచ్చుకొని బిలాదాఖలా భూములను అమాంతం మింగేసే యత్నం చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు వస్తే మాత్రం.. అప్పటి మందం నామ్‌ కే వాస్తేగా నాలుగు రోజుల పాటు అక్రమంగా రికార్డులకు వచ్చిన దొంగ పట్టేదార్లు వారి పేర్లను ధరణి నుంచి టెంపరరీగా మాయం చేయిస్తూ…తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం కొండకల్‌-మోకీల గ్రామాల మధ్య ఏ సర్వే నెంబర్‌ లేని ప్రభుత్వ బిలాదాఖల భూమి 117.16 ఎకరాల ల్యాండ్‌ ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి ఎలాంటి సర్వే నెంబర్‌ లేకపోయినప్పటికీ కొందరు రైతులు ఈ ల్యాండ్‌ ను చాన్నాళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2004లో పరిగిలో జరిగిన బహిరంగ సభలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి చేతుల మీదుగా సాగుదారులకు లావాణి పట్టాలను కూడా అప్పటి సర్కార్‌ అందజేయడం జరిగింది. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ఈ బిలాదాఖల భూమికి సర్వే నెంబర్‌ 555ను కేటాయించి పట్టాలను అందజేసింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్న..సర్కార్‌ పట్టాలు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం సదరు సాగు/పట్టాదారుల వివరాలను మాత్రం రికార్డులకు నమోదు చేయకపోవడం గమనార్హం. అసైన్డ్‌,పహనీ రికార్డుల్లో ఆ భూమి బిలాదాఖలా భూమిగానే కొనసాగుతూ..వచ్చింది. అయితే రికార్డుల పరిస్థితి ఎలా ఉన్నా..చాలా మంది రైతులు మాత్రం ఈ భూముల్లో అలాగే సాగులో ఉండడం విశేషం.


అవినీతి తిమింగలాల ఎంట్రీతో మొదలైన లిటిగేషన్‌..!
ఇక కొండకల్‌ బిలా దాఖల భూముల గురించి తెలుసుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే,మరికొన్ని తిమింగలాలు ఈ ల్యాండ్స్‌ పై కన్నేశాయి. కొండకల్‌,మోకీలలో ఎకర భూమి తక్కువలో తక్కువ ఎకరాకు బహిరంగ మార్కెట్లో రూ.15 నుంచి 20 కోట్లు పలుకుతోంది. అయితే ఇంతటి విలువైన బిలాదాఖల భూమిని కొట్టేసేందుకు సదరు అవినీతి తిమింగలాలు, అధికారులను అడ్డంపెట్టుకొని సాగుదారులకు రూ.1.40 నుంచి రూ.2.20 కోట్లు ముట్టజెప్పి ల్యాండ్స్‌ ను కైవశం చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇలా ఇప్పటికే పలువురు సాగుదార్ల నుంచి ఈ ప్రబుద్ధులు ల్యాండ్స్‌ కైవశం చేసు కోవడం జరిగింది. మరోవైపు ఈ ఏడాది జూన్‌ 29న ఈ భూమిని ఏడీతో సర్వే చేయించుకున్న సదరు ప్రబుద్ధులు..ఈ సర్వే రిపోర్టు కాపీని మాత్రం రైతులకు ఇచ్చేందుకు నిరాకరించడం గమనార్హం.
అంతేకాక వారికి అనుకూలంగా ఉన్న సాగుదార్ల పేర్లను ధరణిలో ఆన్‌ లైన్‌ లో నమోదు చేయించి వారి ద్వారా రిజిస్ట్రేషన్స్‌ చేయించుకుని మళ్లీ రిజిస్ట్రేషన్స్‌ అయిపోగానే సదరు పట్టేదార్ల పేర్లను పోర్టల్‌ నుంచి మాయం చేయిస్తుండడం విశేషం. అయితే ఈమొత్తం వ్యవహారంపై కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర సర్కార్‌ దృష్టి సారిస్తే..ఈస్కాంలోని పాత్రదారులు, సూత్రధారుల యవ్వారం మొత్తం బయటపడే ఛాన్సుంది. సాగుదారులకు గతంలో పట్టాలు ఇచ్చిన బిల్లాదాఖల భూమిలో ఏ రకంగా రిజిస్ట్రేషన్స్‌ కొనసాగిస్తున్నారనే దానిపై స్పష్టం రానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు