Friday, May 10, 2024

బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న

తప్పక చదవండి
  • రెండుసార్లు బిహార్‌ సీఎంగా పని చేసిన కర్పూరీ థాకూర్‌
  • శతజయంతి సందర్భంగా ప్రకటించిన కేంద్రం
  • 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ..
  • తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్‌ రికార్డు
  • బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న

హైదరాబాద్‌ : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. 1924 జనవరి 24న ఆయన జన్మించారు. నేడుఆయన శతజయంతి నేపథ్యంలో రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనను వెలువరించింది. 1952లో తాజ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్‌ పార్టీ తరఫున విధాన సభకు ఎన్నికయ్యారు. ఉద్యోగులు, కార్మికుల తరఫున ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బిహార్‌లో తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్‌ రికార్డులకెక్కారు. సోషలిస్ట్‌ పార్టీ తొలి సీఎం కూడా ఆయనే కావడం విశేషం. 1970 డిసెంబర్‌ నుంచి 1971 జూన్‌ వరకు సోషలిస్ట్‌ పార్టీ/భారతీయ క్రాంతి దళ్‌ తరఫున ఆయన సీఎంగా పని చేశారు. మళ్లీ 1977 డిసెంబర్‌ నుంచి 1979 ఏప్రిల్‌ వరకు జనతా పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించా రు. కర్పూరీ థాకూర్‌ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆయన హయాంలో బిహార్లో అనేక స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆయన పేదల పాలిట పెన్నిధిగా గుర్తింపు పొందారు. బిహార్‌లో ప్రముఖ నేతలైన లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, నితీశ్‌ కుమార్‌, దేవేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ తదితరులకు కర్పూరీ థాకూర్‌ మార్గదర్శిగా వ్యవహరించారు. 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కర్పూరీ థాకూర్‌ కన్నుమూశారు. ఆయన పేరిట స్టాంపులను రిలీజ్‌ చేయడంతోపాటు.. జన్‌ నాయక్‌ పేరిట దర్భంగా, అమృత్‌ సర్‌ మధ్య రైలును నడుపుతున్నారు. కర్పూరీ థాకూర్‌ (మరణానంతరం) భారతరత్న పురస్కారానికి ఎంపికవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేశారని మోదీ కొనియాడారు. సమానత్వం కోసం, సాధికారిత కోసం విశేష కృషి చేసిన ఆయనకు శతజయంతి సందర్భంగా భారతరత్న పురస్కారం ఇవ్వడం ఆయన సేవలకు సరైన గుర్తింపు అని మోదీ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు