Monday, April 29, 2024

తెలంగాణ ఒక పుణ్యభూమి : కాంగ్రెస్..

తప్పక చదవండి
  • తెలంగాణాలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ..
  • ప్రారంభమైన బస్సు యాత్ర..
  • రామప్పలో పూజలు చేసిన ప్రియాంక, రాహుల్..
  • బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రజలు గోస పడుతున్నారు..
  • తెలంగాణ ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ రావాలి : ప్రియాంక..
  • అభివృద్ధి అనే గ్యారెంటీతో వస్తున్నాం : రాహుల్ గాంధీ..
  • సోనియా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది : రేవంత్ రెడ్డి..
  • ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపు ఖాయం : సీతక్క..

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శ్రీకారం చుట్టారు. ముందుగా వారిద్దరు 13వ శతాబ్ధానికి చెందిన రామప్ప ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు నుంచి పార్టీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.

బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రజలు గోస పడుతున్నారు : ప్రియాంక గాంధీ..
రామాంజపురంలో కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రజలు ఆనందంగా లేరు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది.” అని ప్రియాంక గాంధీ అన్నారు.

- Advertisement -

అభివృద్ధి అనే గ్యారెంటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం : రాహుల్ గాంధీ..
అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. తెలంగాణలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన కొనసాగడం లేదని పేర్కొన్నారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుందంటూ మండిపడ్డారు. రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని.. కానీ.. తెలంగాణ విషయంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ గౌరవించి తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని విమర్శించారు. అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్‌ మోసం చేసి పాలన చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగిందని.. అందుకే తాము రద్దు చేస్తామనన్నామని తెలిపారు. రూ.లక్ష రుణమాపీ అన్నారు..చేయలేదని పేర్కొన్నారు. మూడెకరాల భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పాలన చేయడం లేదని దుయ్యబట్టారు..

రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా కుటుంబం ముందుకు వచ్చింది : రేవంత్ రెడ్డి..
“తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది… కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి.” అని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ను ఓడించలేరు : ఎమ్మెల్యే సీతక్క..
కాంగ్రెస్ సభలో సీతక్క మాట్లాడుతూ ములుగులో అనేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలే నాదేవుళ్లు. నియోజకవర్గం విడిచి నేను ఎక్కడికీ వెళ్లను.” అని సీతక్క అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు