Thursday, May 2, 2024

నిర్బంధించి.. వీడియోలు తీసి..

తప్పక చదవండి
  • విదేశీయుల్నీ వదలని హమాస్‌..
  • భీభత్సం సృష్టిస్తూ నానా అవస్థలు పెడుతున్న దుర్మార్గం..
  • చిత్రహింసల వీడియోలను సోషియల్ మీడియాలో
    పెడుతూ రాక్షసానందం..
  • 18 వేల మందికి పైగా ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులు..

ఇజ్రాయిల్: ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ప్రవేశించిన వందలాది మంది హమాస్‌ మిలిటెంట్లను హతమార్చేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇజ్రాయెల్‌ పట్టణాల్లో తుపాకులతో బీభత్సం సృష్టిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు ఆ దేశ ప్రజలతో పాటు విదేశీయుల్నీ వదలం లేదు. వారిని బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు. బందీలుగా పట్టుబడిన వారిలో థాయ్‌లాండ్‌, నేపాల్‌కు చెందిన వారు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు భారత్‌ నుంచి జెరూసలెం పర్యటనకు వెళ్లిన రాజ్యసభ ఎంపీ వాన్‌వేయ్‌రాయ్‌ ఖార్లుఖీ సహా 24 మంది బెత్లహమ్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వారంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

థాయ్‌లాండ్‌కు చెందిన 11 మందిని హమాస్‌ మిలిటెంట్లు బంధించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. వారిని గాజాకు తరలించినట్లుగా పేర్కొంది. వాళ్లంతా అమాయక ప్రజలని, అక్కడి పరిణామాలతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని థాయ్‌లాండ్‌ ప్రధాని శ్రత్థా థవిసిన్‌ పేర్కొన్నారు. బ్యాంకాక్‌ పోస్టు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన దాదాపు 5000 మంది ప్రజలు ఉన్నారు. వీళ్లంతా అక్కడ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. శనివారం జరిగిన దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తమ దేశీయులను బందీలుగా చేసినట్లు చెబుతున్న ఓ ఫొటోను థాయ్‌లాండ్‌ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. అందులో బందీలను ఒకచోట కూర్చోబెట్టి.. సాయుధులైన మిలిటెంట్లు వాళ్లకు కాపలా ఉన్నట్లు కనిపిస్తోంది.

- Advertisement -

ఇజ్రాయెల్‌లో ఉంటున్న కొందరు బ్రిటన్‌ పౌరుల ఆచూకీ గురించి బ్రిటన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్‌-ఇజ్రాయిలీ పౌరుడైన జేక్‌ మార్లో కనిపించడం లేదని పేర్కొంది. రెండేళ్ల క్రితం బ్రిటన్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళ్లిన జేక్‌ మార్లో అక్కడ భద్రత అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి అతడు కనిపించడం లేదని బ్రిటన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు యూకేలోని ఇజ్రాయెల్‌ రాయబారి హోటోవ్యాలీ మీడియాతో మాట్లాడుతూ.. జేక్‌ మార్లోను హమాస్‌ మిలిటెంట్లు అపహరించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువుల కోసం ఇజ్రాయెల్‌ వెళ్లిన నేపాల్‌ విద్యార్థుల భవిష్యత్‌ ఆందోళనకరంగా మారింది. 17 మంది నేపాల్‌ విద్యార్థులను హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయెల్‌లో నేపాల్‌ రాయబారి కాంతా రిజల్‌ వెల్లడించారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాధితులంతా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ (చదువుకుంటూ సంపాదించడం) కార్యక్రమం ద్వారా అక్కడికి వెళ్లారు. బందీలుగా పట్టుబడిన వారిలో ఓ వ్యవసాయ క్షేతంలో పని చేస్తున్న 10 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య భీకర పోరు సాగుతున్న వేళ భారత్‌ రాజ్యసభ ఎంపీ వాన్‌వేయ్‌రాయ్‌ ఖార్లుఖీ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు. మేఘాలయ నుంచి నేషనల్ పీపుల్స్‌ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లారు. హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు దాడి చేయడంతో బెత్లహమ్‌లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ కుటుంబంతోపాటు మరో 24 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీళ్ల పరిస్థితి గురించి మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్‌పీపీ అధ్యక్షుడు కార్నాడ్‌ సంగ్మా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని భారత్‌ దౌత్యకార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంపీ కూడా విదేశాంగశాఖ అధికారులతో టచ్‌లో ఉన్నారని సంగ్మా తెలిపారు. వాళ్లందర్నీ ఈజిప్ట్‌ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. వారిలో ఎక్కువ మంది సంరక్షకులుగా పని చేస్తుండగా..ఐటీ ఉద్యోగులు, ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు కూడా ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కోరాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యాలయాలతో టచ్‌లో ఉండాలని సూచించాయి. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని సూచించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు