Friday, May 3, 2024

బీహార్‌లో సెలవుల రగడ

తప్పక చదవండి
  • హిందూ పండగలకు సెలవుల్లో కోత
  • నితీశ్‌ ప్రభుత్వ తీరుపై బిజెపి ఆగ్రహం

పాట్నా : బిహార్‌ ప్రభుత్వం సెలవుల కుదింపు, మరీ ముఖ్యంగా హిందూ పండగలకు సెలవుల రద్దుపై తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. విద్యాశాఖ సోమవారం 2024 సెలవు జాబితా ను విడుదల చేసింది. ఇందులో ప్రధాన హిందూ పండుగలకు సెలవులను రద్దు చేయగా, పలు పండుగలకు సెలవుల సంఖ్యను తగ్గించింది. శివరాత్రి, శ్రీరామనవమి, శ్రావణ చివరి సోమవారం, తీజ్‌, జన్మాష్టమి, అనంత్‌ చతుర్దశి, భాయ్‌ దూజ్‌, గోవర్ధన్‌ పూజ, గురునానక్‌ జయంతి, కార్తీక పూర్ణిమ పండుగలకు సెలవులు రద్దు అయ్యాయి. అలాగే హోలీ, దుర్గాపూజ, దీపావళి, ఛత్‌ పండుగలకు సెలవులు తగ్గించారు. ముహర్రం, బక్రీద్‌, ఈద్‌ సెలవులను పొడిగించారు. అదే సమయంలో, గురుగోవింద్‌ సింగ్‌ జయంతి, రవిదాస్‌ జయంతి, అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. హోలీ సెలవులను మూడు రోజుల నుంచి రెండు రోజులకు, దుర్గాపూజ సెలవులను ఆరు నుంచి మూడు రోజులకు, దీపావళి, ఛత్‌ సెలవులను ఎనిమిది నుంచి నాలుగు రోజులకు తగ్గించారు. అదే సమయంలో, ఈద్‌ సెలవులను రెండు నుంచి మూడు రోజులకు, బక్రీద్‌ను రెండు నుంచి మూడు రోజులకు, ముహర్రం సెలవులను ఒక రోజు నుంచి రెండు రోజులకు పెంచారు. అయితే బీహార్‌ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్‌ యాదవ్‌ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీయడంలో ఎప్పుడూ ముందుంటుందని విమర్శించారు. బీహార్‌లోని హిందువులు తమ మతపరమైన పండుగలను కూడా జరుపుకూడదా అంటూ నేతలు ప్రశ్నించారు. శివరాత్రి, రామనవమి, శ్రావణ చివరి సోమవారం, తీజ్‌, జన్మాష్టమి, అనంత్‌ చతుర్దశి, భాయ్‌ దూజ్‌, గోవర్ధన్‌ పూజ, గురునానక్‌ జయంతి, కార్తీక పూర్ణిమ సెలవు రద్దు చేయడం హిందువుల అణచివేతకు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతే కాకుండా దీపావళి, దుర్గాపూజ, అతిపెద్ద పండుగ అయిన ఛత్‌కు సెలవులు తగ్గించడం దురదృష్టకరం అన్నారు. ప్రజలే ఈ నేతలకు తగిన సమాధానం చెబుతారని విమర్శించారు. 2023, 2024లో మొత్తం సెలవుల సంఖ్య 60 రోజులుగానే ఉంచారు. అదే సమయంలో, వేసవి సెలవులను 20 నుంచి 30 రోజులకు పెంచారు. వేసవి సెలవులు ఏప్రిల్‌ 15 నుంచి మే 15 వరకు ఉంటాయి. 2023లో వేసవి సెలవులు జూన్‌ 5 నుంచి 27 వరకు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా వేసవి సెలవుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. మే మధ్య నుంచి జూన్‌ మధ్య వరకు ఎండ వేడిమి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఏప్రిల్‌మే మధ్యలో సెలవులు సరికాదనే వాదన వినిపిస్తోంది. విద్యా శాఖ, విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 220 రోజుల బోధన తప్పనిసరి. ఉపాధ్యాయులను రాష్ట్ర ఉద్యోగులుగా ప్రకటించే పక్రియ కొనసాగుతోందని డైరెక్టర్‌ తెలిపారు. వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సెలవులు వర్తిస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని, మైనారిటీఎయిడెడ్‌ పాఠశాలలు, మక్తాబ్‌లు మొదలైన వాటికి సెలవులు వర్తిస్తాయి. 2024లో వేసవి సెలవులు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ క్యాలెండర్‌ ప్రకారం పాఠశాలకు వచ్చి ఇతర విద్యా, పరిపాలన, కార్యాలయ పనులను నిర్వహిస్తారు. ఈ సమయంలో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశాలు జరుగుతాయి. గురువారం పాఠశాలల్లో రోజంతా కార్యక్రమాలు ఉంటాయని సెకండరీ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. భోజన విరామం వరకు బోధన కొనసాగుతుంది. అనంతరం తల్లిదండ్రులు, విద్యార్థులతో పార్లమెంట్‌ నిర్వహిస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు