Monday, April 29, 2024

ధాన్యం టెండర్ల మాయాజాలం!

తప్పక చదవండి
  • గ్లోబల్‌ టెండర్ల పేరుతో మిల్లర్లకు మేలు చేసే వైనం..
  • ఎవరి మిల్లులో ఉన్న ధాన్యానికి వాళ్లే ఓనర్లు..!
  • ధాన్యం కొనుగోళ్లు మొదలు సి.ఎం.ఆర్‌ బియ్యం
    సేకరణ వరకు అన్ని అక్రమాలే..
  • తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ శాఖ
    పనితీరు అట్టర్‌ ప్లాప్‌.!
  • క్వింటా మద్దతు ధర రూ. 2300లకు కొనుగోలు చేసి,
    రూ.1900 లకే మిల్లర్లకు అప్పగించే దుస్థితి..
  • ఒక క్వింటాకు రూ. 400 చొప్పున ప్రభుత్వానికి నష్టం..
  • 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి 1000కోట్లు గోవిందా.!
  • పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి..

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ శాఖ పనితీరు ప్రజలకు విస్మయాన్ని కలుగజేస్తోంది. నిర్లక్ష్యం, నిర్లిప్తత, అసమర్థ పాలనకు ఈ శాఖ అద్దం పడుతోంది. గడచిన 2023 రబీ సీజన్‌ లో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుండి ఒక క్వింటాల్‌ ధాన్యం

కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర, రవాణా, నిల్వ, సెంటర్ల నిర్వహణ ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి క్వింటాకు రూ.2300 చెల్లించి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లర్లకు అప్పగించి, వారి నుండి బియ్యం (సి.ఎం.ఆర్‌) సేకరించి ఎఫ్‌.సి.ఐ కి అప్పగించాల్సి ఉంటుంది.

- Advertisement -


ముందస్తు ప్రణాళిక అంటూ ఒకటి లేకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఊహించని రీతిలో మిల్లర్ల వద్దనున్న 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మొత్తం గ్లోబల్‌ టెండర్ల విధానం ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైందనే చెప్పాలి. పుణ్యకాలం మొత్తం గడిచిపోయిన తర్వాత మిల్లుల్లో ఉన్న ధాన్యం మొత్తం మాయమవుతున్న తరుణంలో ప్రభుత్వానికి ఓ కల వచ్చినట్లుగా గ్లోబల్‌ టెండర్ల విధానం ముందుకు తెచ్చింది. రూ. 200 కోట్ల టర్నోవర్‌, నెట్‌ వర్త్‌ రూ.20 కోట్లు అనే నిబంధనల కారణంగా ఆశించినంతగా టెండర్లు రాకపోవడం, గ్లోబల్‌ టెండర్ల రద్దుకు తెలంగాణలో ఉన్న మిల్లర్లు అంతా సిండికేట్‌ గా మారి, సివిల్‌ సప్లయ్‌ శాఖపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. నిబంధన సడలింపుల కొరకు 23 జిల్లాల మిల్లర్లు కొంతమంది ఏకంగా హైకోర్టులో కేసులు కూడా వేశారు. దీంతో కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా సివిల్‌ సప్లయ్‌ శాఖ పరిస్థితి ఏర్పడిరది.
చివరకు సంబంధిత గ్లోబల్‌ టెండర్ల ప్రకటనను ఆ శాఖ రద్దు చేసుకుంది. మళ్లీ గడిచిన అక్టోబర్‌ 6న ఓ పత్రికలో ఒక మూలకు చిన్న ప్రకటనను జారీ చేసింది. గ్లోబల్‌ టెండర్‌ ప్రకటన అంటే ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా ఉండాలి. కానీ ఈ ప్రకటన ఆ విధంగా లేదు. తెలంగాణ వివిధ జిల్లాల్లో ఉన్న రైస్‌ మిల్లులలో నిలువ చేయబడిన 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మకం కొరకు బిడ్‌ ప్రారంభించి, అక్టోబర్‌ 17న చివరి తేదీగా పేర్కొంది. గతంలో 1 లక్ష టన్నులకు ఒక లాట్‌ ఉండగా, ఇప్పుడు 15 వేల టన్నుల నుండి 25 వేల టన్నులకు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. రూ. 200 కోట్ల టర్నోవర్‌ నుండి కేవలం రూ.10 కోట్ల వార్షిక టర్నోవర్‌ వరకు తగ్గించారు. లక్ష టన్నులు ఉన్న ఒక లాట్‌ ఇప్పుడు కేవలం 15 వేల టన్నులకే కుదించారు.
ఎవరి మిల్లులో ఉన్న ధాన్యానికి వాళ్లే ఓనర్లు.!
అక్టోబర్‌ 6న ప్రకటించిన ఈ సోకాల్డ్‌ గ్లోబల్‌ టెండర్ల విధానం సరళీకృతం చేయడానికి కారణం కేవలం ఆయా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని సంబంధిత మిల్లర్లే దక్కించుకొని, వారంతా సిండికేట్‌ గా మారి, సదరు మిల్లర్లు నిర్ణయించబోయే ధరకే ప్రభుత్వం ఈ 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అయా మిల్లర్లకు అప్పగించే దుస్థితికి తెరలేపిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రైస్‌ మిల్లర్ల ఎత్తుగడల ముందు రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ శాఖ తలవంచక తప్పనట్లు అవుతుందా!
1000 కోట్ల భారీ నష్టం.. ప్రజాధనం లూటీ..!
రైతు నుండి ఒక క్వింటా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.2300 మద్దతు ధర చెల్లించుకునేందుకుగాను సుమారు 30 వేల కోట్ల రూపాయలు నాబార్డు లాంటి సంస్థల నుండి అప్పు తెచ్చింది. ప్రస్తుతం గ్లోబల్‌ టెండర్లలో సంబంధిత బిడ్డర్లు అంతా సిండికేట్‌ గా మారి, కేవలం క్వింటాకు రూ.1900 మాత్రమే చెలించేటట్లు టెండర్లు వేస్తే మాత్రం ప్రభుత్వానికి ఒక క్వింటాకు రూ.400 రూపాయల చొప్పున నష్టం వాటిలే ప్రమాదం లేకపోలేదు. ఇదే నిజమైతే 1000 కోట్ల భారీ నష్టాన్ని సివిల్‌ సప్లయ్‌ శాఖ భరించక తప్పదు. ఏం జరగనుందో వేచి చూద్దాం.!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు