Wednesday, September 11, 2024
spot_img

భారీగా పెరిగిన తెలంగాణ అప్పు

తప్పక చదవండి
  • రాష్ట్ర ఆవిర్భావం నుంచి 10 రెట్లు పెరిగిన అప్పు
  • 2014లో రూ.72,658 కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం
  • అప్పట్లో ఖజానాలో వంద రోజులకు సరిపడా సొమ్ము
  • ప్రస్తుతం రోజు ఖర్చులకూ ఆర్బీఐపై ఆధారపడాల్సి వస్తోంది
  • అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ. 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు ఉండేదని.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇది దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన భారీ అప్పులతో ప్రస్తుతం రోజువారీ ఖర్చులు కూడా లేని పరిస్థితులు తలెత్తాయన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, కోరికలు, కళలు నెరవేర్చాల్సిన భాధ్యత తమ ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నామన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ బడ్జెట్‌కు.. వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు.. వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందని శ్వేతపత్రంలో వెల్లడించారు. 2014- 15లో అప్పు 72,658 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.6,71,757 కోట్లకు అప్పు పెరిగిందన్నారు. అంటే బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్ర అప్పు 5,99,099 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారు. పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదని ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన బుక్‌లెట్‌లో వెల్లడించారు. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం, రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిందన్నారు. రెవెన్యూ రాబడిలో మరో 35 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లిందని.. దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో (2014లో) 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేదని.. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గిందని చెప్పారు. విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయిందని అన్నారు. రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని అనుకుంటున్నామని.. 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు