- ఆస్పత్రి సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
- బందీల విడుదలపై హమాస్‌తో చర్చలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుపడుతోంది. ఈ నేపథ్యంలో గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన ఆల్ షిఫాని హమాస్ తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయేల్‌లోకి చొరబడి.. పౌరులను ఊచకోత కోసి హమాస్ మిలిటెంట్లు పలువుర్ని అపహరించారు. వీరిని గాజాలోని అతిపెద్ద హాస్పిటల్ అల్-షిఫాకు తీసుకొచ్చినట్టు ఇజ్రాయేల్ సైన్యం పేర్కొంది. అల్-షిఫాలోని సీసీటీవీ ఫుటేజీని ఆదివారం విడుదల చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని చాలా మంది వ్యక్తులు స్ట్రెచర్‌పై తీసుకొస్తుండగా. కనీసం నలుగురు సాయుధులు పక్కన ఉన్నారు. ఆసుపత్రిని పోలిన భవనంలోకి బలవంతంగా లాగుతుంటే ఓ వ్యక్తి వారితో పెనుగులాడుతుండటం వీడియోల్లో కనిపిస్తోంది. ఇజ్రాయేల్ సైన్యం అధికార ప్రతినిధి డానియల్ హగారీ మీడియాతో మాట్లాడుతూ.. ‘హమాస్ మిలిటెంట్లు బందీగా తీసుకోవడం ఇక్కడ మీరు చూడవచ్చు… వారు అతడ్ని ఆసుపత్రి లోపలికి తీసుకువెళుతున్నారు.. బాధితులు నేపాల్, థాయ్‌లాండ్‌కు చెందినవారు.. వీళ్లు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు..’ అని చెప్పారు. ఫుటేజ్‌పై తేదీ అక్టోబరు 7, 2023గా ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లో హమాస్ ఊచకోత జరిగిన రోజున అల్ షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌ను తీవ్రవాద మౌలిక సదుపాయాలుగా ఉపయోగించుకున్నట్లు ఈ వీడియోలు రుజువు చేస్తున్నాయని ఇజ్రాయేల్ సైనిక నిఘా సర్వీసులు ఓ ప్రకటన వెలువరించాయి. అక్టోబరు 7 నాటి ఘటనకు ప్రతీకారంగా గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయేల్ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకూ ఈ దాడుల్లో దాదాపు 13 వేల మంది చనిపోగా.. వీరిలో అత్యధిక శాతం సాధారణ పౌరులే. మరోవైపు అల్-షిఫా ఆసుపత్రి నుంచి ఆదివారం 290 మంది రోగులను తరలించారు. వారిలో 32 మంది చిన్నారులను ఈజిప్టునకు తరలించగా… వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇదే సమయంలో బందీల విడుదలపై హమాస్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో ఇజ్రాయేల్, అమెరికా, ఖతార్‌లు భాగస్వాములయ్యాయి. కొంత మంది బందీల విడుదలపై ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. బందీలను విడుదల చేస్తే భారీగా మానవతా సాయానికి మార్గాలను ఇజ్రాయేల్ తెరవనుంది.