Sunday, May 19, 2024

మార్క్‌ పాలనకు శ్రీకారం

తప్పక చదవండి
  • ఇంటిలిజెన్స్‌ ఐజిగా శివధర్‌ రెడ్డి
  • ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి నియామకం
  • మొదటి దివ్యాంగురాలికి మొదటి ఉద్యోగం

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తనదైన మార్క్‌ పాలనను ప్రారంభించారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్‌ ఐజీగా శివధర్‌ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయనతో పాటు 11 మంది మంత్రులగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి రేవంత్‌ ప్రసగించారు. ఉపనాస్యం తర్వాత ఆరు గ్యారెంటీలు, ఒక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తూ రేవంత్‌రెడ్డి రెండు సంతకాలు చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్‌.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్‌ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ప్రగతి భవన్‌ ముందు ఏర్పాటు చేసిన ఎత్తయిన గ్రిల్స్‌ను, బారీకేడ్స్‌ను తొలగించేలా రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌ ముందు రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన షెడ్‌ను కూడా తీసేయాలని సూచనలు చేశారు. సామాన్య ప్రజలు కూడా ప్రగతి భవన్‌లోకి వచ్చేలా వీలు ఉండాలన్నది రేవంత్‌ ఉద్దేశం. ఏదో కష్టం చెప్పుకుందామని ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించి మరీ ప్రగతి భవన్‌ దాకా వచ్చే ప్రజలను.. ఇలా బారీకేడ్స్‌, గ్రిల్స్‌ ఏర్పాటు చేసి అడ్డుకోవడం సమంజసం కాదన్నది రేవంత్‌ భావన. అందుకే.. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రగతి భవన్‌కు వచ్చేలోపే ఆ గ్రిల్స్‌, బారీకేడ్స్‌ లాంటి వాటిని అధికారులు తీసేయిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిసేందుకు ఈ గేట్ల వద్దే ప్రజలు పడిగాపులు కాసేవాళ్లనీ.. సీఎం అపాయింట్మెంట్‌ లేదంటూ ఎంతో మంది ఈ గేట్ల నుంచే తిరిగి వెనక్కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్‌ తీసుకున్న నిర్ణయంతో అలాంటి ఘటనలు మళ్లీ కనిపించబోవని తేల్చిచెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీకే మొట్టమొదటి ఉద్యోగం ఇస్తాం’ అంటూ రజనీ అనే దివ్యాంగ యువతికి దాదాపు రెండు నెలల క్రితం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆనాడు ఆ యువతికి ఇచ్చిన హామీని రేవంత్‌ గుర్తుంచుకున్నారు. ‘నా వైకల్యమే నాకు శాపంగా మారింది. నాకున్న పరిమితుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదంటున్నారు. పోనీ ప్రైవేటు ఉద్యోగం చేద్దామన్నా నన్ను ఎవరూ జాబ్‌ లోకి తీసుకోవడం లేదు. ఎంతో కష్టపడి పీజీ చదివాను. మంచి మార్కులు సంపాదించాను. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంటే.. నేనే నా కుటుంబానికి భారంగా మారాను’ అంటూ రజనీ అనే యువతి ఆవేదనకు రేవంత్‌ మనసు కరిగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఉద్యోగం నీదేనంటూ రెండు నెలల క్రితమే రజనీకి ఆయన హామీ ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని మరీ రజనీని తన ప్రమాణ స్వీకారానికి రేవంత్‌ రెడ్డి పిలిపించారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై తొలి సంతకం చేసిన రేవంత్‌ రెడ్డి.. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. అలా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆమెకు ఉద్యోగం ఇవ్వడంపై కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనే కాదు.. అశేష తెలంగాణ జనంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు