Monday, May 6, 2024

హస్తంలో ఐక్యత కరువు

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ పార్టీలో భారీ సంఖ్యలో ఆశావహులు
  • టికెట్‌ కోసం నాయకుల పాట్లు
  • 1006 పైగా అభ్యర్థుల దరఖాస్తులు
  • నియోజకవర్గాల్లో నాయకుల హడావుడి
  • తారాస్థాయికి చేరుతున్న విబేధాలు
  • ఒకరిపై ఒకరు నాయకత్వానికి ఫిర్యాదులు
  • తారాస్థాయికి చేరిన టికెట్‌ కొట్లాట
    హైదరాబాద్‌ : రాబోవు వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టబోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్‌ నాయకులు అంతా పదే పదే చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న విబేధాలు పోయేందుకు దృష్టిసారించలేదన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం, పోటీ అధికం కావడంతో టికెట్‌ కోసం భారీ సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. అందువల్లనే 119 నియోజక వర్గాలకు 1006 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఇప్పటికే ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ వడపోసి.. ఒక్కో నియోజక వర్గానికి ఒకటి, రెండు, మూడు.. ఇలా మూడు క్యాటగిరిల్లో పేర్లను స్క్రీనింగ్‌ కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన.. మురళీధరన్‌ కమిటీ ఎటూ తేల్చకుండా విధివిధానాలకే పరిమితమైంది. తిరిగి సమావేశమవుతామని వెల్లడిరచిన స్క్రీనింగ్‌ కమిటీ ఎప్పుడు అన్నదానిపై ఇప్పటికి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమకంటే తమకే టికెట్‌ వస్తుందంటూ నియోజక వర్గాల్లో నాయకులు హడావుడి చేస్తున్నారు. అయితే నాయకుల మధ్య ఐక్యత లేకపోగా.. విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పోటా పోటీగా ప్రదర్శనలు చేస్తుండడంతో.. కొన్ని నియోజక వర్గాల్లో నాయకుల మద్య పోటీ ఘర్షణకు దారితీస్తున్నాయి. నియోజక వర్గాల వారీగా తీసుకుంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో మల్‌?రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌ రెడ్డిలు గత కొంత కాలంగా తమకు టికెట్లు వస్తాయన్న విశ్వాసంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేక తరచూ ఒకరిపై ఒకరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో తాజాగా ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ.. ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తమకు టికెట్‌ రాదన్న ఆందోళన వారిలో మొదలైంది. మరోవైపు మధయాస్కీకి వ్యతిరేఖంగా గాంధీభవన్‌లో, నగరంలోని పలు ప్రాంతాలల్లో వాల్‌ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు అక్కడ టికెట్‌ ఎవరికి వస్తుందో తెలియక కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఉప్పల్‌ తీసుకుంటే.. అక్కడ గత కొంత కాలంగా రాగిడి లక్ష్మారెడ్డి తమకే టికెట్‌ వస్తుందని పని చేసుకుంటూ పోతున్నారు. అక్కడ మరో ఇద్దరు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఆ ముగ్గురి మధ్య సఖ్యత లేక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ముషీరాబాద్‌లో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తనకే టికెట్‌ వస్తుందని ప్రచారం చేసుకుంటుండగా అక్కడ నుంచి బరిలో నిలబడేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌లు సిద్దమవుతుండడంతో.. తీవ్ర గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్‌లో.. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి తనకే టికెట్‌ వస్తుందన్న విశ్వాసంతో.. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. మరోవైపు కార్పొరేటర్‌ విజయారెడ్డి తమకు టికెట్‌ ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలోకి వచ్చానంటూ.. ఆ సీటు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జూబ్లిహిల్స్‌లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌ రెడ్డి తిరిగి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతూ.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతుండగా.. వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అజారుద్దీన్‌ అక్కడ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు వేశారు
    ఇటీవల ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిరది. మునుగోడులో ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పాల్వాయి స్రవంతి తిరిగి టికెట్‌ వస్తుందన్న విశ్వాసంతో.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. కాని ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చలమల కృష్ణారెడ్డితో పాటు బీసీ నాయకుడు, ఓయు విద్యార్ధి సంఘం నాయకుడు కైలాష నేత.. టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. హుస్నాబాద్‌ టికెట్‌ తనకేనన్న నమ్మకంతో.. ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న పొన్నం ప్రభాకర్‌.. హుస్నాబాద్‌ నుంచి దరఖాస్తు చేశారు. జనగాంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జనగాం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిల మధ్య చిన్నపాటి యుద్దమే జరుగుతోంది. ఆ ఇద్దరు తమకంటే తమకు టికెట్‌ వస్తుందన్న ధీమాతో ఉన్న ఇద్దరు నాయకులు.. ఒకరిమీద ఒకరు.. ఫిర్యాదు చేసుకున్న విషయం ఏఐసీసీకి చేరింది. బీసీ నాయకుడిగా, మాజీ పీసీసీ అధ్యక్షుడిగా తనకే టికెట్‌ ఇవ్వాలని పొన్నాల గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాడు. అదిలాబాద్‌లో ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. తనకే టికెట్‌ అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. కాని ఇక్కడ గత ఎన్నికల్లో ఓటమిపాలైన పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత కూడా తమకే టికెట్‌ వస్తుందని కార్యకర్తలు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఇటీవల ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. వరంగల్‌ ఈస్ట్‌లో గత కొన్ని నెలలుగా తమకే టికెట్‌ అన్న విశ్వాసంతో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రనాథ్‌ రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళుతున్నారు. 2018లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జంగా రాఘవరెడ్డి.. తాను కూడా ఈస్ట్‌ నుంచే పోటీ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పోటాపోటీగా ఇరువురు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున.. ఘర్షణ వాతావరణం ఏర్పడి పార్టీ కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి తమకే టికెట్‌ వస్తుందని ధీమాతో ఉండగా.. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, మరో నాయకుడు మేఘా రెడ్డి ఇద్దరు కూడా టికెట్లు తమకే వస్తాయని పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవ్‌ వనపర్తి అంటూ.. చిన్నారెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ గాంధీభవన్‌లో ప్రదర్శనలు కూడా చేశారు. దేవరకద్రలో బీసీ నాయకుడు ప్రదీప్‌?గౌడ్‌ 2018లో టికెట్‌ ఆశించి చివర క్షణంలో భంగపాటుకు గురయ్యాడు. ఈసారి తనకే టికెట్‌ వస్తుందన్న ధీమాతో ముందుకు వెళ్లుతుండగా మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి తనకే టికెట్‌ వస్తుందని పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
    గజ్వేల్‌లో నరసారెడ్డి టికెట్‌ తనకే దక్కుతుందని భావిస్తుండగా.. బండారు శ్రీకాంత్‌ తనకే వస్తుందని చెబుతున్నారు. పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బండారు శ్రీకాంత్‌ వర్గీయులపై ఇటీవల దాడి జరిగినట్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారు. కొల్లాపూర్‌లో చాలా కాలంగా జగదీశ్వరరావు తనకే టికెట్‌ అంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టికెట్‌ తనకేనని ప్రచారం చేసుకుంటూ ఉండడంతో జగదీశ్వరరావు వర్గీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లో నాయకుల మధ్య అనైఖ్యత ఉంది. టికెట్ల కేటాయింపునకు ముందే ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, విష్ణునాథ్‌, మన్సూర్‌ అలీఖాన్‌లు వర్కింగ్‌ ప్రసిడెంట్లు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుని నియోజక వర్గాల వారీగా నాయకుల మధ్య ఉన్న కలహాలు సర్ధు మనిగించాల్సిన అవసరం ఉంది. కాని ఆ దిశలో ఏలాంటి ప్రయత్నాలు జరగలేదని సీనియర్‌ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నియోజక వర్గాల వారీగాకాని, పార్లమెంటు నియోజక వర్గాల వారీగాకాని టికెట్‌ ఆశిస్తున్న నాయకులతో సమావేశమై టికెట్ల కేటాయింపులో అనుసరిస్తున్న పారదర్శికతను వివరించడంతో పాటు ప్రజాభలం కలిగిన వారికే టికెట్లు వస్తాయన్ననమ్మకం ఆశావహుల్లో కలిగించాల్సి ఉంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు