Wednesday, April 17, 2024

సూర్యాపేటలో ఈవీఎంలు భద్రపరచిన చోట ఐటీ హబ్ ఏర్పాటు దేనికి సంకేతం..

తప్పక చదవండి
 • మార్కెట్ గోడౌన్ లో ఉన్న ఈవీఎంలను పాత కలెక్టరేట్
  భవనంలోకి మార్చడంలో మతలబు ఏంటి.?
 • ఆ బిల్డింగ్ లోకి ఐటి హబ్ వస్తుందని, ముందస్తుగా మంత్రికి, కలెక్టర్ కి తెలియదా.?
 • బహిరంగంగా కనిపిస్తున్న ఈ.వీ.ఎం. ల స్టోరేజ్ రూమ్ కు వెళ్లే దారి..
 • జిల్లా ఎన్నికల అధికారి తీరుపై, ముక్కు మీద వేలు వేసుకుంటున్న ప్రజానీకం..
 • పక్కా ప్రణాళికతో ఈ.వి.ఎం. ల తరలింపు జరిగిందా..?
 • అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇప్పటికే
  జిల్లా కలెక్టర్, ఎస్పీ లపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు..
 • ప్రయివేట్ భవనంలో ఉన్న ఈవీఎంలను ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
  : బీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వర రావు..
 • ఈవీఎంలు టాంపరింగ్ కి గురయ్యే అవకాశముంది :
  అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి..

ఓటు అనేది అంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయంలో అందరికీ తెలుసు.. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది.. ఓటర్లు వేసిన ఓట్లను పదిలంగా భద్రపరచి, అన్ని పార్టీల నాయకుల, అధికారుల సమక్షంలో లెక్కించి గెలిచిన వారిని ప్రకటించడం జరుగుతుంది.. అప్పట్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించేవాళ్ళు.. అయితే బ్యాలెట్ పత్రాల ముద్రణ, నిర్వహణ క్లిష్టతరంగా ఉండటంతో టెక్నాలజీని వినియోగించి, ఈవీఎం మిషన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చారు.. తద్వారా పోలింగ్ ప్రక్రియ సులభతరంగా మారింది.. అయితే ఈవీఎంల నిర్వహణపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.. ఈవీఎం మిషన్లను టాంపరింగ్ చేసే అవకాశం ఉందని పలువురు ఆరోపణలు చేశారు.. అయితే అలాటిది ఏమీ జరగదని అధికారులు పలు సందర్భాల్లో చెప్పడం, మీడియా సాక్షిగా నిరూపించడం లాంటివి జరిగాయి.. ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రజలు వేసిన ఓట్లను అతి భద్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నది వాస్తవం.. అసలే టాంపరింగ్ లాంటి విమర్శలు ఎదురవుతున్న క్రమంలో సూర్యాపేటలో ఈవీఎం మిషన్లు భద్రపరచిన చోట ఐటీ హబ్ ఏర్పాటుచేయడం పలు విమర్శలకు దారి తీస్తోంది.. దీని వెనుక ఎదో కుట్ర కోణం దాగుందని ప్రజలతో బాటు, పలు రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. అసలు కథా కమామీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఈవీఎం లను కేటాయిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉన్న గోదాం లేదా స్టోరేజ్ రూములలో ఈవిఎం మిషన్ లను భద్రపరచాల్సి ఉంటుంది. కానీ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఉన్న ఈవీఎం మిషన్లను ప్రైవేటు బిల్డింగ్ (పాత కలెక్టరేట్) లోకి మార్చారు. ఈవీఎం మిషన్ లు మార్చిన ప్రైవేటు బిల్డింగ్ లో నూతనంగా ఐటి హబ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఐటీ హబ్ ను రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ఈనెల రెండవ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే..

- Advertisement -

ఈ.వి.ఎం. మిషన్ లు మార్చడం వెనక మర్మమేంటి.?
జిల్లాకు కొత్త కలెక్టరేట్ బిల్లింగ్ భవన నిర్మాణంతో పాటు ఆ పక్కనే ఈవీఎం మిషన్ లు భద్రపరిచేందుకు (స్ట్రాంగ్ రూమ్) బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. గతంలో (స్ట్రాంగ్ రూమ్) లో ఉన్న ఈవీఎం మిషన్లను పట్టణ నడిబొడ్డున ఉన్న కొత్త వ్యవసాయ మార్కెట్ లోని గోదాంలో భద్రపరిచారు. అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయించి, ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కూడా ఆ చుట్టుపక్కల రాకుండా తగు జాగ్రత్తలతో పాటు, సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. పాత జిల్లా కలెక్టరేట్ భవనంలో సమావేశ మందిరంతో పాటు ఆ పక్కనే ఉన్న మరికొన్ని శాఖల కార్యాలయాలను ఖాళీ చేయించి, అందులో ఈవిఎం మిషన్లను భద్రపరిచారు. ప్రైవేటు వ్యక్తులు తిరిగే ప్రాంతాల్లో ఈ.వి.ఎం. లను ఉంచకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, కలెక్టరేట్ కు ప్రతిరోజు వందల సంఖ్యలో సామాన్య ప్రజానీకం వస్తూ ఉంటారు. అలాంటి స్థలంలో ఈవీఎం మిషన్ లను ఉంచడం ఎంత వరకు భద్రత అనే భావన ప్రజలలో కలుగుతోంది..

జిల్లాలో అసలేం జరుగుతోంది..?
ఈ.వి.ఎం. మిషన్ లను పాత కలెక్టరేట్ భవనంలో పెట్టిన కొన్ని రోజుల తర్వాత, చివ్వెంల మండల పరిధిలోని కుడ కుడ శివారులో నిర్మించిన కొత్త భవనంలోకి కలెక్టరేట్ ను అధికారులు మార్చారు. గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్ భవనంలో ఐటి హబ్ పేరుతో సర్వహంగులుగా మార్చి, ఈవీఎంలను భద్రపరచిన ప్రైవేటు భవనంలోనే కొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు రావడం పట్ల జిల్లా ప్రజలతోపాటు, పలు రాజకీయ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలో నేడు రేపు అన్నట్లు ఎన్నికలకు నిర్వహించేందుకు సమాయత్తమవుతుంటే, జిల్లా అధికారుల ఐటీ హబ్ ను ఆ భవనంలోనే ఏర్పాటు చేయడం వెనకాల ఆంతర్యం ఏమిటి.? స్థానిక శాసనసభ్యులు, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అనుకూలంగానే పనులు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులు ఎవరైనా జిల్లా ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ, ఆ జిల్లాలో పేదరికం నిర్మూలన ధ్యేయంగా పనిచేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సహకారాలు అందిస్తూ.. జిల్లాను ముండుచుతారు. కానీ సూర్యాపేట జిల్లాలో మాత్రం అధికార పార్టీలో ఉన్న నాయకులకు భజనలు చేస్తూ, ప్రజలతో జేజేలు కొట్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు..

సంకినేని వెంకటేశ్వరావు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు :
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మార్కెట్ గోదాం నుంచి, పాత కలెక్టరేట్ భవనంలోకి ఈవీఎం లు మార్చి, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి రెంట్ పరంగా లబ్ధి చేకూరించేందుకు జిల్లా అధికారులు పాటు పడుతున్నారు. అనునిత్యం వందల మంది ప్రైవేట్ వ్యక్తులు తిరిగే స్థలం, ఐటి హబ్ లో ఉంచడం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులు స్పందించి, ప్రైవేట్ బిల్డింగ్ లో ఉన్న ఈవీఎంలను ప్రభుత్వ భవనంలోకి మార్చాలని డిమాండ్ చేశారు.

పటేల్ రమేష్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి :
ఈవీఎంలు ప్రైవేటు వ్యక్తులు తిరిగే ప్రాంతంలో ఉంచడం, అక్కడే ఐటీ హబ్ ఏర్పాటు.ఆ ప్రాంతంలో అవి ఉంటే ట్యాంపరింగ్ కు గురయ్యే అవకాశం ఉంది. వెంటనే వాటికి ప్రభుత్వానికి సంబంధించిన భవనంలోకి మార్చాలి.అలాగే అధికార పార్టీకి కార్యకర్తలు లాగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నా..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు