Friday, May 17, 2024

తుంగతుర్తి తురుమ్ ఎవరు.?

తప్పక చదవండి
  • తుంగతుర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం హోరాహోరీ..
  • ప్రచారంలో గ్రామాలను జల్లెడ పడుతున్న పార్టీల నేతలు
  • ఇరుపార్టీల్లో గోడ దూకుతున్న క్యాడర్, ఇటోడు అటు.. అటోడు ఇటు…
  • స్థానికత పేరుతో మందుల సామేల్ సైలెంట్ వేవ్..
  • అస్త్ర శస్త్రాలు ఎక్కుపెట్టి, హ్యాట్రిక్ కొట్టాలని గాదరి కిషోర్ యత్నం…
  • అంతిమంగా ప్రజల తీర్పు ఎటువైపు.? తుంగతుర్తి తురుమ్ ఖాన్ గా గెలిచేది ఎవరు..?

హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. జరగబోతున్న శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ బరిలో నిలబడగా, కాంగ్రెస్ పార్టీ నుండి అనూహ్యంగా చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న మందుల సామేల్ పోటీలో బరిలో నిలిచారు. ఇక్కడ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కిషోర్ కుమార్ నాన్ లోకల్ కాగా, స్థానిక సెంటిమెంటుతో ఇక్కడి ప్రజానీకం స్థానికుని కోసం ఉవ్విల్లు ఊరుతున్నారనే గ్రౌండ్ రియాల్టీని పసిగట్టిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీం మందుల సామేలును బరిలోకి దించింది.

ఇక్కడ గెలుపు ఎవరిదైనా, మెజారిటీ ఎప్పుడూ స్వల్పమే..

- Advertisement -

ప్రస్తుత నూతన ఓటర్లు కలుపుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య మొత్తం 2 లక్షల 55 వేల 17 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అద్దంకి దయాకర్ పై గాదరి కిషోర్ కుమార్ 2,379 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందగా, 2018లో మాత్రం కేవలం 1847 ఓట్ల మెజారిటీ మాత్రమే లభించింది. తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ.

గతంలో ఈ నియోజకవర్గము నుండి ఇక్కడ
హేమాహేమీలు తలపడ్డారు. మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నరసింహులు లాంటి రాష్ట్ర నాయకులు ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లో తల పండిన నేతలు ఇక్కడి నుండి పోటీ చేసిన తరుణంలో కూడా గెలిచిన నేతలు ఎవరైనా వారి మెజారిటీ కేవలం 3-4 వేలు దాటలేదని రికార్డులు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి చూస్తే, అత్యధికంగా 13 వేల మెజారిటీ ఒకే ఒక్కసారి మాత్రమే లభించింది. గత రాజకీయ చరిత్రను పరిశీలించి చూస్తే, తుంగతుర్తిలో ఎప్పుడు కూడా ఫైట్ టైట్ గానే ఉంటుందని దీన్నిబట్టి తెలుస్తోంది.

స్థానికత సెంటిమెంటుతో మందుల సామేల్.. హ్యాట్రిక్ కోసం గాదరి కిషోర్ యత్నం…

అధికార పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తికి స్థానికేతరుడైనప్పటికీ ఈ ప్రాంతం ప్రజలు ఆయనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కిషోర్ కు ప్రత్యర్థిగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ తుంగతుర్తికి స్థానికుడు. స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం ఈ మధ్యన తుంగతుర్తిలో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. స్థానికుడు అయితేనే ఈ ప్రాంతంపై మక్కువతో పని చేస్తారని, ఇక్కడి సహజ వనరుల దోపిడీని అరికడతారని ప్రజానీకం అయితే గట్టిగా విశ్వసిస్తోంది. అదే సెంటిమెంటుతో మందుల సామేల్ తన భాణిని వినిపిస్తూ, సైలెంట్ వేవ్ సృష్టిస్తుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గడిచిన పదేళ్ల తన అనుభవం, అభివృద్ధి మంత్రంతో పాటు తనకున్న పార్టీ కార్యకర్తల బలానికి ఆర్థిక బలాన్ని తోడేసి, ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే తపనతో కిషోర్ తన అస్త్ర శాస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఎమ్మెల్యే కిషోర్ గెలుపు కోసం ఆయన సతీమణి గాదరి కమల సైతం గడిచిన కొద్ది రోజులుగా ప్రజాక్షేత్రంలోకి దిగి, ఆమె గడపగడపకు వెళ్లి ప్రతీ ఓటరును కలిసి వస్తున్నారు. తన భర్త గెలుపు కోసం ఆమె తన కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా ప్రచారం కొనసాగిస్తోంది.

గోడ దూకుతున్న క్యాడర్.!
అటోడు ఇటు.. ఇటోడు అటు…

పార్టీల అభ్యర్థులు ప్రచారంలో గ్రామాలను జల్లడ పడుతున్నారు. ఇది ఇలా ఉండగానే ఇరు ప్రధాన పార్టీలకు చెందిన క్యాడర్ కొంతమంది రాత్రికి రాత్రే పార్టీల కండువాలు మార్చేస్తున్నారు. అటోడు ఇటు.. ఇటోడు అటు… ఈజీగా గోడ దూకేస్తున్నారు. బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పదిమంది జాయిన్ కాగానే, మరుసటి రోజునే కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి పదిమంది చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంటుంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఇక్కడ దాపురించింది.

తుంగతుర్తి గెలుపుపై బెట్టింగులు..!

తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు! అన్న అంశంపై తుంగతుర్తి ప్రాంతానికి చెందిన పలువురు హైదరాబాదులో బెట్టింగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు లక్ష రూపాయలకు పైగానే పందెం కాస్తున్నట్లు వినికిడి. ఏది ఏమైనా చివరికి తుంగతుర్తి ప్రజల తీర్పు ఎవరి వైపు రానుందో మరో ఏడు రోజులు వేచి చూడాల్సిందే. తుంగతుర్తికి తురుమ్ ఖాన్ గా ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారో డిసెంబర్ 3న తేలిపోనుంది. అంతిమంగా ప్రజలే ఇక్కడ చరిత్ర నిర్మాతలు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు