Monday, May 6, 2024

పంటవ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం

తప్పక చదవండి
  • పంజాబ్‌ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
  • పంజాబ్‌ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన ధర్మాసనం

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక ప్రాంతాలను వాయుకాలుష్యం కోరల్లో బందీ చేస్తున్న పంటవ్యర్థాల కాల్చివేతపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంటవ్యర్థాలను తగులబెట్టడం హత్యతో సమానం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ పంజాబ్‌ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పంట వ్యర్థాలను తగులబెడుతున్న ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది. ‘‘ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య. పరస్పర రాజకీయ విమర్శలు, నిందారోపణలు మాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించింది. ‘‘బలవంతపు చర్యలు చేపడతారో లేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతులు అమలు చేస్తారో మాకు తెలియదు. కానీ తక్షణమే ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వరి పంట కేవలం దక్షిణాదికే పరిమితం కాలేదు. ఉత్తరాదిన పంజాబ్‌ భారీస్థాయిలో వరి సాగు చేస్తోంది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి హిమాలయ రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తారు. అయితే పంజాబ్‌లో యంత్రపరికరాల వినియోగం ఎక్కువ. పంట కాపుకొచ్చిన తర్వాత దాన్ని యంత్రాల ద్వారానే కోసి, వరి ధాన్యాన్ని వేరు చేస్తుంటారు. అయితే యంత్రాల ద్వారా జరిగే వరికోతలో భూమి నుంచి కనీసం మోకాలు ఎత్తు వరకు పంట వ్యర్థాలు మిగిలిపోతాయి. వాటిని తగులబెట్టడం ద్వారా ‘రబీ’ పంటల సాగు కోసం భూమిని సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ పంట వ్యర్థాల కాల్చివేతే ఢల్లీిలో పెరుగుతున్న వాయుకాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సమయానికి శీతాకాలం ప్రారంభమై పొగమంచు ఏర్పడుతుంది. ఇది కాలుష్య కారకాలను భూ ఉపరితల వాతావరణంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దాంతో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటి ప్రాణాంతకంగా మారుతోంది.ఈ నేపథ్యంలో పంటవ్యర్థాలను తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించేలా రైతులకు అవగాహన కల్గించాలని గతంలోనే సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హర్యానా ఈ విషయంలో కొంతమేర సఫలమైనప్పటికీ పంజాబ్‌ నుంచి ఏమాత్రం స్పందన కనిపించలేదు. పైపెచ్చు పంటవ్యర్థాలు తగులబెడుతున్న రైతులకు నచ్చజెప్పేందుకు వెళ్లిన అధికారులను ఘెరావ్‌ చేసి, వారితోనే నిప్పు పెట్టించిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రత్యామ్నాయ విధానాలు రైతులకు ఆర్థిక భారాన్ని కల్గిస్తున్నాయి. అందుకే రైతులు సునాయాసమైన కాల్చివేత విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించే రైతులకు ఆర్థికంగా చేయూత, ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేసినట్టయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఢిల్లీ వాయుకాలుష్యానికి కారణమవుతున్న పరిస్థితుల్లో వాహన ఉద్గారాలు రెండవది. నగరంలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాహన కాలుష్యం తగ్గించేందుకు చేపట్టిన చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆ ప్రకారం కాలుష్య స్థాయిలను తగ్గించడం కోసం రోజుకు 3,200 వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాలుష్యాన్ని అరికట్టడానికి, వాహనాల కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం 385 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను మోహరించినట్టు వెల్లడిరచింది. కాలుష్య ఉల్లంఘనలపై 27,743 చలాన్లు జారీ చేసినట్లు చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు కాలుష్య ఉల్లంఘనలకు సంబంధించి 1,93,585 చలాన్లు జారీ చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 నుంచి 15 ఏళ్లనాటి 32 డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపింది. అక్టోబర్‌ 2023 వరకు 15 ఏళ్ల కంటే పాతవైన 14,885 వాహనాలను జప్తు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడిరచింది. మరోవైపు నవంబర్‌ 13 నుంచి 20వ తేదీ వరకు ఆడ్‌-ఈవెన్‌ (సరి, బేసి) విధానాన్ని అమలు చేస్తున్నందున రోడ్డు మీదకు వచ్చే వ్యక్తిగత వాహనాల సంఖ్య దాదాపు సగం తగ్గుతుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు వాహనాల రాకపోకల కారణంగా తలెత్తు ధూళి కాలుష్యాన్ని అరికట్టేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు ఢల్లీి ప్రభుత్వం తెలిపింది. రోడ్లపై ఉన్న దుమ్మును శుభ్రం చేసేందుకు 86 వాక్యూమ్‌ మిషన్లను అమర్చామని, అందులో 83 యంత్రాలు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో రోడ్లపై నిరంతరం పని చేస్తున్నాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్‌ 2023 నాటికి 2,861 కి.మీ రోడ్లను యంత్రాల ద్వారా శుభ్రపరిచామని, అన్ని యంత్రాలను 24 గంటలు జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, రోడ్లపై దుమ్మును శుభ్రం చేయడానికి ఉద్యోగులకు క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తున్నామని, సీనియర్‌ అధికారులతో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. రోడ్లపై దుమ్మును అణిచివేసేందుకు 345 నీళ్లు చల్లే వాహనాలను నడుపుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ రోడ్లపై ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి మొత్తం 311 యాంటీ స్మాగ్‌ గన్‌ (నీటిని తుంపరగా మార్చి వెదజల్లే యంత్రం)లు పనిచేస్తున్నాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.ఢిల్లీలోని చాలా చోట్ల 100 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలపై యాంటీ స్మాగ్‌ గన్‌లను అమర్చినట్టు వెల్లడిరచింది. జనవరి 2023 నుండి సెప్టెంబర్‌ 2023 వరకు, ఢిల్లీలోని 27,570 రోడ్లపై గుంతలకు మరమ్మతులు చేశామని, దీని కారణంగా రోడ్లపై తలెత్తే దుమ్ము సమస్య పరిష్కారమయిందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ 591 బృందాలను ఏర్పాటు చేసి, వ్యర్థాలను డంపింగ్‌ చేయడం నుంచి కాలుష్యాన్ని అరికట్టడానికి పగలు, రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఢిల్లీప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ లో నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయడానికి 7,813 సైట్‌లను సందర్శించామని, నిబంధనలను ఉల్లంఘించినందుకు 1,657 నిర్మాణ స్థలాలను వెంటనే మూసివేశామని, నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.435.35 లక్షల జరిమానా విధించామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రధాన నిర్మాణ స్థలాల్లో మొత్తం 233 యాంటీ స్మాగ్‌ గన్‌లను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో బహిరంగంగా చెత్తను కాల్చడాన్ని అరికట్టేందుకు మొత్తం 611 బృందాలను నియమించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు