Friday, May 3, 2024

మహానేత ఇందిరమ్మను తలపిస్తున్న ఇందిరా సింగపురం..

తప్పక చదవండి
  • స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గాన్ని షేక్ చేస్తున్న మహిళా నేత
  • అధికార బీఆర్ఎస్. పార్టీలో గుబులుపుట్టిస్తున్న ప్రజానేత
  • సింగంలా దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా.
  • సోనియా ప్రకటించిన ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..
  • ఆర్తులైన వారికి అభయమిస్తూ.. ప్రచారంలో ముందుకూ
  • కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా..
  • కాంగ్రెస్ పార్టీలో చేరికలను ఆహ్వానిస్తూ..
  • రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..
  • చిరునవ్వుతో.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న మగువ..
  • అవిశ్రాంత ప్రచార పర్వంలో దూసుకుపోతున్న ఇందిరపై ఆదాబ్ ప్రత్యేక కథనం

మహిళానేత అనగానే ప్రత్యర్ధులు కొంత చులకనగా చూస్తారు.. మహిళపై గెలుపు అంటే నల్లేరుపై నడకే అని అనుకుంటారు.. అధికార పార్టీలో ఉంటూ తమకు ఎదురులేదని అనుకుంటారు.. డబ్భు ఇతరత్రా ప్రలోభాలకు గురిచేస్తే గెలుపు తమతే అని భావిస్తారు.. కానీ అలాంటి ఆలోచనలకూ ఫుల్ స్టాప్ పడేలా దూసుకుపోతోంది ఓ మహిళా నాయకురాలు.. మహానేత స్వర్గీయ ఇందిరమ్మ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానేంటో ఈ ప్రపంచానికి తెలిసేలా ప్రచార పర్వంలో దూసుకునిపోతోంది.. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి తన గెలుపు ద్వారా నిరూపించేందుకు సింగంలా దూసుకుని పోతున్నారు స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా సింగపురం.. తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను గడప గడపకు తీసుకుని వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సుసంపన్నమైన తెలంగాణ సాధ్యం అవుతుందని పూసగుచ్చినట్లు వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీని నమ్మి పార్టీలోకి వస్తున్నవారిని సాదరంగా ఆహ్వానిస్తూ.. అభయమిస్తూ.. ఆసరాపై హామీ ఇస్తూ.. భవిష్యత్తుపై ఆశను సజీవంగా నిల్పుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను కూలంకుషంగా వివరిస్తూ.. ప్రచార పర్వంలో దూసుకుని పోతున్నారు ఇందిరా సింగపురం.. ఆమె దూకుడు చూసి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు దూసుకుని పోతున్నాయి.. స్టేషన్ ఘనపూర్ కోటపై కాంగ్రెస్ జెండా రెప రెప లాడేలా చేయడానికి అహర్నిశలు శ్రమ పడుతున్న ఇందిరా ను చూసి.. ప్రత్యర్థి రాజకీయనాయకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.. తమకు ఓటమి తప్పదనే నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు..

వాసు పొలిటికల్ కరస్పాడెంట్ (ఆదాబ్ హైదరాబాద్ ):-

- Advertisement -

చిరునవ్వు ఆ మహిళానేత ఆభరణం.. సేవా తత్పరత ఆమె నరనరాన రక్తంలో ప్రవహిస్తోంది.. అధిష్టానం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించే బాధ్యత కలిగిన నాయకత్వం.. ప్రజలకోసం ఏమి చేస్తే సబబుగా ఉంటుందో ఆలోచించే అద్వితీయ శక్తి.. ప్రత్యర్థుల దిమ్మ దిరిగే సమాధానం ఇవ్వగల ధైర్యం.. దివంగత అమృతయ్య ఆలోచనా విధానాన్ని అణువణువునా పుణికి పుచ్చుకున్న నిజాయితీతో కూడుకున్న రాజకీయం.. సమాజానికి ఏదైనా చెయ్యాలనే తపన తన సొంతం చేసుకున్న ఇందిరా సింగపురం దూకుడు చూసి, ఏమి చెయ్యాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు.. ఆమె చేస్తున్న నిరంతరాయ ప్రచార కార్యక్రమాలు.. చూసి ఈ సారి స్టేషన్ ఘనపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ జెండా రెప రెపలాడటం ఖాయం అనే భావాన్ని వ్యక్త పరుస్తున్నారు విశ్లేషకులు..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాజకీయ స్థితి గతులు :
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరో నెలరోజుల్లో జరుగబోతున్న సార్వత్రిక ఎన్నికల ముఖచిత్రం ఎంతో ఆసక్తికరంగా మారింది.. మరీ ముఖ్యంగా స్టేషన్ ఘనపూర్ లో పరిస్థితులు మరింత ఆసక్తి కరంగా మారిపోయాయి.. స్టేషన్ ఘనపూర్ లో అధికార బీ.ఆర్.ఎస్. పార్టీకి తట్టుకోలేని పోటీ తప్పేటట్లు కనిపిస్తోంది.. స్టేషన్ ఘన్‌పూర్ సెగ్మెంట్‌లో.. అధికార బీఆర్ఎస్‌లో తెలియకుండా ఎదో జరుగుతోంది అన్న అనుమానాలు సర్వత్రా తలెత్తుతున్నాయి.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య పరిస్థితి ఏమిటి..? విపక్షాలకు కాల అనుకూలంగా ఉందా..? అన్న మీమాంస ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా చర్చకు దారి తీస్తోంది.. ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో.. చోటుచేసుకునే రాజకీయ పరిస్థితులు అంతకుమించి రసవత్తరంగా మారుతున్నాయి.. . తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గానికి చెందిన నేతలకే.. డిప్యూటీ సీఎం యోగం దక్కింది. ఒకప్పుడు వాళ్లిద్దరూ రాజకీయ విరోధులు. ఇప్పుడు మాత్రం ఒకే పార్టీకి చెందిన నాయకులు. అయినా సరే.. వైరం ముదిరిందే తప్ప.. ఎక్కడా తగ్గలేదు. దాంతో.. స్టేషన్ ఘన్‌పూర్‌లో అధికార పక్షం వాళ్లదే.. ప్రతిపక్ష పాత్ర వాళ్లదే. ఇలాంటి సెగ్మెంట్‌లో.. అధికార బీఆర్ఎస్‌లో జరుగుతున్న, జరిగిన పరిణామాలు కొంతమేర అధికార పార్టీనే ఇరకాటంలో పెట్టె విధంగా పరిణమించాయని చెప్పవచ్చు..

ఓవరాల్‌గా.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈసారి వెలుగుచూడబోయే ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించారు. వాళ్లిద్దరూ.. ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్లే. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి.. వీళ్లిద్దరూ.. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు.. వేర్వేరు పార్టీల్లో ఉంటూ.. నువ్వా-నేనా అనే స్థాయిలో ఉండేవాళ్లు. ఇప్పుడు.. ఒకే పార్టీలో ఉంటూ.. ఒకే జెండా కింద పనిచేస్తూ.. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు..

ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. మొదట్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం.. తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు మళ్లింది. ఇప్పుడు.. గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. స్టేషన్ ఘన్‌పూర్‌కు ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో ఆరు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం 4 సార్లు విజయం సాధించింది. బీఆర్ఎస్ ఇప్పటివరకు 4 సార్లు గెలుపు జెండా ఎగరేసింది. ప్రస్తుతం.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య.. వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ తరఫున మూడుసార్లు గెలిచారు. ఇక.. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న స్టేషన్ ‌ఘన్‌పూర్‌లో.. ఏడు మండలాలున్నాయి. అవి.. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, ధర్మసాగర్, వేలేరు, జఫర్‌గఢ్. ఈ సెగ్మెంట్‌లో మొత్తం.. 2 లక్షల 34 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. లక్షా 35 వేల మంది దళిత ఓటర్లే ఉన్నారు. ఇందులోనూ.. మాదిక సామాజికవర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. బీసీల ఓట్ బ్యాంక్ 60 వేలకు పైనే ఉంది. ఓసీలు 25 వేల మంది దాకా ఉన్నారు.

ఈ నేపథ్యంలో తమ తమ సామాజిక వర్గాలను నమ్ముకుని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని గెలవాలని చూస్తున్న అధికార, మరో జాతీయ పార్టీ శత్రు పార్టీల నేతలను కేవలం తన వ్యక్తిగత చరిష్మా ద్వారా.. ఎదుర్కోవడానికి బరిలో యుద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ మహిళా అభ్యర్థి ఇందిరా.. భవిష్యత్తులో తమ పార్టీ చేయబోయే బృహత్తర కార్యక్రమాలను మాత్రమే ప్రచారం చేస్తూ.. బీ ఆర్ ఎస్, బీజేపీ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిధంగా మోసం చేస్తున్నాయో.. కూలంకుషంగా వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ.. తెలంగాణ ఇచ్చి తమ కలలను నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుటుంబానికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ.. అది మన కర్తవ్యంగా భావించాలని చాటి చెబుతున్న ఇందిరా గెలుపు నల్లేరుమీద నడక లాంటిదే అని నియోజక వర్గ రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.. నియోజకవర్గ ప్రజలు సైతం ఈసారి ఇందిరకు పట్టం గట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నది అక్షర సత్యం.. స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా సింగపురం ప్రస్తుత రాజకీయ ప్రస్థానంపై మరిన్ని ఆసక్తికర విశేషాలను మరిన్ని కథనాల ద్వారా మీముందుకు తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు