Tuesday, April 30, 2024

45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్

తప్పక చదవండి
  • చెరో 3 వికెట్లు తీసిన షహీన్ అఫ్రిది, వసీం జూనియర్
  • హరీస్ రవూఫ్ కు రెండు వికెట్లు

ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు ఎదురవుతున్నా బంగ్లాదేశ్‌ ఆటతీరు మారడం లేదు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్‌ అయింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా (70 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా లిటన్‌ దాస్‌ (45), కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (43)లు ఫర్వాలేదనిపించారు. పాక్‌ పేసర్లలో అఫ్రిది, మహ్మద్‌ వసీం జూనియర్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే వరుస షాకులు తాకాయి. తొలి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ పరుగులేమీ చేయకుండానే షహీన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో ఔటవడంతో బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. అఫ్రిది అదే ఊపులో తన తర్వాత ఓవర్లో నజ్ముల్‌ శాంతో (4)ను పెవిలియన్‌కు పంపాడు. హరీస్‌ రౌఫ్‌ ఆరో ఓవర్లో ఆఖరి బంతికి ముష్పీకర్‌ రహీమ్‌ (5)ను ఔట్‌ చేశాడు. 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మహ్మదుల్లా, లిటన్‌ దాస్‌లు ఆదుకున్నారు. ఈ ఇరువురూ నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. ఈ జోడీని ఇఫ్తికార్‌ విడదీసి బంగ్లాను కుదురుకోనీయకుండా చేశాడు.

- Advertisement -

లిటన్‌ దాస్‌ నిష్క్రమణ తర్వాత వచ్చిన కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌తో కలిసి మహ్మదుల్లా ఐదో వికెట్‌కు 28 పరుగులు జతచేశాడు. అయితే అర్థ సెంచరీ తర్వాత మహ్మదుల్లాను షహీన్‌ అఫ్రిది బౌల్డ్‌ చేయడంతో బంగ్లా కష్టాలు రెట్టింపయ్యాయి. తౌహిద్‌ హృదయ్‌ (7) కూడా విఫలమయ్యాడు. ఆఖర్లో మెహిది హసన్‌ మిరాజ్‌ (30 బంతుల్లో 25, 1 ఫోర్‌, 1 సిక్స్‌) మెరుపులతో బంగ్లా 200 మార్కు దాటింది. షకిబ్‌ – మెహిది హసన్‌లు ఏడో వికెట్‌కు 48 బంతుల్లో 45 పరుగులు జోడించారు.

పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌.. ప్రపంచకప్‌ సెమీస్‌ రేసు నుంచి తప్పుకున్నా 2025లో జరుగబోయే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో క్వాలిఫై కావాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తర్వాత ఆడబోయే రెండింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌-8లో చేరాల్సి ఉంటుంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్తాన్‌తో పాటు ప్రస్తుత ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ -7 జట్లు మాత్రమే ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇటీవలే ఓ ప్రకటన వెల్లడించిన విషయం తెలిసిందే. మరి బంగ్లా బ్యాటర్లు విఫలమైన చోట బౌలర్లు అయినా ఆ జట్టు కలను నెరవేరుస్తారేమో చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు