- ఆరు బృందాలుగా, 5 రైస్
మిల్లులు, ఓ గోదాంలో సోదాలు
మిర్యాలగూడ (ఆదాబ్ హైదరాబాద్) : రైస్ మిల్లులకు ప్రసిద్ధిగాంచిన మిర్యాలగూడ పట్టణంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ ) అధికారులు రెండో రోజు శుక్రవారం పలు మిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ శాఖ పరిధికి చెందిన సుమారు 40 మంది అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి యాదగిరి పల్లి రోడ్డులో ఉన్న సాయి జయలక్ష్మి, ఆర్ ఎస్ వి, సూర్య, వైష్ణవి, సాంబశివ మిల్లుతోపాటు ధాన్యం నిలువలు గోదామును సైతం తనిఖీ చేసినట్లు సమాచారం. సందర్భంగా అధికారులు ప్రధాన గేటును మూసివేసి, మీడియాను అనుమతించకుండా, వివరాలేవీ వెల్లడిరచకుండానే గోప్యత పాటించారు. ఆయా మిల్లులోని ధాన్యం క్రయ,విక్రయాలు, ధాన్యం నిల్వలను రికార్డులను రెండు రోజులపాటు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. ఆయా మిల్లుల ఆదాయం ఆదాయపన్నుల చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అని, బ్యాంకు లావాదేవీలను చూసినట్లు సమాచారం. కొన్ని రికార్డులను స్వాధీనపరచుకొని తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.కాగా గత నెల ఎన్నికల మొదటిసారి మిర్యాలగూడలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. మూడు రోజులకు కొనసాగిన ఆదాడుల్లో పలు మిల్లులతోపాటు, యజమానుల ఇల్లు, ఆఫీసులు, మరో కాంట్రాక్టర్ ఇల్లును సైతం సోదా చేశారు. అయినప్పటికీ అక్రమాలు ఏమైనా జరిగాయా లేదా అనే విషయం వెల్లడి కాకపోవటం విశేషం కాగా ఈ దాడులు రాజకీయ ఆరోపణలకు అస్త్రాలుగా మారాయి. అవి మర్చిపోకముందే తిరిగి రెండోసారి మిర్యాలగూడ రైస్ మిల్లులపై ఐటి అధికారులు దాడులు చేయడంతో రైస్ మిల్లులకు ప్రసిద్ధిగాంచిన మిర్యాలగూడ లో మిల్లు యజమాలతో పాటు, పలు దుకాణాల యజమానులు సైతం ఏ క్షణాన ఐటీ దాడులు జరుగుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఇది ఇలా ఉంటే అసలు ఈ ఐటీ దాడుల్లో మిల్లులలో అక్రమాలు ఏమన్నా జరిగాయా? అంత సక్రమంగానే ఉందా అనే విషయాలు మాత్రం బయటకు రాకపోవడం గమనార్హం.