Sunday, May 19, 2024

పివికి ఘనంగా నివాళి

తప్పక చదవండి
  • ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన గవర్నర్‌
  • దార్శనికుడు పివి అని స్మరించిన సిఎం రేవంత్‌

హైదరాబాద్‌ : దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని గవర్నర్‌ తమిళపై, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద వీరు నివాళులర్పించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం పీవీ జ్ఞాన భూమి వద్ద సీఎం, మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, నేతలు పివికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని సీఎం పేర్కొన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్‌, జైపాల్‌ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అని రేవంత్‌ అన్నారు.

తెలంగాణ భవన్‌లో నివాళి అర్పించిన భట్టి

- Advertisement -

తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతమన్నారు. విద్యా వ్యవస్థ, అనేక సామాజిక మార్పులకు ఎంతో కృషి చేశారన్నారు. పీవీ నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టడం అందరికి గర్వకారణమన్నారు. మొట్టమొదటి సారి గురుకుల పాఠశాలల రూపకల్పన ఘనత పీవీ కే దక్కుతుందన్నారు. భూ సంస్కరణలు అమలు చేసిన చేసిన సాహసి పీవీ నరసింహారావు అని కొనియాడారు. పీవీ నరసింహారావు లాంటి శక్తివంతమైన నాయకుడిని ప్రధానిని చేసింది కాంగ్రెస్‌ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.. తెలంగాణ భవన్‌ లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో రెసిడెంట్‌ కమిషనర్‌ డా.గౌరవ్‌ ఉప్పల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరయ్యి పి.వి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు ఆర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని అలాంటి పీవీ తెలంగాణలో పుట్టడం గర్వంగా భావిస్తున్నానన్నారు. చిన్న నాటి నుంచే పీవీకి దేశం అంటే చాలా ప్రేమ అని అదే విధంగా ఆయనకు అనేక భాషలపై మంచి పట్టుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు పీవీ నరసింహారావు అని అన్నారు. పీవీ నరసింహారావు ఎన్నో గొప్ప సాహస నిర్ణయాలు తీసుకున్నారు అని తెలిపారు. పీవీ పాలనా దక్షత ఇతర రాష్టాల్రకు ఉదాహరణగా నిలిచిందని,ఆయన పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకమని, దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా పీవీ కీలక భూమిక పోషించారన్నారు. అదే విధంగా పీవీ పాలనా దక్షత అనితర సాధ్యం అని ఆయన చెప్పారు. పీవీ ఆలోచనలను, మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భవిష్యత్‌ తరాలు నడుం బిగించడమే, మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్‌ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు