Friday, May 3, 2024

నిస్సిగ్గును ఆభరణంగా మార్చుకున్న జీహెచ్‌ఎంసి

తప్పక చదవండి
  • టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో రాజ్యమేలుతున్న అవినీతి
  • చీప్‌ బుద్దులు ప్రదర్శిస్తున్న చీఫ్‌ సిటీ ప్లానింగ్‌ అధికారి
  • ఆధారాలతో ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
  • మీది కుంట చెరువు కబ్జాలో భారీగా చేతులు మారిన పైకం..
  • నకిలీ పత్రాల సృష్టి.. లేని నెంబర్లు చూపుతూ అక్రమ రిజిస్ట్రేషన్‌
  • ఇంత జరుగుతున్న అధికారుల దృష్టికి రాలేదా అన్నది అనుమానాస్పదమే..
  • ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న పలువురు..

ఫిర్యాదులంటే వారికి లెక్కేలేదు.. లంచాలు ఇస్తే చాలు.. నకిలీ పత్రాలున్నా అనుమతులు ఇచ్చేస్తారు.. భావితరాలకు అంధకారం అలుముకుంటుంది అని తెలిసినా అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్న జీహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ విభాగం చరిత్ర ఛీ ఛీ అనేలా తయారయ్యింది.. పత్రికా ప్రతినిధులు, మీడియా వారు వెలుగులోకి తెచ్చే పూర్తి ఆధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకుండా ఫిర్యాదును అడ్డుపెట్టుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతుండటం జీహెచ్‌ఎంసి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది..

రంగారెడ్డి జిల్లాలోని, శేరిలింగంపల్లి మండల పరిధిలోని, హఫీజ్‌ పేట శివారులో సర్వే నెం.54 లో మాతృశ్రీ కో అపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ ఉంది. ఈ సొసైటీకి ఆనుకుని ఉన్న భూమిని కబ్జా చేయుటకు, ఫోర్జరీ సంతకంతో నకిలీపత్రం తయారు చేశారు ప్రేమ్‌ కన్స్‌ ట్రక్షన్స్‌ యాజమాన్యం.. ఈ వ్యవహారం పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.. మాతృశ్రీ కో అపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ నుండి ప్లాట్‌ నెం 763ని కొనుగోలు చేసి, ఆ డాక్యుమెంట్‌ ఆధారంగా 763/1,763/2, 763/3,763/4,763/5,763/6,763/బి అనే బై నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించారు. అనుమతి పొందిన లే ఔట్‌లో లేని ప్లాట్‌ నెంబర్లు వేసి, వక్రమార్గంలో అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న ప్రేమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని ప్రేమ కుమార్‌ అక్రమాల బాగోతం బట్ట బయలు అయ్యింది.

- Advertisement -

ఇతగాడు ఏకంగా రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ తిరుపతి రావు సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రం తయారు చేయడం జరిగింది. ప్రేమ కుమార్‌ తయారు చేసిన నకిలీ పత్రాన్ని జతపరుస్తూ ‘ఆదాబ్‌’ ప్రతినిధి ఆధారాలతో సహా శేరిలింగంపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత శేరిలింగంపల్లికి సంబంధించిన అప్పటి డిప్యూటీ కలెక్టర్‌ అండ్‌ తహశీల్దార్‌ వంశీ మోహన్‌, ప్రేమ్‌ కన్స్‌ ట్రక్షన్స్‌ యజమాని ప్రేమ కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా, నకిలీ పత్రం తయారు చేసాడని నిర్ధారణ అయిన విషయం తన దృష్టికి వచ్చినా (ఈ విషయాన్ని సహ చట్టం ద్వారా సదరు వంశీ మోహన్‌ తెలియజేయడం ఇక్కడ గమనించదగిన విషయం) ఇంత తెలిసినా, అడిషనల్‌ కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడని తెలిసినా, తహశీల్దార్‌ అవినీతి, అక్రమాలే ధ్యేయంగా.. ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. అక్రమార్కులకు వత్తాసు పలకడం దౌర్భాగ్యం.. ప్రేమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాన్యంతో లోపాయకారి ఒప్పందం చేసుకొన్న తహశీల్దార్‌ వంశీ మోహన్‌, రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌కు ‘ఆదాబ్‌’ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదును పంపి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పిర్యాదుతో పాటు ఆధారాలు సమర్పించకుండా.. తన నీచ బుద్దిని ప్రదర్శించాడు.. తహశీల్దార్‌ ఆగడాలను పసి గట్టిన ‘ఆదాబ్‌’ ప్రతినిధి వాస్తవాలను అడిషనల్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ తన సంతకం ఫోర్జరీ చేసి, నకిలీ పత్రం తయారు చేసింది వాస్తవమేనని తెలిపారు. నకిలీ పత్రం తయారు చేసిన ప్రేమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని ప్రేమ కుమార్‌ పై.. క్రిమినల్‌ కేసు నమోదు చేయుటకు ఆదేశాలు కూడా జారీ చేశారు. తప్పని పరిస్థితులలో అడిషనల్‌ కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం, శేర్లింగంపల్లిలోని పోలీస్‌ స్టేషన్‌ కు నాటి తాసిల్దార్‌ వంశీ మోహన్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంత బరితెగించి ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిర్మాణ సంస్థకు అనుమతులను రద్దు చేయకుండా.. జీహెచ్‌ఎంసి. అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని.. తప్పిదాలు బయటపడకుండా ప్లాన్‌ చేసి.. వేగంగా నిర్మాణం పూర్తయ్యే విధంగా వారికి సహకరించడం అత్యంత హేయమైన చర్య.. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రేమ్‌ కన్స్‌ట్రక్షన్స్‌ యజమానికి వత్తాసు పలుకుతూ.. విధి నిర్వహణలో చట్టవ్యతిరేకమైన కార్యకలపాలకు పాల్పడి, అక్రమాలపై చర్యలు తీసుకోకుండా, నకిలీ పత్రాన్ని అసలు పత్రంగా తయారు చేసిన.. నిర్మాణ సంస్థపై, అదే విధంగా చెరువును రక్షించవలసిన అధికారులే స్వార్థ ప్రయోజనాలకు అమ్ముడుపోయి, చెరువు స్థలాన్ని కబ్జా చేయుటకు సహకరించిన నీటిపారుదల శాఖ అధికారులపై, అదే విధంగా చెరువు స్థలంలో నిర్మాణం చేస్తున్నారని, నిర్మాణ సంస్థ జిహెచ్‌ఎంసి అధికారులకు దాఖలు చేసిన డాక్యుమెంట్స్‌ తప్పుడు డాక్యుమెంట్స్‌ అని పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా, బాధ్యతను మరచి, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోనే జిహెచ్‌ఎంసిలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నత స్థాయిలో ఉండి అనుమతులు ఇచ్చిన జిహెచ్‌ఎంసి చీఫ్‌ సిటీ ప్లానర్‌ రాజేంద్రప్రసాద్‌ నాయక్‌ పై, జిహెచ్‌ఎంసి కమిషనర్‌, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? లేదా..? అన్నది. వేచి చూడాల్సి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటి చేయనున్న ప్రేమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని ప్రేమ కుమార్‌ భూ కబ్జాల భాగోతంపై పూర్తి అధారాలతో వరుస కథనాలు మీ ముందుకు తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు