Sunday, July 21, 2024

చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి నిరసనలు

తప్పక చదవండి
 • ఎక్కడిక్కడే అడ్డుకున్న పోలీసులు
 • నిరసనలపై ఉక్కుపాదం
 • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడు
  అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. మంగళవారం ఆయా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. పోలీసుల వైఖరిపై తెదేపా నేతలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధాలను తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండిరచారు. సైకో రెడ్డి పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్‌ రెడ్డీ.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవని గుర్తుంచుకో అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబుపై జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు. ‘దేవుడికి బాధలు చెప్పే స్వేచ్ఛ కూడా జగన్‌ పాలనలో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ జరిగినప్పటి నుంచి తెదేపా నేతలను గృహనిర్భంధం చేస్తూనే ఉన్నారు. విూ అరాచకాలు బయటపడతాయని భయమా? మా వాళ్లు చేసిన తప్పేంటి? ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారా? పోలీసులు చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారు. హద్దులు దాటి అణచివేతకు గురి చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి పైశాచికానందం పొందుతున్న వైకాపా నేతల మాటల్ని పోలీసులు వినొద్దు. చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తుంటే వారిని అడ్డుకోవడం దేనికి సంకేతం? ఎన్నికలు దగ్గర పడుతున్నా.. రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం‘ అని అచ్చెన్న అన్నారు. గుంటూరులో ర్యాలీ నిర్వహించి పూజలు చేయాలని తెదేపా నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. శారదా కాలనీ ఆర్చ్‌ సెంటర్‌ నుంచి నాజ్‌ సెంటర్‌కు వెళ్లే దారిలో భారీగా బలగాలు మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, డేగల ప్రభాకర్‌, నన్నపనేని రాజకుమారి, జీవీ ఆంజనేయులును గృహనిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్‌ రావాలని ప్రార్థించే హక్కు కూడా లేదా అని నిలదీశారు. ఎన్ని ఆంక్షలు విధించినా ర్యాలీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలో పాదయాత్రకు సిద్ధమైన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఒంటిమిట్ట మండలం
  కొత్తమాధవరం నుంచి రామాలయం వరకు పాదయాత్రకు సిద్ధమవగా.. అనుమతి లేదంటూ కడప డీఎస్పీ షరీఫ్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో కడప`రేణిగుంట రహదారిలో తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖ జిల్లా సింహాచలంలో పూజలు చేసేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొండపైకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ కిందనే నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలంటూ సింహాద్రి అప్పన్నకు మొక్కుకునేందుకు వెళ్తే ఆంక్షలు ఏంటని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేయటానికి రాలేదని.. దర్శనానికి వస్తే అడ్డగింతలు ఏంటని నిలదీశారు. కొండపై 144 సెక్షన్‌ ఉందా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బండారు సత్యనారాయణ మూర్తి, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు ఇతర నేతలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రకు తెదేపా నేతలు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో తెదేపా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, కూన రవికూమార్‌, మాజీ ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేశారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
  అన్నవరం సత్యదేవుని సన్నిధికి తెదేపా శ్రేణుల పాదయాత్రగా వెళ్లారు. మెట్టుమెట్టుకు హారతివెలిగిస్తూ నేతలు, కార్యకర్తలు కొండపైకి చేరుకున్నారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. తెదేపా నాయకులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌, వనమాడి కొండబాబు, చిక్కాల రామచంద్రరావు, వరుపుల సత్యప్రభ, యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
  చంద్రబాబు అరెస్ట్‌పై చెన్నైలో మహిళలు, ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఆయన అరెస్ట్‌ అక్రమమని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల్లో ఉండాల్సిన నాయకుడిని జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ తెలంగాణలోని సంగారెడ్డిలో తెదేపా బైక్‌ ర్యాలీ నిర్వహించింది. జడ్పీ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెదేపా కార్యకర్తలు నల్ల టీషర్టులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు క్షేమం కోరుతూ కూకట్‌పల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు