Friday, May 17, 2024

కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?

తప్పక చదవండి
  • లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ
  • రాజకీయ చర్చకు దారితీస్తోన్న సమీకరణాలు

హైదరాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. లండన్‌ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డితో అక్బరుద్ధీన్‌ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని అక్బరుద్ధీన్‌ కలవడం పట్ల రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బొటాబోటీ మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ ప్రతిపక్షాలు హెచ్చరిక వ్యాఖ్యలు చేస్తున్న నేపధ్యంలో రేవంత్‌ రెడ్డిని ఎంఐఎం నేత అక్బరుద్ధిన్‌ కలవడం సహజంగానే కాంగ్రెస్‌, ఎంఐఎంలు పరస్పరం కలిసి నడుస్తాయన్న చర్చలను రేకేత్తించింది. ప్రస్తుతం అసెంబ్లీలో 119స్థానాల్లో కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి 1 స్థానం, ఎంఐఎంకు 7, బీజేపీకి 8, బీఆరెస్‌కు 39స్థానాలున్నాయి. బీఆరెస్‌, బీజేపీలు ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారినా రేవంత్‌ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు కీలకంగా మారనుంది. సాధారణంగా మజ్లిస్‌ వ్యూహం అధికార పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండటం. కాంగ్రెస్‌ తోనూ అలాగే ఉంటుంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు మొహమాటాలు పెట్టుకోరు. ఏ స్థాయిలో అవకాశం వస్తే ఆ స్థాయిలో నిలదీస్తారు. కానీ బయట రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది. మజ్లిస్‌ పాతబస్తీలో తమ బేస్‌ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే తెలంగాణ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండి.. పాతబస్తీలోకి అడుగు పెట్టకుండా చూసు కుంటుంది. మిగతా తెలంగాణ మొత్తం ఆ పార్టకి మద్దతుగా ఉంటుంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి అలాగే మద్దతుగా నిలిచింది. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవడానికి చాలా మద్దతు ఇచ్చింది. కానీ కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. బీఆర్‌ఎస్‌ పాత్ర పరిమితంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో పోటీ చేయాలన్న ప్రయత్నాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గల్లంతు అయ్యాయి. ఇప్పుడు మజ్లిస్‌ కు కాంగ్రెస్‌ తో సన్నిహితంగా ఉండటమే కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ ప్రచారం చేసినా ముస్లిం వర్గాలు బీఆర్‌ఎస్‌ వైపు కాకుండా కాంగ్రెస్‌ వైపు మొగ్గారని ఓటింగ్‌ సరళిని బట్టి అర్థమవుతుంది. అదిగాక బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పోరాడుతుంది. ఇండియా కూటమిని ముందుండి నడిపిస్తుంది. జాతీయ రాజకీయాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, కాంగ్రెస్‌ సారధ్యంలోని ఇండియా కూటమిలు అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆరెస్‌, ఎంఐఎంలు ఏదో ఒక పక్షంకు ఎన్నికల ముందు లేదా తర్వాతా మద్దతునివ్వక తప్పని పరిస్థితి తలెత్తవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆరెస్‌ల మధ్య రాష్ట్రంలో త్రిముఖ పోటీ సాగనుంది. ఇంకోవైపు బీజేపీ, బీఆరెస్‌లు లోపాయి అవగాహానకు రావచ్చన్న ప్రచారం కూడా వినిపిస్తున్నది. తెలంగాణలో అధికార పార్టీగా కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గాలి వాటం కాదని చాటల్సిన అవసరముంది. ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ విజయానికి మైనార్టీ ఓటర్ల అండ కూడా అవసరమే. ఎంఐఎంకు కూడా బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యమంటుంది. అందుకు పరస్పర రాజకీయ ప్రయోజనాల నేపధ్యంలో కాంగ్రెస్‌, ఎంఐఎంలు భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి సాగాలన్న ఆలోచనకు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌, అక్బరుద్ధీన్‌ల భేటీ జరిగి ఉండవచ్చని, రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి సాగినా ఆశ్చర్యం లేదన్న ప్రచారం సాగుతున్నది. అయితే మజ్లిస్‌ ఎప్పుడూ ఏ కూటమిలో నేరుగా చేరదు.. తెర వెనుక సహకారంకు మాత్రమే పరిమిత మవుతుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, ఎంఐఎం శాసన సభ పక్ష నేత అక్బరుద్ధీన్‌ ఒవైసీలు లండన్‌ నగరంలో పర్యటించారు. లండన్‌ షార్డ్‌ ను సందర్శించారు. అక్కడ నుండి లండన్‌ అర్బన్‌ లేఔట్‌, అభివృద్ధిని ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. 72 అంతస్తుల పైభాగంలో, 309 మీటర్ల పొడవు ఎత్తు నుండి , నిండుగా ఉన్న థేమ్స్‌ నది లండన్‌ ఉత్తరం వైపు ప్రాచీన నగరంతో ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో పరిశీలించారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధి, మూసీ రివర్‌ అభివృద్ధి చర్యల కోణంలోనే ఈ పరిశీలన చేశారు. అయితే దీని వెనుక రాజకీయం ఉందనే ప్రచారం సాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు