Tuesday, October 15, 2024
spot_img

కొత్త డ్రామా షురూ చేసిన దొరవారు..

తప్పక చదవండి
  • గెలవాలనే ప్రయత్నంలో కుయుక్తులకు శ్రీకారం..
  • ఛీ కొట్టిన చేతులతోనే కాళ్లుపట్టుకుంటున్న వైనం..
  • మరోసారి మాయా నాటకానికి తెర తీసిన మోసపూరితం..
  • ఒకప్పుడు తెలంగాణ పోరాట యోధులను పూచికపుల్లగా తీసేసారు..
  • ఇప్పుడు వారినే ఆయుధాలుగా వాడుకోవాలని చూస్తున్నారు..
  • గెలుపుకోసం గడ్డి కారుస్తున్న సోకాల్డ్ రాజకీయ వేత్తలు..
  • తెలంగాణ సమాజమా సిగ్గుపడు..
  • నిజాలు తెలుసుకుని ముందుకు నడు..

అవసరమైతే అల్లం కూడా బెల్లంలా వాడుకుంటాం.. ఇది లోకంలో మనం చూస్తున్న నగ్న సత్యం.. అవసరానికి కాళ్ళు పట్టుకోవడం.. అవసరం తీరాక జుట్టు పట్టుకోవడం.. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న.. ఇదే ప్రస్తుతం అధికార పార్టీలో జరుగుతున్న తంతు.. తమ అవసరాలు తీరేంతవరకు సాంతం నాకేసి.. ఎంగిలి విస్తరాకులా విసిరేసే వాళ్ళు.. అవసరమైతే ఆ పడేసిన విస్తరాకు ఏరుకుని వచ్చి కడిగేసుకుని వాడేసుకుంటారు.. తమకు మేలు జరుగుతుంది అంటే ఎంతకైనా దిగజారడానికి సిగ్గు పడరు.. ముఖం మీద పడ్డ ఎంగిలిని సైతం తుడిచేసుకుని వెళ్లిపోతుంటారు.. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార బీ.ఆర్.ఎస్. పార్టీలో ఇలాంటి ప్రసహనమే జరుగుతోంది.. వీళ్ళను చూసి ఉన్నతమైన రాజకీయాలు సైతం సిగ్గుతో తలదించుకుంటున్నాయి..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు ఎందరెందరో..? ప్రాణ త్యాగాలు చేసిన వారు వేలల్లో ఉన్నారు.. ఇవన్నీ మన కళ్ళముందే జరిగాయి.. చివరికి ప్రత్యేక తెలంగాణ సిద్దించింది.. ఈ పోరాటంలో ముందుండి చొరవ చూపిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. ఆతరుణంలో తెలంగాణ పోరాట యోధులు, విద్యార్థులు, ఉద్యోగులు ఒక్కరేమిటి అన్ని వర్గాల వారు ఎంతగానో సంతోషించారు.. ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదు.. ఇది పచ్చి నిజం.. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పోరాటంలో పాలుపంచుకున్న వారిని, వారి కుటుంబాలను నెత్తిమీద పెట్టుకుని పూజిస్తాను అని చెప్పడం జరిగింది.. ఉద్యమకారులంతా ఎంతగానో పొంగిపోయారు.. తెలంగాణ తల్లి ఒడిలో సేద తీరవచ్చు, ఆమె నీడలో గర్వంగా బ్రతకవచ్చు అని భావించారు.. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి.. తెలంగాణలోని అన్ని వర్గాలు దగా పడ్డాయి.. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అంటూ ఆక్రోశానికి గురైపోయాయి..

- Advertisement -

కాగా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా.. కేసీఆర్ వెంట నడిచారు.. ఓరకంగా చెప్పాలంటే.. వారు ఆయనను కాపాడుకున్నారు అని చెప్పవచ్చు.. వీరందరి సహకారంతో తెలంగాణ సాకారం అయ్యింది.. ఆ క్రెడిట్ ని కేసీఆర్ ఒక్కడే సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. మెల్లిమెల్లిగా ఉద్యమకారులను దూరం పెట్టడం మొదలు పెట్టాడు కేసీఆర్.. ఎందుకంటే వారు వెలుగులో ఉంటే తన ఉనికి ఎక్కడ కనుమరుగు అవుతుందో అన్న దురాలోచనతో.. దూరాలోచనచేశాడు.. తన నక్కజిత్తుల మెదడుకు పనిబట్టి.. ఉద్యమకారులు వారంతట వారే పార్టీకి, ప్రభుత్వానికి దూరం అయ్యేలా చేయగలిగాడు.. ఈ పదేళ్లు తన ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగించాడు.. తెలంగాణ సంపదను కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారు.. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను అప్పుల కొలిమిలోకి నెట్టేశాడు.. ఈయనగారి తతంగం అంతా కూలంకుషంగా గమనించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గద్దె దింపడానికి సిద్ధం అయ్యారు.. ఈ నిజాన్ని గ్రహించిన కేసీఆర్ మరోసారి తన నక్కజిత్తుల మెదడుకు పని చెప్పాడు.. ఎవరినైతే కాదనుకుని దూరం పెట్టాడో.. అలాంటి ఉద్యమకారుల కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అయ్యారు.. ఏ ఉద్యమకారుల సహకారంతో తెలంగాణ వచ్చిందో..? ఏ ఉద్యమకారుల దయాభిక్షతో తాను ముఖ్యమంత్రి కాగలిగారో..? ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో అదే ఉద్యమకారుల అండతో తిరిగి గద్దెనెక్కడానికి కుయుక్తులు పన్నుతున్నాడు..

అందులో భాగంగానే మొన్న గాయకుడు, ఉద్యమకారుడు ఏపూరి సోమన్న, మరో ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ, మరొక పేరొందిన ఉద్యమ నేత చెరుకు సుధాకర్ గౌడ్.. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి..

ముందుగా ఏపూరి సోమన్న.. ఈ విప్లవ గాయకుడు కాళ్లకు గజ్జలు కట్టి, గొంతులో విప్లవం నింపుకుని.. కళ్ళల్లో రక్తపు నీళ్లు చిందుతున్నా.. తెలంగాణ ఉద్యమంకోసం అహర్నిషలు తన పాటతో చైతన్యాన్ని తీసుకుని వచ్చారు.. తెలంగాణ వచ్చాక తమ ఆశలు, ఆశయాలు నెరవేరకపోవడంతో.. అధికార ప్రభుత్వంపై మర్లబడ్డారు.. ఎవరికోసం వచ్చింది ఈ తెలంగాణ అంటూ.. ఎలుగెత్తి పాడాడు.. కేసీఆర్ కుతంత్రాలపై విప్లవ గీతాలు సంధించారు.. మరి ఏమి జరిగిందో తెలియదు.. ఏ ప్రలోభాలకు లొంగిపోయాడో..? ఏ ప్రయోజం ఆశించి కేసీఆర్ పక్కన చేరాడో..? అన్నది అర్ధం కావడం లేదు.. సోమన్న అభిమానుల మనస్సులో కదలాడుతున్న భావం ఇది.. మరి జవాబు దొరుకుతుందో..? లేదో..? వేచి చూడాలి..

అలాగే జిట్టా బాలకృష్ణ.. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమకారులతో బాటు, అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని పలు సభల్లో.. విమర్శల వర్షం కురిపించారు.. బాహాటంగానే కేసీఆర్ వైఖరిపై విరుచుకుపడ్డారు.. ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. కానీ ఏమి జరిగిందో తెలియదు.. పరిస్థితుల ప్రభావం ఆయనపై ఎలాంటి ఒత్తిడులు కలిగించాయో తెలియదు.. ఈయన కూడా ఎలాంటి లాభం ఆశించి గులాబీ కండువా కప్పుకున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి..

ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నాయకులు చెరుకు సుధాకర్.. డాక్టర్ గా మొదలైన ఈయన ప్రయాణం.. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా సాగింది.. ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.. అవమానాలను సహించారు.. నిఖార్సైన ఉద్యమకారుడిగా ఈయన అత్యంత గుర్తింపు తెచ్చుకున్నారు.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. పరిపాలనలో పొడసూపిన పొరబాట్లను, జరుగుతున్న అన్యాయాలను సహించలేక కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎన్నెన్నో ఉద్యమాలు చేశారు.. జైలు పాలైయ్యారు.. చివరకు ఈయన కొడుకు కూడా ఎన్నెన్నో నిర్బంధాలకు, దాడులకు గురైయ్యారు.. ఇంత జరిగినా ఈయన కూడా గులాబీ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది.. కేసీఆర్ కి వ్యతిరేకంగా సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు.. మరి తెరవెనుక ఏమి జరిగిందో..? తెలియడం లేదు..

వీరంతా డబ్బుకు లొంగారా..? ప్రలోభాలకు పడిపోయారా అన్న మీమాంసలో తెలంగాణ ప్రజలు అర్ధంకాని పరిస్థితుల్లో ఉన్నారన్నది వాస్తవం.. వీరే కాదు ఇంకెంతమంది ఉద్యమకారులు ఇలా లొంగిపోతున్నారు..? అన్నది బాధాకర విషయమైనదిగా చెప్పుకోవచ్చు.. చూద్దాం కాలం ఎలాంటి సమాధానం చెబుతుందో..?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు