Friday, May 17, 2024

కాంగ్రెస్‌ లంచ్‌ విూటింగ్‌..

తప్పక చదవండి
  • కోమటిరెడ్డి ఇంట్లో హాజరైన రేవంత్‌, జానా, పొన్నాల తదితరులు..
  • ఆగస్ట్‌ నుంచి ప్రజల్లోకి వెళతామన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి..
  • విభేదాలు పక్కన పెట్టి కలసి నడుస్తామని ప్రకటన..

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ద్వారా 26 పార్టీలు కలిసి ఏకతాటిపైకి వచ్చాయని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఓబీసీ జనగణన చేపట్టాలని రాహూల్‌ గాంధీ ఇప్పటికే చెప్పారన్నారు. బెంగుళూరులో జరిగిన విపక్ష పార్టీల సమావేశంలోను ఓబీసీ జనగణనపై చర్చ జరిగిందని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇంటికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారని.. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై అందరం కలిసి చర్చిస్తామమని అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… విపక్షాలకు పోటీగా మోదీ ఎన్‌.డి.ఏ సమావేశాన్ని నిర్వహించారని అన్నారు. రాఫెల్‌ ఒప్పందంలో ఎంత డబ్బు పెట్టి కొనుగోలు చేశారో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోదీ చెప్పిన మేకిన్‌ ఇన్‌ ఇండియా ఏమైందని ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలన్నారు. మోదీ పాలనలో ప్రోగ్రెస్‌ ఎక్కడ ఉందో చెప్పాలని అడిగారు. కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఫిరాయింపుల ద్వారా తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ కూల్చారంటూ పొన్నల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో బుధవారం కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ… ఆగస్ట్‌ నుంచి ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. నేతలమంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామన్నారు. వచ్చే ఐదు మాసాలు కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఎంపీ కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల లంచ్‌ విూట్‌ నేపథ్యంలో నేతలంతా ఒక్కొక్కరుగా ఎంపీ నివాసానికి చేరుకున్నారు. జానారెడ్డి , పొన్నాల లక్ష్మయ్య కోమటిరెడ్డి నివాసానికి చేరుకోగా.. కాసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంపత్‌ కుమార్‌ . కోమటిరెడ్డి ఇంటికి వచ్చారు. వీరికి శాలువా కప్పి వెంకట్‌రెడ్డి స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ కీలక నేతల సమావేశంలో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ 2.0 పై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా టీపీసీసీ ప్లాన్‌ చేస్తోంది. నేటి సమావేశంలో చేరికలపైనే నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. రేపు ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరనున్నారు. గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్య, ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌ రెడ్డి తదితరులు ఢిల్లీ లో కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో కాంగ్రెస్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, వికారాబాద్‌ జెడ్పీ చైర్పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్‌ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ తదితర నేతలతో చర్చలు జరుగుతుండగా.. త్వరలో వీరంతా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌పై తన సవాలును ఎందుకు స్వీకరించలేదో మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. లాగు బుక్కుతో 24 గంటల కరెంటుపై ప్రభుత్వ బండారం బయటపెట్టానని తెలిపారు. దాంతో ప్రభుత్వం భయపడి ఇప్పుడు విద్యుత్‌ సరఫరాను పెంచిందని చెప్పుకొచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు