Friday, July 26, 2024

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తప్పక చదవండి
  • అర్థరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం
  • నిత్య కైంకర్యాల తరవాత దర్శనాలకు అనుమతి
  • ఉత్తరద్వారా దర్శనంతో పులకించిన భక్తజనం

తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకవజాము నుంచి తెరుచుకున్న వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమలలో ఏడు కొండలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. విఐపీలు, సామాన్యులు అంతా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పరవశించిపోయారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానిక పక్కనే ఉన్న వైకుంఠ ద్వారం తెరిచారు.ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టిటిడి అధికారులు అనుమతించారు. ఈ సందర్భంగా టిటిడి పాలక మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినంను తిరుమలలో ఘనం నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులంతా చాలా సంతృప్తితో వైకుంఠ ద్వరం గుండా స్వామి వారిని దర్శించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించడంలో టిటిడి సఫలం అయ్యిందన్నారు. టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం 1:40 గంటలకు ప్రారంభమైందన్నారు. మొత్తం 4వేల విఐపి టోకెన్లు జారీ చేయగా 3,850 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయినట్టు వెల్లడిరచారు. వేకువజామున 1:40కి ప్రారంభంమైన విఐపి బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5:15కి ముగిసిందన్నారు. ఎస్‌ఎస్డి, ఎస్‌ఈడి స్లాట్స్‌ను ఉదయం 6 గంటలకు ఇచ్చామని ధర్మారెడ్డి తెలిపారు. 45 నిమిషాల ముందే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించామని వివరించారు. ప్రతి స్లాట్‌ కూడా గంటన్నర ముందుగా తీసుకుని వైకుంఠంలో కూర్చోబెట్టి, భక్తులకు దర్శనం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఒక వేళ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో వేచి ఉండే పరిస్ధితి వస్తే, గంటా, రెండు గంటల కంటే ఎక్కువ సేపు వేచి ఉండే పని ఉండదని, భక్తులందరికి ఆహార పదార్థాలు, కాఫీ, టీ,పాలు అందిస్తున్నామని ఈవో వెల్లడిరచారు. తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ పక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశామన్నారు. ఎస్‌ఎస్డి, ఎస్‌ఈడి టోకెన్లు కలిపి ప్రతి రోజు స్వామి వారి కైంకర్యాలు బట్టీ రోజుకి 70 నుంచి 75 వేల మందికి దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజుల్లో ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు..తిరుమలలో శుక్రవారం అర్థరాత్రి 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకుంది. శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రావణవాహన సేవలో భక్తులకు స్వామివారు, అమ్మవారు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

విఐపిల సందడి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు బారులు తీరారు. తెల్లవారుజామున 1:40 గంటల నుంచి 5:15 గంటల వరకు ప్రముఖులను శ్రీవారిని దర్శించు కునేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది. ఉదయం 5:15 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. తెల్లవారుజామునే శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. వారిలో సుప్రీంకోర్టు మాజీ సీజె ఎన్వీ రమణ దంపతులు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, హిమా కోహ్లీ, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌ వీరభద్ర స్వామి, చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ రాజు, మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విశ్వరూప్‌, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, నాగేశ్వరావు, గుడివాడ అమర్నాథ్‌, జయరాం, ఉషశ్రీ చరణ్‌, నాగార్జున, వేణుగోపాల కృష్ణ, రాజన్న దొర, కర్ణాటక గవర్నర్‌ తవర్‌ చంద్‌ గేహ్లాట్‌, ఎంపీలు రఘురాం రాజు, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, మిథున్‌ రెడ్డి, సీఎం రమేష్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నిర్మాత బండ్ల గణెళిష్‌, నటుడు రాజేంద్ర ప్రసాద్‌, రక్షణ శాఖ సలహాదారుడు సతీష్‌ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వీఐపీలకు 4వేల పాసులు జారీ చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటల పాటు ప్రముఖులను దర్శనానికి అనుమతించా మన్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన 70 వేల మంది భక్తులను నిత్యం దర్శనానికి అనుమతిస్తామన్నారు. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడిరచారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు