Monday, December 11, 2023

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసింది

తప్పక చదవండి
  • తెలంగాణ ప్రాంతానికి కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదు
  • నల్లగొండ పట్టణం అభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు
  • నల్లగొండ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది
  • నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కీసీఆర్‌..
  • మానకొండూరు ఆటోవాలాలకు శుభవార్త చెప్పిన సీఎం
  • అధికారంలో రాగానే ఫిట్‌నెస్‌,పర్మిట్‌ ఛార్జీలు రద్దు..
  • సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి..

హైదరాబాద్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌) : కాంగ్రెస్‌ 50 ఏండ్ల హయాంలో తనకంటే దొడ్డుగ, ఎత్తుపొడుగు ఉన్నోళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రని, కానీ ఎవరు గూడా తెలంగాణ ప్రాంతానికి కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని సీఎం కీసీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రజాశీర్వాదసభల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పాలన, పథకాలను ప్రజలకు వివరించటమే కాకుండా..ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పట్టణం అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నల్లగొండ నియోజకవర్గం, పట్టణం అభివృద్ధి చెందాయని చెప్పారు. ‘కేసీఆర్‌ కంటే దొడ్డుగ, ఎత్తుగ ఉన్నోళ్లు చాలా మంది కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. కానీ ఎవరు గూడా తెలంగాణకు మంచినీళ్లు ఇయ్యలే. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉండె తెలంగాణకు మంచినీళ్లు కూడా ఇయ్యలేక పోయిండ్రు. కరెంటు ఇయ్యలే. మరె ఇయ్యాల కరెంటు ఎట్ల వచ్చింది..? మంచి నీళ్లు ఎట్ల వచ్చినయ్‌..? మీరు ఆలోచించాలె. పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తనని చెప్పిన. మధ్యల కరోనా వచ్చి ఓ ఏడాది ఆలస్యమైనా.. ఆ తర్వాత తగిల్నమంటే నల్లగొండ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇదంతా మీ కళ్ల ముందు ఉంది. నల్లగొండకు ఐటీ టవర్‌ కూడా వచ్చేసింది. వెయ్యి, పదిహేను వందల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నయ్‌’ అని సీఎం తెలిపారు. ‘అంతకుముందు రెండు దశాబ్దాలు ఇక్కడ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండె. ఆయన కాలంలో నల్లగొండ పట్టణం ఎట్లుండె..? మంచి నీళ్లు ఎట్లుండె..? కరెంటు ఎట్లుండె..? పని ఏం జరిగింది..? వట్టిగ అడ్డం పొడుగు మాట్లాడు గాదు. నల్లగొండ పట్టణం అప్పుడెట్లుండె, ఇప్పుడెట్లుంది..? అనేది ఆలోచన చేయండి. బీఆర్‌ఎస్‌ వచ్చినంక రూ.200 ఉన్న పెన్షన్‌ రూ.2 వేలు అయ్యింది. భవిష్యత్‌లో దాన్ని రూ.5 వేలకు పెంచుతం. ఆరోగ్యం విషయంలో మేం ఎన్ని చర్యలు తీసుకున్నమో మీరు చూస్తున్నరు. 50 ఏండ్ల కాంగ్రెస్‌ రాజ్యంలో పాత నల్లగొండ జిల్లాకు ఒక్క మెడికల్‌ కాలేజీ రాలే. ఇయ్యాల మూడు మెడికల్‌ కాలేజీలు వచ్చినయ్‌. నల్లగొండలో ఐదారు వందల బెడ్లతోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చింది. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్నం’ అని చెప్పారు. ‘ఇక్కడి రైతాంగానికి నేను మనవి చేస్తున్నా. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరు వస్తది. ఉదయ సముద్రం గతంలో ఎట్లుండె, ఇప్పుడెట్లుంది..? ఇయ్యాల ఉదయ సముద్రం కింద చాలా చక్కటి పంటలు పండుతున్నయ్‌. ఇవన్నీ మీరు ఆలోచించాలె. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తమని ఆ పార్టీ నాయకులు చెప్తున్నరు. ధరణిని తీసేస్తమంటున్నరు. ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నరు. కేసీఆర్‌కు పనిలేక రైతుబంధు ఇచ్చి వేస్ట్‌ చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు ఎట్ల వేస్ట్‌ అయితది..? మీరు మళ్ల భూపాల్‌రెడ్డిని గెలిపియ్యండి.. రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతం. కరెంటు మూడు గంటలు చాలు అంటున్నరు. మూడు గంటల కరెంటు సరిపోతదా..? మరె 24 కరెంటు ఉండాల్నంటె గూడా భూపాల్‌రెడ్డి గెలువాలె’ అన్నారు. అన్ని వర్గాలను ఆదుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్లగొండ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. దీన్ని ఇదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నల్లగొండ వాసుల మీద ఉన్నది. ఏదో కల్లబొల్లి మాటలు నమ్మి గందరగోళమైతే నష్టపోయేది మీరే.. నా దత్తత ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా పని చేసే బాకీ ఉన్నది. తప్పకుండా మీ అభివృద్ధి కోసం భూపాల్‌ రెడ్డి, నేను కలిసి కష్టపడి పని చేస్తాం. మీరు ఊహించనంత అభివృద్ధి కూడా చేసి చూపెడుతాం అని పేర్కొంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
మనకొండూరు సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ఆటో నడిపి జీవనం సాగించే వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ సభా వేదికగా కొత్త స్కీం ప్రకటిస్తున్నట్లు వెల్లడిరచారు. తొలిసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆటోలకు ట్యాక్స్‌లు రద్దు చేశామని.. రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్యాసింజర్‌ ఫిట్‌నెస్‌ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఫిట్‌నెస్‌, పర్మిట్‌ కోసం రూ. 1200 వరకు ఖర్చవుతుందని.. ఆ డబ్బులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ‘కరీంనగర్‌కు నాకూ ఏదో లింకు ఉన్నది. మా కరీంనగర్‌ భీముడు గంగుల కమలాకర్‌ కూడా అదే అన్నరు. నేను ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్‌ వచ్చిన ప్రతిసారీ.. ఎదో ఒక కొత్త స్కీం ప్రకటిస్తా. ఈ సభా వేదికగా ప్రకటిస్తున్నా.. ఆటో నడిపి జీవనం సాగించేవారికి ఇది గుడ్‌న్యూస్‌. మేం మూడోసారి అధికారంలోకి రాగానే.. ఫిట్‌నెస్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం. అని కేసీఆర్‌ ప్రకటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు