Monday, April 29, 2024

బులియన్‌ మెరుపులు ఇలాగే కొనసాగితే..

తప్పక చదవండి
  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ.70వేలకు చేరుతుందా..?!

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో ప్రస్తుత మెరుపులు ఇలాగే కొనసాగితే కొత్త సంవత్సరం 2024లో తులం బంగారం (24 క్యారెట్స్‌) ధర రూ.70వేల మార్క్‌ను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ మందగమనం, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ తదితర కారణాలతో ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్‌ పెట్టుబడి ఆప్షన్‌గా బంగారం మారుతున్నది. డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.83 వద్ద కొనసాగుతుండగా, ప్రస్తుతం దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో తులం బంగారం ధర రూ.63,060 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 2058 డాలర్లు పలుకుతున్నది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో డిసెంబర్‌ ప్రారంభంలో బంగారం ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లాయి. 2023 పొడవునా ఒడిదొడుకులకు గురైనా గత మే నాలుగో తేదీన దేశీయ మార్కెట్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.61,845, గ్లోబల్‌ మార్కెట్లలో ఔన్స్‌ బంగారం 2083 డాలర్ల ఆల్‌ టైం గరిష్ట స్థాయి రికార్డు నమోదైంది. తిరిగి నవంబర్‌ 16న తులం బంగారం (24 క్యారెట్స్‌) ధర రూ.61,914తో రికార్డు హైకి చేరుకున్నదని కామ్‌ ట్రెండ్జ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌.. పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామంగా మారడంతో డిసెంబర్‌ నాలుగో తేదీన దేశీయంగా తులం బంగారం ధర రూ.64,063, గ్లోబల్‌ మార్కెట్లలో 2140 డాలర్ల ధర పలికింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్లోబల్‌ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 2400 డాలర్లు, రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగితే దేశీయ బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర రూ.70 వేల మార్క్‌కు చేరుతుందని జ్ఞానశేఖర్‌ అంచనా వేశారు. 2024 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్స్‌ కొనుగోళ్లు తగ్గినా, బంగారం ధరలకు రెక్కలొస్తాయని జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ చెప్పారు.
ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యువెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) చైర్మన్‌ సాయమ్‌ మెహ్రా మాట్లాడుతూ 2022లో దేశంలో 30-35 లక్షల పెండ్లిండ్లు జరిగినా.. బంగారం ధరల్లో ఒడిదొడుకుల ప్రభావం ఆభరణాల కొనుగోలుపై పడలేదన్నారు. అమెరికా ఫెడ్‌ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతోపాటు అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగినా బంగారం ధరలు మరింత పైపైకి దూసుకెళ్తాయని తేల్చి చెప్పారు. 2024లో గ్లోబల్‌ మార్కెట్లలో ఔన్స్‌ బంగారం ధర 2250-2300 డాలర్లు, దేశీయంగా రూ.68 వేల నుంచి 70 వేల మధ్య తచ్చాడుతుందన్నారు. ధరలు పెరిగితే మాత్రం వచ్చే ఏడాది సేల్స్‌ మీద ప్రభావం చూపవచ్చునని పేర్కొన్నారు.
వివిధ కారణాల రీత్యా బంగారం ధరలు ఈ ఏడాది చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ రీజినల్‌ సీఈఓ సోమసుందరం పీఆర్‌ చెప్పారు. ఒడిదొడుకులతోపాటు ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గింపునకు బంగారం సురక్షిత పెట్టుబడి మార్గంగా కొనసాగుతుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు