Sunday, April 28, 2024

ఉద్యోగుల బదిలీల‌లో ఏం జరుగుతోంది?

తప్పక చదవండి
  • కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన మెరికే జరుగుతున్నాయా?
  • రాష్ట్రంలోని జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌కు ఈ నిబంధనలు వర్తించవా?
  • ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం.. బ‌ల‌హీన‌వర్గాలకు మ‌రో న్యాయమా..?
  • కొంతమంది ఉన్నత అధికారుల ఇష్టానుసారం బదిలీలు
  • ప్రభుత్వ పెద్దలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు
  • ప్రైమ్ ఏరియాలో తమ సామాజిక వర్గాల ఉద్యోగులనే నియమించుకున్నారంటూ ఆరోపణలు
  • పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై ప్రభావం పడే అవకాశం?

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీ రాజ్, విద్యుత్, ఇంకా మరిన్ని శాఖలలో ఉద్యోగ బదిలీలు భారీ ఎత్తున చేపట్టారు. ఈ బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఇప్పటికే చాలామంది ఉద్యోగుల నోట వినబడుతోంది. బదిలీలో ఏమైనా లీలలు జరిగాయా అని అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం బదిలీలను చేపట్టిందని మాకు ఎలాంటి సంబంధం లేదని ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికిని వారి మాటలు నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే దీనికి ఉదాహరణ నిన్న జరిగిన భువనగిరి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల బదిలీలలో అవకతవకలు జరిగాయ‌న్న అనుమానం బలపడుతోంది. తీరా చూస్తే అదనపు కలెక్టర్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాడని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు సంవత్సరాల నిబంధన దాటలేదని తెలుస్తోంది. దీనిపై పూర్తి విచారణ చేపడితే అసలు నిజాలు బయటికి వస్తాయి.

రాష్ట్రంలో జిల్లా ఉన్నతాధికారులకు ఈ నిబంధనలు వర్తించవా?
ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలానికి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. అదేవిధంగా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి భునగిరి ఆర్డీవో గా ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు వీరికి వర్తించవా అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నప్పుడు ఇక్కడ ఎంపీ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉన్నప్పుడు అధికారుల స్థానికతను పరిగణలోకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా లేదా వేచి చూడాలి. ఇక్కడ అధికారికంగా అధికారం ఉన్న వారికి ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి వీరిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -

బదిలీల్లో ఉన్నత వర్గాల ఒక న్యాయం బలహీన వర్గాలకు ఒక న్యాయమా?
రాష్ట్రంలో జరుగుతున్న పలు శాఖల అధికారుల బదిలీల్లో పారదర్శకత లోపించిందని ఏ అధికారిని ఎప్పుడు ఎక్కడకు ట్రాన్స్ఫర్ చేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని, రెండు నెలల లోపే ఒక్కో అధికారికి రెండు మూడు బదిలీలు జరగడం చూస్తుంటే అసలు ఏం జరుగుతోంది అన్న అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. అయితే ఉన్నత వర్గానికి చెందిన కొంతమంది ఉన్నతాధికారులు బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధికారులను బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ వర్గం వారిని తాము అనుకున్న ప్రైమ్ ఏరియాల్లో పోస్టింగులు ఇవ్వడం చూస్తుంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందన్న అనుమానం కలగక మానదు. చాలామంది కలెక్టర్ స్థాయి అధికారులు తమ సీసీలను ఎక్కువ శాతం తమ వర్గం వారిని నియమించుకోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాకుండా ఉంది అని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో ఇద్దరు ముగ్గురు ఉన్నతాధికారుల (ఉద్యోగ సంఘాల నాయకులు) కనుసనల్లోనే బదిలీలు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద కొంతమంది ఉన్నతాధికారులు రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులు మా సామాజిక వర్గం వారేనని మేం ఏది చెప్తే అది నడుస్తుందని అంటున్నారనే వార్తలు బహిరంగంగానే వినపడుతున్నాయి. ఏమైనా వీరి నిర్ణయాలతో ప్రభుత్వ పెద్దలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక అధికారి మూడు సంవత్సరాలు దాటితేనే బదిలీలు ఉంటాయని కానీ నేడు నెలల వ్యవధిలోనే బదిలీలు చేపట్టడం చూస్తుంటే ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు ఈ బదిలీల విషయంలో కలగజేసుకొని బదిలీలను పారదర్శకంగా జరిగేటట్లు చూడాలని కొంతమంది అధికారులు కోరుతున్నారు.

బదిలీల గందరగోళం చూస్తుంటే ఎంపీ ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం
ఈ అయోమయ బదిలీలు గందరగోళం చూస్తుంటే త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొంతమంది మేధావులు అంటున్నారు. ఏదైనా ఎన్నికల అప్పుడు జరిగే బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకే జరగాలని అప్పుడే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఉద్యోగుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు