Friday, May 3, 2024

ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద

తప్పక చదవండి
  • కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి స్థాయి..
  • నిజాంసాగర్‌లో భారీగా వరదనీరు..
  • గోదావరిలో సైతం పెరుగుతున్న నీటిమట్టం..
  • సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
  • వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ హెచ్చరిక

వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ఇక స్వర్ణ ప్రాజెక్టుకు 890 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 1164 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1189 అడుగులుగా ఉంది. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1500 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1388.32 అడుగుల వద్ద ఉన్నది. నిజామాబాద్‌ జిల్లా మాధవ్‌నగర్‌లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో నిజామాబాద్‌, డిచ్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వాహనాలను బైపాస్‌ రోడ్డు విూదుగా మళ్లిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో ప్రస్తుతం 8.25 విూటర్ల ఎత్తులో నది పరుగులు పెడుతున్నది. ఛత్తీస్‌గఢ్‌లో వర్షాల వల్ల ములుగు జిల్లాలోని పాలెం వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో 21 గేట్లు ఎత్తి 49,244 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరి నదిలోకి విడుదల చేశారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 26.7 అడుగుల వద్ద ప్రవహిస్తున్నది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతున్నది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 2847 క్యూసెక్కుల వరద వస్తుండగా, 405 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తి నీటిసామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 18.640 టీఎంసీలకు చేరుకున్నది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌ కాస్ట్‌ కేటీకే 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. దీంతో సింగరేణి కాలరీస్‌కు రూ.1.72 కోట్లు నష్టం వాటిళ్లింది. భారీ వర్షాల నేపథ్యంలో 1.63 లక్షల క్యూబిక్‌ విూటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలతో ముప్పు పొంచి ఉందని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, దుర్బలమైన కాజ్‌వేలు, వంతెనలను ఇప్పటికే గుర్తించినట్టు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసినట్టు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు