Monday, April 29, 2024

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..

తప్పక చదవండి
  • త్వరలో తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70.66 డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. అయితే, పెట్రోల్‌ కంపెనీ ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. రాబోయే రోజుల్లో చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.10 వరకు తగ్గించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ పెట్రోలియం కంపెనీల లాభాలు భారీగానే పెరిగాయి.
లోక్‌సభ ఎన్నికల నాటికి..
దాంతో చమురు కంపెనీలు లాభాల్లో కొంత భాగంతో సామాన్యులకు ఊరట కలిగించే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీనిపై స్పష్టత రావాల్సి ఉన్నది. మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. నిజంగా జరిగితే సామాన్యులకు నిజంగా ఊరట లభించినట్లే. ఇటీవలి కాలంలో ప్రభుత్వ చమురు కంపెనీల నికర లాభం రికార్డు స్థాయిలో రూ.75వేలకోట్లు దాటిందని అంచనా. కంపెనీలు లీటరుకు రూ.10 వరకు లాభాన్ని ఆర్జిస్తున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొంత వరకు ధరలను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఫిబ్రవరి ప్రారంభం నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.5 నుంచి 10 వరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారీ లాభాల్లో కంపెనీలు.. గత కొద్ది నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌లు ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ నుంచి పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు జరుగలేదు. గత డిసెంబర్‌లో ధరలను తగ్గిస్తారని వార్తలు వచ్చినా.. అమలుకు నోచుకోలేకపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశంలోని మూడు పెద్ద చమురు మార్కెటింగ్‌ కంపెనీలు భారీ లాభాలనే ఆర్జించాయి. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.5826.96 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కాగా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.8244 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ముడి చమురు ధరలు తగ్గడం, స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (GRవీ) పెరగడంతో లాభాల్లో భారీగా పెరుగుదల ఉన్నట్లు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా తగ్గుతున్న నేపథ్యంలో మరి సామాన్యులకు కొంత వరకైనా ఊరట కల్పిస్తాయా? లేదా? మరికొద్దిరోజుల్లో తేలనున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.83, డీజిల్‌ రూ.98 వరకు ఉన్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు