Monday, May 6, 2024

పాలకులం కాదు.. సేవకులం..

తప్పక చదవండి
  • ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన
  • ఆరు గ్యారెంటీలపై సీఎం తొలి సంతకం
  • దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం
  • ప్రగతిభవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు
  • ప్రజలకు అందుబాటులో నేటినుంచి ప్రజాభవన్‌
  • ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామని వెల్లడి
  • ప్రజల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ
  • ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ : పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందని సిఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. దశాబ్దకాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణం చేసిన తరవాత ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనిందన్నారు. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్‌ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా… ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గవర్నర్‌తో పాటు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు వెళ్లిపోయిన తర్వాత కృతజ్ఞతా సభ నిర్వహించారు. ‘జై సోనియమ్మ’ అంటూ సీఎంగా రేవంత్‌ రెడ్డి తన తొలి ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

దశాబ్ద కాలంగా తెలంగాణలో మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రెండో సంతకంగా వికలాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. తెలంగాణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాభవన్‌కు రావొచ్చని, ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌ వద్ద కంచెలను ఇప్పటికే తొలగించామని అన్నారు. ఇవాళ ప్రగతి భవన్‌ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం.. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌ లో ప్రజా దర్బారు నిర్వహిస్తామన్నారు. మేం పాలకులం కాదు.. మేం సేవకులమని.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటానని భరోసా ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు