Wednesday, May 15, 2024

నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

తప్పక చదవండి
  • పార్టీకి మండవ వెంకటేశ్వర రావు గుడ్‌బై
  • నేడు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

నిజామాబాద్‌ : ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. శనివారం బోధన్‌లో రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. గతంలో కెసిఆర్‌ పిలుపుతో బిఆర్‌ఎస్‌లో చేరినా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీలో మండవ వెంకటేశ్వరరావు పలు కీలక పదవులు చేపట్టారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అగ్రనేతల ఆహ్వానం మేరకు మండవ పార్టీ కండువా కప్పుకోనున్నారు. మండవ వెంకటేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్‌ శాఖ, విద్యా శాఖ, భారీ నీటిపారుదల శాఖల మంత్రిగా పని చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలు చాలా మంది హస్తం పార్టీకి క్యూకడుతున్నారు. శుక్రవారం అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ గూటికి చేరగా.. మరో మాజీ మంత్రి కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరతారు. గత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు.. అప్పట్నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆయన గతకొంతకాలంగా కారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో సెటిలర్ల ఓట్లపై మండవ ప్రభావం చూపే అవకాశం ఉంది. నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడలో సెటిలర్ల జనాభా ఎక్కువ. సెటిలర్లకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారని మండవకు పేరుంది. దీంతో సెటిలర్లు కాంగ్రెస్‌ వైపు చూసే అవకాశముంది.మండవ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో తొలిసారి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పని చేశారు. మండవ వెంకటేశ్వరరావు 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత 2004 టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2008 (ఉప ఎన్నిక) 2009, 2010 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరారు. తాజాగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు