Thursday, May 9, 2024

సీసీఎల్ఏలో అధికారుల లీలలు

తప్పక చదవండి

(బిలాదాఖలా భూములు మాయమవడంలో అధికారుల పాత్ర)

  • రైతులను మోసం చేయడంలో ఉప సర్పంచ్ తనయుడు భూపాల్ దిట్టా
  • సీసీఎల్ఏ నుండి ధరణి రిజిస్ట్రేషన్ వరకు అన్ని తానే
  • సీసీఎల్ఏలో దగ్గరుండి స్లాట్ బుకింగ్ చేస్తున్న మధు మోహన్ రెడ్డి
  • గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ
  • తెరవెనుక వినాయక డెవలపర్స్ యాజమాన్యం
  • కమిషనర్ నవీన్ మిట్టల్ పాత్రపై అనుమానాలు?
  • కబ్జాదారులకు అండగా నిలుస్తున్న రెవెన్యూ అధికారులు

బిలా దాఖలా భూ కుంభకోణంలో సీసీఎల్ఏ అధికారుల అండదండలు మెండుగానే కనిపిస్తున్నాయి. అంతా తామై వ్యవహారాన్ని నడిపిస్తూ పని చక్కబెడుతున్నారు. సామాన్యులకు నిబంధనల పేరిట పట్టపగలే చుక్కలు చూపించే అధికారులు ఇక్కడ మాత్రం రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని రైతులు అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్న అధికారులు పెడచెవిన పెట్టారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రియే పరిగిలో జరిగిన బహిరంగ సభలో రైతులకు 555 సర్వే నెంబర్ తో పట్టాలను ఇవ్వగా, అధికారులు మాత్రం పట్టాలు ఇచ్చిన విషయాన్ని రెవెన్యూ రికార్డులలో నమోదు చేయలేదు. ప్రస్తుతం జరిగే భూ వ్యవహారాల్లో సైతం అధికారులు కొనుగోలుదారులకే దాసోహం అయ్యారు. నియమ నిబంధనను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు చేస్తూ బడాబాబులకు అండగా నిలుస్తున్నారు. రక్షించే వాడే భక్షకుడు అయితే వ్యవహారం ఇలాగే ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అంతా తామై నడిపిస్తున్న ఆ ఇద్దరూ…
ఈ బిలాదాఖలా భూ వ్యవహారంలో మదుమోహన్ రెడ్డి భూ కొనుగోలు దారులు అయిన ఎమ్మెస్ వినాయక డెవలపర్స్, పాకలపాటి వెంకట క్రుష్ణ, కోగంటి భానుప్రకాష్, వేమూరి ఆదిత్య మొదలగు బడాబాబులకు మద్యవర్తిగా, రైతులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించే అతి పెద్ద గురుతర బాద్యతను కొండకల్ గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మమ్మ కుమారుడు గోపాల్ తీసుకొని అధికారం లేకపోయినా అధికారులను సమాధాన పరిచి రైతులను మోసం చేయడం, అలాగే ఇటు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడంలో వీరిద్దరు ఒక ఎత్తు అయితే రెవెన్యూ అధికారులు కూడా వారికి మేమేం తీసిపోం అన్నట్టు వారు చదువుకున్న చదువుకు, బాధ్యతకు మచ్చ తెస్తున్నారనే అర్థం చేసుకోవచ్చు.

నిబంధనల ఉల్లంఘన……!
ఏదైనా భూమిని అమ్ముతున్నప్పుడు, కొనేవాళ్ళ అమ్మే వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్ బుక్ నెంబర్ ఉంటేనే ధరణిలో స్లాట్ బుక్ అవుతుంది. ఇవి లేకుంటే ధరణిలో స్లాట్ బుక్ కానీ విషయం అందరికీ తెలిసిందే. అందుకేనేమో ప్రత్యేకంగా ఈ బిలాదాఖల భూములకు సంబంధించిన స్లాట్ బుకింగ్ మాత్రం నగరంలోని సీసీఎల్ఏ కార్యాలయంలోనే జరుగుతున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే ధరణి పాస్ పుస్తకం, ధరణి పహాని, ధరణి ఈసి, పాత ఈసీ( ఐ జి ఆర్ ఎస్ ), భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా అని చూడటం, అదేవిధంగా భూమి అమ్మే వ్యక్తికి భూమి ఎలా వచ్చింది అనే విషయాలను నిర్ధారణ చేసుకొని విచక్షణతో సంబంధిత తహసిల్దార్ లేదా ఉప తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే నియమ నిబంధనలన్నీ ఇక్కడ పనిచేయవండోయ్.. రైతుల పేరిట రెవెన్యూ రికార్డులలో లేని భూమికి ధరణి పాస్ పుస్తకం, ధరణి పహాని, ధరణి ఈసీ, పాత ఈసీలు ఎక్కడుంటాయి. పైన పేర్కొన్నవి ఏమీ లేకుండానే రిజిస్ట్రేషన్ రోజున రైతుకు పేరున ధరణిలో భూమి వివరాలు ప్రత్యక్షం కావడం , ఎంచక్కా దర్జాగా రిజిస్ట్రేషన్ కావడం జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కొనుగోలుదారుని పేరిట పట్టాగా రికార్డులలో చూపిస్తుండడం అధికారుల పనితనానికి నిదర్శనం. పత్రికలో కథనాలు రావడంతో ధరణిలో పట్టాదారుల పేర్లు కనిపించకుండా పోవడం అధికారులు ఎంత పక్కాగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ధరణి పోర్టల్ అధికారులే మధు మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేతుల్లో ఉండగా మరేం చేస్తారని పలువురు పెదవిరుస్తున్నారు.

రైతులకు తీరని అన్యాయం….
అందరూ కలిసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి రెవిన్యూ రికార్డులలో నమోదు కానిది… కొన్న వారి పేరున ఇప్పుడెలా పట్టా భూమిగా అవుతున్నదనే దానికి సమాధానమే లేదు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డగోలు వ్యవహారానికి ఒడిగట్టారని స్పష్టమవుతున్నది. సుమారుగా ఎకరా 20 కోట్ల భూమిని, 2 కోట్ల 20 లక్షల కే కొనుగోలు చేసి రైతులను నిండా ముంచుతున్నారు. నాకు నువ్వు…. నీకు నేను…. అనే వ్యవహారంతోనే అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అడ్డగోలు వ్యవహారంలో రైతులే సమిధలుగా మిగిలిపోతున్నారు.

కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల ప్రమేయం….
బిలాదాఖలా భూ కుంభకోణంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. అందరూ కలిసే ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఏ అడ్డంకులు లేకుండా పని కానిస్తూ కాసులను పోగేసుకుంటున్నారు. పాస్ పుస్తకం లేనిదే స్లాట్ బుక్ కాని విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు స్థానికంగా మీ సేవ కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్లు తదితర కేంద్రాలలో స్లాట్ బుక్స్ చేసుకుంటారని విషయం సర్వసాధారణమే. అయితే బిలాదాఖలా భూమి అమ్మే విషయంలో మాత్రం స్లాట్ బుకింగ్ నగరంలోని సీసీఎల్ఏ కార్యాలయంలోనే బుక్ అవుతున్నట్టుగా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. భూమి కొనేవారికి ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని పలువురు చర్చించుకుంటున్నారు. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ధరణి పాస్ పుస్తకం, ధరణి పహాని, ధరణి ఈసీ, పాత ఈసీ ఐజిఆర్ఎస్ తదితర వాటిని పరిశీలించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక్కడ మాత్రం అవేమీ లేకుండానే రిజిస్ట్రేషన్ అవుతున్న విషయం ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. రిజిస్ట్రేషన్ రోజున రైతు పేరున భూమి ఉన్నట్లుగా ధరణిలో కనిపించడం అంతకుముందు రైతు పేరున కనిపించకపోవడం రెవెన్యూ అధికారులు ఎంత మాయ చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిబంధన అన్నిటిని ఉట్టిపై కట్టిపెట్టి ఈ వ్యవహారంలో అందరూ తమకు తోచిన విధంగా సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అప్పనంగా వస్తే చూస్తూ ఊరుకుంటారా….
బిలాదాఖల భూ వ్యవహారంలో అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడంతోనే వ్యవహారం నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను రికార్డులలో చేర్చకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా పై స్థాయిలోనే స్లాట్ బుక్ కావడం ఒక ఎత్తు అయితే అన్నిటిని తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ అవుతుండడంతో కొనేవారు కొనక మానుతారా…? అధికారులు పూర్తిస్థాయిలో సహకరించడంతోని ఈ వ్యవహారం గుట్టుగా సాగుతున్నది. రైతులకు అన్యాయం జరుగుతుండగా భూమిని కొనే వారికి మాత్రం భారీ మొత్తంలో లాభం చేకూరుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు